Take a fresh look at your lifestyle.

తిరోగమన విద్యతో దేశం పురోగమించేదెట్లా?

అనేక భిన్నత్వాల మధ్య కొనసాగుతూ వస్తున్న సాంస్కృతిక ఐక్యతను, సామరస్యాన్ని దెబ్బతీసి, సాంస్కృతిక ఆధిపత్య భావజాలాన్ని పెంపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ధార్మిక సేవా సంస్థల ముసుగులో విద్యా సంస్థల్లోకి మనువాదాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అందులో భాగంగానే మత గ్రంథాలను పాఠ్య పుస్తకాలుగా, సాధువులను ఉపాధ్యాయులుగా నిర్ణయిస్తున్నారు.

(ఈ నెల 17 న తిరోగమనంలో భారతీయ విద్య – ప్రగతి శీల కర్తవ్యాలు అనే అంశంపై మహబూబాబాద్‌ ‌లో విద్యా సదస్సు సందర్భంగా..)

ఏ దేశ భవిష్యత్తు అయినా పురోగమించాలంటే ఆ దేశ విద్యారంగం శాస్త్రీయ అంశాల పునాదిగా తయారై, ప్రగతిని కాంక్షించేదిగా ఉండాలి. ఆ ప్రగతిని, దేశాభ్యున్నతిని కోరుకునే ప్రభుత్వాలేవైనా తమ దేశ విద్యావిధానాన్ని జ్ఞాన సమాజ నిర్మాణానికి అనుగుణంగా రూపొందిస్తారు. కానీ, నేటి జాతీయ విద్యావిధానాన్ని పాలకుల రాజకీయ అవసరాలకు అనుగుణంగా రూపొందించినారు. నమ్మకాలు, విశ్వాసాలే భూమిక గా ఆశాస్త్రీయత, అజ్ఞానాంధకారాలను పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విజ్ఞాన శాస్త్రాల స్థానాన్ని మూఢనమ్మకాలను ప్రోత్సహించే జ్యోతిష్యాలు ఆక్రమించుకు ంటున్నాయి. అనేక భిన్నత్వాల మధ్య కొనసాగుతూ వస్తున్న సాంస్కృతిక ఐక్యతను, సామరస్యాన్ని దెబ్బతీసి, సాంస్కృతిక ఆధిపత్య భావజాలాన్ని పెంపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ధార్మిక సేవా సంస్థల ముసుగులో విద్యా సంస్థల్లోకి మనువాదాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అందులో భాగంగానే మత గ్రంథాలను పాఠ్య పుస్తకాలుగా, సాధువులను ఉపాధ్యాయులుగా నిర్ణయిస్తున్నారు.

ఎన్నో కుల, మత, భాష,ఆహార, భౌగోళిక, సాంస్కృతిక పరమైన వైరుధ్యాలను కలిగి ఉన్నప్పటికీ దేశ పౌరుల ఐక్యతే ఈ దేశ విశిష్టత. ఆ ప్రత్యేకతను ఒకే దేశం – ఒకే జాతి, ఒకే భాష, ఒకే అలవాట్లు, ఒకే మతం అనే ఉద్వేగాలతో విచ్ఛిన్నం చేస్తున్నారు. సుస్థిర అధికార, రాచరిక, ఫాసిస్ట్ ‌విధానాలకు ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవ్వకుండా చూసుకునే వ్యూహంలో భాగంగానే విద్యా వ్యవస్థను తిరోగమన మార్గంలో నడిపిస్తున్నారు. ఆ దిశగా సాగుతున్న రాజకీయాలను, ప్రభుత్వాలను నిలువరించే శక్తి విద్యారంగానికి ఉంది. ఆ విద్యార ంగం లో కీలక భాగస్వాములైన ఉపాధ్యాయులు ఆ బాధ్యతను మోయాల్సి ఉంటుంది. అంధకారాన్ని చీల్చి జ్ఞాన జ్యోతులు వెలిగించే వైజ్ఞానిక విద్యను సాధించడానికి పోరాడాల్సి ఉంది. విద్యను ఆధిపత్య వర్గాలకే పరిమితం చేసిన వేద కాలం నాటి పరిస్థితులను పునరావృతం చేసే కుట్రలను చేధించాల్సిన బాధ్యతను, ఆ దిశగా సమాజంలోని అన్ని వర్గాలను ఐక్యం చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి.

ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు జరుగుతున్న పోరాటాలు ప్రభ్యత్వాలను కదిలించలేని పరిస్థితుల్లో పోరాట వ్యూహాలను మార్చి దేశ వ్యాప్త విద్యారంగ ఉద్యమాలను నిర్మించాల్సి ఉంది. కార్పొరేట్‌ అనుకూల విధానాల వల్ల ముందుగా విద్యకు దూరం కానున్న ఆదివాసీ, గిరిజన ప్రజానీకాన్ని ఐక్యం చేయాల్సి ఉంటుంది. ప్రాథమిక విద్య నుంచి విశ్వ విద్యాలయ స్థాయి వరకు, ఎలిమెంటరీ టీచర్‌ ‌నుంచి ప్రొఫెసర్‌ ‌వరకు ఐక్య ఉద్యమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాలను ఉద్యమ పునాదులుగా ఏర్పరుచుకున్న నాడు ప్రజలే తమ వైజ్ఞానిక విద్య కోసం, తమ పిల్లల బాగు కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం పోరాడతారు. అది మాత్రమే విద్య లో వేళ్లూనుకుంటున్న అన్ని తిరోగమన విధానాలను తిప్పికొట్టగలదు.

ఆ దిశలో విద్యారంగంలో పనిచేస్తున్న అన్ని వర్గాలు తమ శక్తినంతా కూడదీసుకొని ఉద్యమ కార్యాచరణ రూపొందించాలి. భావజాలంలో, రాజకీయ విశ్వాసాల్లో, ఎంచుకునే నిరసన మార్గాల్లో ఉపాధ్యాయ సంఘాల మధ్య వైరుధ్యాలు ఉంటాయి తప్ప పోరాట లక్ష్యంలో మాత్రం కాదు. శాస్త్రీయ, సమానత్వ విద్య అనే లక్ష్యం లో ఏకాభిప్రాయం ఉంటుంది. ఉమ్మడి లక్ష్య సాధనకు ఉమ్మడి పోరాటాల అవసరాన్ని అన్ని వర్గాలు, పోరాట శక్తులు గ్రహించాలి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, విద్యా వ్యతిరేక విధానాలు సృష్టించిన ఉద్యమ అనివార్యత ఐక్యతకు పునాది కావాలి. ఈ అనివార్యత వల్ల ఏర్పడిన అనుకూలతలను సమీకరించి బలమైన శక్తులుగా ఏర్పడి, తిరోగమన విధానాలను అడ్డుకోవడం బుద్ధిజీవుల మొదటి కర్తవ్యం. దానిని నిర్వర్తించడంలో వెనుకబడితే విద్యతో పాటే ఈ దేశం తిరోగమించడం ఖాయం.

– చుంచు శ్రీశైలం, అధ్యక్షులు
టీపీటీఎఫ్‌ ‌మహబూబాబాద్‌ ‌జిల్లా,

Leave a Reply