Take a fresh look at your lifestyle.

సారూ కాళ్ళు మొక్కుతం… మా ధాన్యం కొనండి

  • వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల ఆవేదన
  • రోడ్డుపై ధాన్యం పోసి నిరసన తెలిపిన వైనం
  • చేసేదేమీ లేక అల్లాడుతున్న రైతులు…..
  • చోద్యం చూస్తున్న అధికారులు

పరిగి,జూన్‌07( ‌ప్రజాతంత్ర విలేఖరి): సారూ మి కాళ్ళు మొక్కుతాం .మా వడ్లు కొనండి అంటూ అధికారుల కాళ్లపై పడి రైతన్న విల విల లాడిన సంఘటన వికారాబాద్‌ ‌జిల్లా పరిగి నియోజక వర్గం దోమ మండల పరిధిలోని పాలే పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.ప్రభుత్వ అధీనంలో ఉన్న వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వరి ధాన్యాన్ని రోడ్డుపై కుప్పగా పోసి నిప్పుపెట్టి తగల బెట్టారు. వెంటనే తమ ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపారు.ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకుని ఎన్నో అడ్డంకులు దాటుకుని ధాన్యం కోత కోసిన తర్వాత వాటిని అమ్మడం కోసం వడ్లు నింపేందుకు అవసరమైన సంచుల నుంచి మొదలు కొని వడ్లు జోకె వరకు రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేవు.

కొనుగోలు కేంద్రాలను ధాన్యం చేరిన తర్వాత అక్కడ నుండి మిల్లర్లు వద్దకు ధాన్యం చేరవేశాక అక్కడ తాలు ఎక్కువగా ఉందంటూ,తేమ ఎక్కువగా ఉందంటూ సాకులు చూపుతూ రైతును నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది పదిహేను రోజులుగా ధాన్యం తెచ్చి కొనుగోలు కేంద్రం వద్ద కుప్పలుగా ఉంచామని తర్వాత కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి వరిధాన్యం మొలకెత్తి పోతుందని దీంతో తాము తీవ్రంగా నష్టపోతామని వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కొనుగోలు కేంద్ర నిర్వాహకులు మాత్రం తానేమీ చేయలేనని పై అధికారులు చెప్పిన విదంగా తాను నచుకుంటున్నానని ఐకేపీ సెంటర్‌ ‌నిర్వాహకుడు చేతులెత్తేశాడు.మరో చోట ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఓ రైతు పాఠశాల భవనం పైకి ఎక్కి ఆత్మ హత్యా యత్నానికి ప్రయత్నించాడు.

రైతుల నిరసన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోగా ఓ రైతు ఎస్సై కాళ్లపై పడి రోదిస్తూ తమని ఆదుకోవాలని వేడుకున్నాడు. ప్రతి 40 కేజీల బస్తాకు తరుగు పేరుతో రెండు నుంచి ఐదు కిలోల వరకు తగ్గిస్తున్నారని… ఇలాగైతే తమకు ఏమి మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తదనంతరం అక్కడకు చేరుకున్న మండల తహశీల్దార్‌ ‌సమస్యను గురించి రైతులతో మాట్లాడుతున్న క్రమంలో ఓ మహిళా రైతు ఆమె కాళ్ళ పై పడి మొక్కుతు రోదిస్తూ తమ వేదనను వెళ్ళబుచ్చారు.దేశానికీ వెన్నెముక రైతు అంటారు.రైతు ఏడ్చిన రాజ్యం ఎపుడూ బాగు పడదంటారు అలాంటి ఈ దేశంలో నిత్యావసరాల లో భాగమైన వరి ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు తమ నిర్లక్ష్య వైఖరి వీడి ధాన్యం కొనుగోలు చేయాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కావున ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply