Take a fresh look at your lifestyle.

మరింత గడ్డుకాలాన్ని చూడబోతున్నామా ?

దేశ పరిస్థితులను చూస్తుంటే ప్రజలు మరింత గడ్డుకాలాన్ని చూడబోనున్నట్లుగా కనిపిస్తున్నది. పెద్ద నోట్ల రద్దు నాటి నుండి దేశంలో ఆర్థికమాంద్యం కొనసాగుతున్న నేపథ్యంలో పుండుమీద కారంలా ఇప్పుడీ కొరోనా కార్చిచ్చు మొదలైంది. కొరోనా నుండి కాపాడుకోవడానికి లాక్‌డౌన్‌ ఒక్కటే మందు కావడంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 21 రోజుల లాక్‌డౌన్‌ ‌పిలుపు దేశ ఆర్థిక పరిస్థితిని కుదిపేస్తున్నది. ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో ఫుట్‌పాత్‌ ‌వ్యాపరస్తులు మొదలు, కోట్లాదిరూపాయల టర్నోవరయ్యే అతిపెద్ద పరిశ్రమలన్నీ మూత పడడంతో దేశవ్యాప్తంగా ఉత్పత్తి రంగం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రభుత్వం ఎంత ఆదుకుంటున్నామని చెబుతున్నా దినసరి కూలీల ఆర్థిక బాధలు వర్ణనాతీతం. కాగా, ఉద్యోగాలన్నిటిలో మేటిగా భావించే సాఫ్ట్‌వేర్‌ ‌రంగం కూడా ఇబ్బందుల్లో కూరుకుపోయింది. నిన్నటి వరకు ఎన్నో ఆశలు, ఆశయాలతో ఆరంగంలో పనిచేస్తున్న వేలాదిమంది ఉపాధి ఇప్పుడు అగమ్యగోచరంలోపడింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులకు శ్రీముఖాలు అందినట్లు తెలుస్తున్నది. మరిన్ని కంపెనీలు ఆదిశలో పయనించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ పరిణామం ఎదుర్కుంటున్నది ఒక్క మనదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఐటి రంగం సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నట్లు తెలుస్తున్నది. దీనికంతటికీ కొరోనా ప్రభావమే కారణం. అయితే కొరోనా రాకముందునుండి కూడా ఈ రంగం ఒడిదొడుకుల మధ్య కొనసాగుతుండగా, కొరోనా ప్రభావం ఇప్పుడీ రంగాన్ని మరింత కుంగదీస్తున్నది. ఒకవైపు ప్రపంచాన్నే భయపెడుతున్న కొరోనాకు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు డెబ్బై వేలకు పైగా మృత్యువాతపడ్డారు. మరో పదమూడు లక్షల మంది ఆ వైరస్‌తో ఇంకా కుస్తీ పడుతున్నారు. వారి ఆరోగ్యపరిస్థితులు, వైద్య సేవలతోనే ఆగ్రరాజ్యమైన అమెరికాలాంటి దేశాలే ఆయోమయంలో పడ్డాయి. ఆర్థికంగా క్షీణించిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో భారత్‌లాంటి అధిక జనాభా కలిగి, అభివృద్ధి చెందుతున్న దేశస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీలేదు. మందులేని ఈ రోగం కోసం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఒక్కటే ప్రత్యమ్నాయంగా భారత ప్రభుత్వం ఎంచుకున్నది. బ్రతికుంటే బలుసాకైనా తినవచ్చన్నట్లు, ప్రజల ప్రాణాలను కాపాడడమే ప్రధానమన్న లక్ష్యంగా ఒకవైపు ముందుకు సాగుతుంటే, మరో వైపు ఆర్థికపుష్టిని సమకూర్చే పారిశ్రామిక రంగంతోపాటు, ఇతర అన్నిరంగాలు కుదేలైపోతున్నాయి. ఎక్కువశాతం రంగాలు ఆర్థిక నష్టాల ఊబిలోకి బలవంతంగా నెట్టబడుతున్నాయి. ఫలితంగా ఆయారంగాల్లో పనిచేసే వేతన జీవులు తమతమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. కొన్ని సర్వే సంస్థలు కూడా ఇదే అంశాన్ని నిర్ధారిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్లు మరో వారం రోజుల్లో అంటే ఏప్రిల్‌ 14‌న లాక్‌డౌన్‌ ఎత్తివేసినప్పటికీ ఉపాధి రంగాలు మాత్రం ఆర్థికంగా తమ వ్యవస్థలను నిలుపుకోవాలంటే ఉద్యోగుల్లో కోత అనివార్యమన్న అభిప్రాయంగా ఉన్నట్లు ఆ సర్వేలద్వారా వెల్లడవుతున్నది. మరికొద్ది రోజుల్లో ఆయారంగాల్లో పనిచేస్తున్న దాదాపు 15 నుండి 30 శాతంమంది ఉపాధిని కోల్పోయే ప్రమాదమెదురవనున్నట్లు వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ నిర్వహించిన సీఈవోల సర్వేలో తేలింది. దేశంలో కొరోనా కేసులు తగ్గుముఖంపట్టినట్లే పట్టి మళ్ళీ విజృంభిస్తుండడంతో ప్రభుత్వాలు ఊహించినట్లు ఏప్రిల్‌ 14‌తో కాకుండా ఇంకా కొంతకాలం దీనిపై జాగ్రత్త వహించాల్సిన అవసరం కనిపిస్తున్నది. మే, జూన్‌ ‌వరకు ఈ వ్యాధిపైన దృష్టి సారించాల్సిన అవశ్యకతను పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నమాట. ఈ పరిస్థితిలో పరిశ్రమలు తమ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకోవడం కోసం ఉద్యోగులను తీసివేస్తే దాని ప్రభావం ఆయా రంగాల ఉత్పత్తిపై పడటంతోపాటు, ధరలు ఆకాశన్నంటే ప్రమాదం లేకపోలేదు.

