Take a fresh look at your lifestyle.

విద్యార్థుల బస్సులు భద్రమేనా?

పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. సుదూర ప్రాంతాల నుండి బస్సులలో విద్యార్థులు విద్యా సంస్థలకు ప్రయాణం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులలో కూడా విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. కొవిడ్‌తో గత ఏడాదిన్నర కాలంగా బడులు తెరచుకోకపోవడంతో పాఠశాలల బస్సులకు సామర్థ్య (ఫిట్‌నెస్‌) ‌పరీక్షలు నిర్వహించలేదు. విద్యార్థులు, ఉపాధ్యాయులను తరలించే బస్సుల సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తున్నాయి. కరోనా ప్రభావంతో చాలా విద్యాసంస్థలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా బస్సుల సామర్థ్య పరీక్షలు చేయిస్తే పడే భారాన్ని మోయలేమని విద్యాలయాల బాధ్యులు పలువురు చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పసుపు రంగు నంబరు ప్లేటు ట్యాక్సీ వాహనాలకు తప్పనిసరిగా స్పీడ్‌ ‌గవర్నర్లు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం సగానికి పైగా బస్సుల్లో ఇవి బిగించలేదు.సామర్థ్య పరీక్షకు రవాణా శాఖకు చెల్లించాల్సిన మొత్తం,ఈ ప్రక్రియకు ముందు సర్వీసింగ్‌..‌చిన్న మరమ్మతులు కలిపితే ఒక్కో బస్సుకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు వెచ్చించాల్సి ఉంటుందని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు చెబుతున్నాయి. సామర్థ్యం పరీక్షించకుండా రోడ్డెక్కించడం నిబంధనలకు విరుద్ధం. ఇది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమేనని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చాలా రోజుల తరువాత విద్యాలయాలు తెరచుకున్న నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన చేసిన తరువాత అంతా బాగుందనుకుంటేనే బస్సులు రోడ్లపైకి వచ్చేందుకు అనుమతించాలి.

విద్యా సంస్థలలోని బస్సులు పూర్తిస్థాయి సామర్థ్యం కలిగి విద్యార్థులను చేరవేయడానికి క్రింది నిబంధనలు పాటించాలి.
1.పాఠశాల, కళాశాల బస్సు ముందు భాగం.. ఎడమ పక్కన పేర్లు.. ఫోన్‌ ‌నంబర్లు.. ఇతర వివరాలు అందరికీ కనిపించేలా స్పష్టంగా రాయించాలి.
2.బస్సు సామర్థ్యంపై పాఠశాల ప్రిన్సిపల్‌, ‌తల్లిదండ్రుల కమిటీ నెలకు ఒకసారి పరిశీలించాలి. 3.ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక రిజిస్టర్‌ ఏర్పాటు చేయాలి.
4.బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల వివరాలు విధిగా నమోదు చేయాలి.
5. బస్సు తో పాటు ఒక అటెండర్‌ను తప్పనిసరిగా నియమించాలి.
6.అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలు అర్పేందుకు వీలుగా అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలి.
7.వాహనంలో అనుమతించిన సీట్లకు మించి ప్రయాణించరాదు.
కొవిడ్‌ ‌నేపథ్యంలో సీట్ల సామర్థ్యంలో సగం మందితోనే ప్రయాణించాలి.
8.ప్రతి బస్సులో ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉంచాలి. అందులో అవసరమైన మందులు ఉండాలి. కాల పరిమితి మేరకు వాటిని మారుస్తూ ఉండాలి.
9.కిటికీలకు అమర్చే ఊచల మధ్య దూరం ఐదు సెంటీమీటర్లకు మించకుండా ఉండాలి.
10.విద్యార్థులు బయటకు తలలు, చేతులు పెట్టకుండా ఇనుప మెష్‌ ‌తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
రాష్ట్రప్రభుత్వం లాభాపేక్ష లేకుండా ఉదయం విద్యాసంస్థలు తెరచుకునే వేళల్లో, సాయంత్రం విద్యా సంస్థలు మూత పడే సమయంలో అన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలి. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వీలైనంత ఎక్కువ సంఖ్యలో రోడ్డు రవాణా సంస్థ బస్సులను ప్రవేశపెట్టాలి.
నిబంధనలు పాటిస్తూ పూర్తిస్థాయి ఫిట్‌ ‌నెస్‌ ‌ధ్రువీకరణ పత్రము ఉన్న బస్సులనే విద్యాసంస్థలు వినియోగించుకునేలా రవాణా శాఖ మరియు విద్యాశాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే అభద్రతా భావం తొలగి సంపూర్ణ భద్రతతో ప్రయాణిస్తారు.

– పిన్నింటి బాలాజీ రావు హనుమకొండ
9866776286

Leave a Reply