Take a fresh look at your lifestyle.

జీహెచ్‌ఎం‌సి ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

ఫలితాల వెల్లడిపై రిటర్నింగ్‌ అధికారులదే పూర్తి అధికారం: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌పార్థసారధి

జీహెచ్‌ఎం‌సి ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌పార్థసారధి తెలిపారు. వోట్ల లెక్కింపు ప్రక్రియలో ఫలితాల వెల్లడిపై సంపూర్ణ అధికారం రిటర్నింగ్‌ అధికారిదేనని స్పష్టం చేశారు. ఈమేరకు గురువారం ఆయన జీహెచ్‌ఎం‌సి ఎన్నికల అధికారి, జోనల్‌ ‌కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, రిటర్నింగ్‌ అధికారులతో కౌంటింగ్‌ ‌ప్రక్రియకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌ ‌సందర్భంగా రిటర్నింగ్‌ అధికారులు సిబ్బంది అందరిని సమన్వయం చేసుకుని బాధ్యతాయుతంగా పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాలనీ, ఉదయం 7.30 వరకు సిబ్బంది తమకు కేటాయించిన స్థానాలలో ఆసీనులు కావాలనీ, అనుమతి లేని వ్యక్తులు ఎవరినీ కౌంటింగ్‌ ‌హాల్‌లోనికి అనుమతించకూడదన్నారు.

కౌంటింగ్‌ ‌ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించడం జరుగుతుందనీ, బ్యాలెట్‌ ‌బాక్సులను భద్రపరచిన స్ట్రాంగ్‌ ‌రూమ్‌ అభ్యర్థి లేదా ఏజెంట్‌ ‌సమక్షంలో ఉదయం 7.45కే తెరవాలన్నారు. సందేహాత్మక బ్యాలెట్‌ ‌పేపర్లపై రిటర్నింగ్‌ అధికారులదే తుది నిర్ణయమనీ, నియమ నిబంధనలు ఆకళింపు చేసుకుని పారదర్శకంగా, నిస్పక్షపాతంగా కౌంటింగ్‌ ‌నిర్వహించాలనీ, ప్రతీ రౌండు తరువాత ప్రతీ టేబుల్‌ ‌వద్ద కౌంటింగ్‌ ఏజెంట్ల సంతృప్తిమేరకు వారి సంతకాలు సేకరించాలన్నారు. మొబైల్‌ ‌ఫోన్లు కౌంటింగ్‌ ‌సెంటర్‌లోనికి అనుమతించరాదనీ, ధూమపానం నిషేధమనీ, కౌంటింగ్‌ ‌సమయంలో రిలీఫ్‌ ఏజెంట్లు ఉండరని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ ‌ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది కోవిడ్‌ 19 ‌నిబంధనలు తప్పనిసరిగా పాటించాలనీ, సిబ్బంది మాస్క్, ‌ఫేస్‌ ‌షీల్డ్ ‌విధిగా ధరించాలని ఈ సందర్భంగా పార్థసారధి స్పష్టం చేశారు.

ఎక్స్ అఫీషియో వోటు హక్కుపై హైకోర్టులో పిటిషన్‌
‌జీహెచ్‌ఎం‌సి ఎన్నికల కౌంటింగ్‌ ‌నేపథ్యంలో ఎక్స్ అఫీషియో వోటు హక్కుపై హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలైంది. మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వినియోగించుకునే వోటు హక్కును సవాల్‌ ‌చేస్తూ బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్‌ ‌కుమార్‌ ‌గురువారం హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. జీహెచ్‌ఎం‌సి చట్టంలోని సెక్షన్‌ 90(1)‌ని కొట్టివేయాలని అనిల్‌కుమార్‌ ‌పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎం‌సికి నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 4కు వాయిదా వేసింది.

Leave a Reply