ఇదిలా ఉంటే సాఫ్ట్‌వేర్‌ ‌రంగంలో అధిక సంఖ్యలో ఉద్యోగస్తులను తొలగిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభించినట్లు కూడా వినికిడి. గత రెండు మూడు రోజులుగా ఐటి ఉద్యోగస్తులు ఇక మీసేవలు చాలన్నట్లు ఆయా కంపెనీల యాజమాన్యం నుండి లేఖలు అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కొరోనా ప్రబలడంతో తమకు కొత్త ప్రాజెక్టులేవీ రావడంలేదని, వచ్చినప్పుడు కబురు చేస్తామంటూ ఆ నెల వేతనాలనిచ్చి ఇంటికే పరిమితం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రధానంగా యుఎస్‌ ‌నుంచి ప్రాజెక్టులను తీసుకున్న కంపెనీల్లో ఈ పరిస్థితి కనిపిస్తున్నదంటున్నారు. ఇదిలా ఉంటే కొత్తగా క్యాంపస్‌ ఇం‌టర్యూల్లో సెలక్ట్ అయన వారి ఉద్యోగాలు కూడా పెండింగ్‌లో పడుతున్నాయి. కొందరికి ఆఫర్‌ ‌లెటర్లు రావడం లేదు. వచ్చినా, వారు ఎప్పుడు చేరాలన్న సమాచారముందడం లేదు. కొందరికైతే తాము పనిచేస్తున్నామా లేదా అనికూడా తెలియడం లేదంటున్నారు. ఇక కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నవారు, దినసరి కూలీల పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. ఇప్పటికే ఉత్పత్తులు నిలిచిపోయి, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి. దీనికి తోడు కొరోనాను ఎదుర్కునేందుకు ఆర్థికపుష్టి కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధించింది. పరిస్థితులు మెరుగైన తర్వాత తిరిగి వారికా మొత్తాన్ని చెల్లిస్తామనిచెబుతున్నా, వచ్చిన వేతనంతోనే నెలగడవడం కష్టంగా ఉన్న పరిస్థితిలో గోరుచుట్టుపై రోకలిపోటులా తయ్యారైందంటున్నారు ఉద్యోగులు, పెన్షనర్లు. ఈ పరిణాలనుబట్టి చూస్తే రానున్నది మరింత గడ్డుకాలమేనన్నది స్పష్టమవుతున్నది.

Leave a Reply