రాష్ట్రాల సిఎస్లతో కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌభ
కొవిడ్-19 టీకా పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌభ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. శనివారం అన్నిరాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెప్టినెంట్ గవర్నర్లతో కరోనా టీకా పంపిణీ ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సక్షించారు.
డ్రై రన్ అనుభవాలను పరిగణనలోకి తీసుకొని సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సార్వత్రిక టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా తొలి విడుత ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్లతోపాటు 50 ఏండ్ల పైబడిన వారికి టీకా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. టీకా పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర కేబినెట్ కార్యదర్శికి వివరించారు. పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని, వైరస్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వారికి సైతం టీకా ఇవ్వాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ అభ్యర్థన మేరకు ప్రజాప్రతినిధులకు సైతం వ్యాక్సిన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సామ్ రిజ్వి, డ్రగ్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ప్రీతి నా, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ కే రమేశ్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.