2020..
కాలప్రవాహంలో కాళ్ళకడ్డం
పడ్డ అంకె!
కరోనా మరణమృదంగ ధ్వనిలో
మనిషికి తోటి మనిషిని
భూతద్దంలో బూచిలా చూపి
భయపెట్టిన అంకె!
అబలలపై మృగ మదాంధుల
దౌష్ట్యాలకు సాక్షీ భూతమైన
అంకె!
కార్పోరేట్ చట్టాలకు వ్యతిరేకంగా
ఢిల్లీ వీధుల్లో పాలకులకు చలి
పుట్టించేలా కదంతొక్కుతోన్న
అన్నదాతల అహింసోద్యమాన్ని
లిఖించిన అంకె!
2021..
కరోనా కోరల్ని పీకే ఔషదాల్ని
పుట్టించే అంకె!
అబల సబల అయి భూమ్యా
కాశాల్లో తానే ఎదిగి స్త్రీ
కంటకుల కంఠాలు కత్తిరించే
అంకె!
రైతే రాజయి పట్టం కట్టుకుని
సాగుబడి బాగుబడి అయి
నేలతల్లి పులకాంకిత అయ్యే
అంకె! కావాలని అకాంక్షిస్తూ..!!
–భీమవరపు పురుషోత్తం, 9949800253