కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో అక్టోబరు 4న జరగవలసిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేయాలన్న విజ్ఞప్తిని సుప్రీమ్‌కోర్టు తిరస్కరించింది. దేశంలో వరదలు, కోవిడ్-19 మహమ్మారి తగ్గుముఖం పట్టే వరకు రెండు నుంచి మూడు నెలలపాటు ఈ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ వాదనపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్టోబరు 4న పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. దీనిపై సుప్రీమ్‌కోర్టు తీర్పు చెబుతూ అక్టోబరు 4న జరగవలసిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేసేందుకు నిరాకరించింది. 2020, 2021 సివిల్ సర్వీసెస్ పరీక్షలను కలిపేయాలన్న వాదనను కూడా తోసిపుచ్చింది.