టిఆర్‌ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ లొల్లి కాస్తా టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలవైపు వేలెత్తి చూపుతోంది. గత రెండు రోజులుగా ఇరువురి మధ్య తీవ్రస్ధాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్నది. ఇరువురుకూడా తమ హద్దులు దాటి విమర్శించుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయా)ను వేడి పుట్టిస్తున్నాయి. ఇరువురి మధ్య కొనసాగుతున్న విమర్శనాస్త్రాల్లో మరికొన్ని కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. నిజామాబాద్ ఎంపి ఎన్నికల్లో కవిత ఓడిపోవడానికి స్వీయ పార్టీ ఎంఎల్‌ఏలే కారణమన్నది అందులో ప్రధానమైంది. టిఆర్‌ఎస్ శ్రేణులు తన ఇంటిపై జరిపిన దాడిని ఖండిస్తూ అరవింద్ మీడియాముందు సంచలనాత్మక కామెంట్స్ చేశారు. అమె ఓటమికి సన్నిహితులైన ఎంఎల్‌ఏలే ఓటమికి కారణమనడం ఇప్పుడు టిఆర్‌ఎస్ వర్గాల్లో సంచలనాన్ని లేపుతున్నది. ఇదే అంశంపైన కాంగ్రెస్ ఎంఎల్సీ జీవన్‌రెడ్డికూడా తాజాగా అదే కామెంట్ చేశారు. ఆయన మాటలు కూడా ఈ అంశాన్ని మరింత బలపర్చేదిగా ఉండడంతో టిఆర్‌ఎస్‌లో అయోమయ పరిస్థితి ఏర్పడింది. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధి జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం ఆమె చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించిన అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడిన తీరు టిఆర్‌ఎస్‌ను మరింతషాక్‌కు గురిచేసింది. నిజామాబాద్‌లో కవిత ఓటమికి ఆ పార్టీ ఎంఎల్‌ఏలే కారణమన్న విషయాన్ని ఆయన ఘంటాపథంగా చెప్పారు. కవిత గెలిస్తే తమపైన పెత్తనం సాగిస్తుందన్న ఉద్దేశ్యంగానే ఎంపి నియోజకవర్గం పరిధిలోని ఏడుగురు శాసనసభ్యులు ఆమెను ఓడించారని ఆయన పేర్కొనడం విస్మయానికి గురిచేస్తున్నది. అమెను కనబడకుండా చేయాలన్నదే వారి ఉద్దేశ్యమన్నారు. ఆ ఎంఎల్‌ఏలు ఒక్కొక్కరికి ముప్పై వేలకు పైగా మెజార్టీ వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, వారు తలుచుకుంటే అమెను గెలిపించేవారేకాని, అమె గెలవటం వారికి ఇష్టంలేదంటూ జీవన్‌రెడ్డి చెప్పినతీరు టిఆర్‌ఎస్ పార్టీలో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితికి దారితీసింది. దీంతో ఇప్పుడు పార్టీలో ఎవరిని నమ్మా)న్నది ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. కాగా కవిత కాంగ్రెస్‌లోకి మారుతున్నారన్న అరవింద్ ప్రకటన కూడా పెద్ద దుమారాన్నే లేపుతున్నది. దీనిపై ఇరు పార్టీల మధ్య యుద్ధాన్ని తలపించేంత మాటల తూటాలు పేలుతున్నాయి. ఇందుకు కెసిఆర్ మాటలే కారణమైనాయి. తన కూతురు కవితను బిజెపిలోకి రావాలని ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఈ నెల 15న జరిగిన టిఆర్‌ఎస్ ఎల్పీ సమావేశంలో పేర్కొనడం ఈ వివాదానికి శ్రీకారం చుట్టింది.
బిజెపికి చెందిన కొందరు ఒత్తిడి చేసిన విషయం నిజమేనంటూ కవిత అంగీకరించడంకూడా బిజెపి, టిఆర్‌ఎస్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకోవడానికి కారణమైంది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా మీడియా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను అడుగుతున్న క్రమంలో పక్కనే ఉన్న అరవింద్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ఆజ్యం పోసింది. కవితను ఎట్టిపరిస్థితిలోనూ బిజెపి ఆహ్వానించదని, ఆమె అవసరం బిజెపికి లేదని అరవింద్ కొట్టిపారేస్తూనే వాస్తవానికి కవిత కాంగ్రెస్‌లోకి వెళ్ళేందుకు ప్రయత్నించింద నడం టిఆర్‌ఎస్‌లో కాక రగిల్చింది. టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చేక్రమంలో కవితకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అలిగి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో ఫోన్‌లో మాట్లాడిందని, అందుకు తన వద్ద సాక్షం ఉందంటూ ఆయన సంచలన కామెంట్ చేశారు. కాంగ్రెస్‌పార్టీ జనరల్ సెక్రెటరీనే తనకు స్వయంగా ఫోన్‌ద్వారా తెలియజేసినట్లు అరవింద్ చేసిన ఆరోపణపై కవిత ఫైర్ అయ్యారు. ఈ ఆరోపణపై ఆమె అగ్రహం కట్టలు తెంచుకుంది. అరవింద్‌పై తీవ్రమైన పదజాలం వాడింది. ఖబర్దార్ అంటూ ఆయన్ను హెచ్చరించింది. నిజామాబాద్‌లో ఓడిన మరుసటి రోజునుండే అరవింద్ తనపైన విమర్శలు చేస్తున్నా ఏనాడు తాను ఇలాంటి పరుశపదాలు వాడలేదని, కాని, ఇప్పుడు అరవింద్ మాట్లాడుతున్న తీరుకు స్పందించకుండా ఉండలేక పోతున్నానంటూ ఆవేశపూరితంగా ఘాటైన పదజాలాన్ని వాడింది.
వాస్తవంగా ఉద్యమ కాలంనుండి ఇప్పటిరకు కవిత ఏ రాజకీయ నాయకులపైన కూడా ఇంత హాట్ కామెంట్ చేయలేదు. అయితే అరవింద్ చేస్తున్న దిగజారుడు కామెంట్స్‌కు తాను స్పందించక తప్పడంలేదని చెబుతున్న కవిత గొంతుక జీరబోయింది. సభ్యతను మరిచి మాట్లాడే విధంగా తనను రెచ్చగొట్టడం వల్లే ఇలా మాట్లాడాల్సి వొస్తున్నందుకు తెలంగాణ సమాజాన్ని ఆమె క్షమాపణ కోరింది. ఇప్పటినుండి ఆరవింద్ వెంటపడడమే తాను పనిగా పెట్టుకుంటానని, వొచ్చే ఏ ఎన్నికల్లో అయినా ఆయన ఎక్కడ నిలబడినా ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తానంటూ శపథం చేసింది. ఒక పక్క వీరిద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతండగానే ఇరు పార్టీల కార్యకర్తలు ఆగ్రహావేశులైనారు. టిఆర్‌ఎస్, జాగృతి శ్రేణులు అరవింద్ ఇంటిపై దాడిచేసి ఫర్నీచర్‌తో సహా, పూలకుండ్లు, ఇతర సామగ్రీని ధ్వంసం చేస్తే, టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై దాడికి బిజెపి, దాని అనుబంధ శ్రేణులు సిద్ధమయినారు. క్రమేణ ఈ వివాదం రాష్ట్ర వ్యాపితమైంది. దాదాపు అన్ని జిల్లాల్లో ఇరు పార్టీల పక్షాన ధర్నాలు, దిష్టిబొమ్మల దగ్ధం, తమ పార్టీ అధినాయకులకు ఫిర్యాదులు చేసుకోవడం, వాస్తవాలపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేయడం, చివరకు ఈ వివాదంలో గవర్నర్ తమిళి సై జోక్యం చేసుకుని, తనకు పూర్తి సమాచారాన్ని అందజేయాల్సిందిగా పోలీస్ ఉన్నతాధికారులను కోరడంతో రాష్ట్ర రాజకీయాలిప్పుడు వేడి ఎక్కాయి.