Take a fresh look at your lifestyle.

మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు అవసరమా ..?

తెలంగాణా లో కొరోనా వైరస్ విస్తరణ ఉధృతి కొనసాగుతున్నది.గురువారం 4 వేల పాజిటివ్ కేసులకు దగ్గరలో.. 3840 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పడవ తరగతి పరీక్షలు రద్దు చేసింది.ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు లేకుండానే ..అందరిని ఫైనల్ కు ప్రమోట్ చేసింది .ఫైనల్ పరీక్షలు వాయిదా వేసింది . రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో ,ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి కొరోనా వైరస్ కట్టడికి చర్యల పై సమీక్షించారు. రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా హాస్పిటల్స్ లో బెడ్ల సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని ..ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా. శ్రీనివాస్ రావు వైరస్ విస్తరణ పై ఆందోళన వ్యక్తం చేశారు.

గాలి ద్వారా కూడా వైరస్ సోకె ప్రమాదముందని ..ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మాస్కులు ధరించి ..భౌతిక దూరం పాటించాలనీ సూచిస్తున్నారు. హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత పై మంత్రి ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయాల్లో పని చేసి సిబ్బంది మాట్లాడుకోవడం కంటే… ఫోన్లో లేదా ఇమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేసుకోవడం శ్రేయస్కరమని వైద్య నిపుణులు కొందరి అభిప్రాయం. పరిస్థితి తీవ్ర రూపం దాల్చి ..చేజారి పోతుందన్న ఆందోళన ప్రభుత్వ ఉన్నతాధికారుల్లోనే వ్యక్తమవుతుంటే ..మరో వైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వరంగల్,ఖమ్మం కార్పొరేషన్లు ..ఐదు మున్సిపాల్టీల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. వొచ్చే 3,4 వారాలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ పై కమిషన్ పునరాలోచించాలి .రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎన్నికలు వాయిదా పడేలా చర్యలు చేపట్టాలి .

కొరోనా సంక్షోభంలో పాలకుల దృష్టి కేవలం రాజకీయ కార్యక్రమాల పైనా ,ఆర్థిక స్థితుల చుట్టే తిరుగుతుంది.. రాజకీయ కార్యక్రమాలను తిరిగి నిర్వహించుకోవొచ్చు….ఆర్ధిక స్థితి ని మెరుగుపరుచుకోవొచ్చు. కానీ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి తమ కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించుకుంటామంటే ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదు. మొదటి దశ ,రెండవ దశ లోనూ తీవ్రంగా నష్టపోయింది విద్య వ్యవస్థ. దురదృష్టవశాత్తు పూడ్చలేని నష్టం

విద్యార్థుల జీవితాలలో సంభవిస్తుంది. ప్రైవేట్ విద్యాలయాల్లో బోధనా సిబ్బంది కష్టాలు వర్ణనాతీతం..ఉద్యోగ భద్రతా లేక ..జీతాలు సరిగా అందక ఈ మధ్య భార్యా భర్తలు,మరొక విద్యా వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రం లో ప్రైవేట్ విద్యా లయాల్లో లక్షకు మించి ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తున్నారు. రెండవ దశ కొరోనా వైరస్ విస్తృతి ప్రభావం మొదట విద్యావ్యవస్థ ముఖ్యంగా ప్రైవేట్ విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది పై పడింది. విద్యాలయాలు మూసి వేయడం తో వారందరు రోడ్డున పడ్డారు. యాజమాన్యాల పరిస్థితి కూడా భిన్నంగా లేదు. భవనాల కిరాయి కట్టలేక శాశ్వతంగా ముఠా పడే దుస్థితి ఏర్పడింది. ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులు రోడ్డు పైన మిర్చీ బండి ల వద్ద పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడెప్పుడో ..కొరోనా కాలానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పకోడీలు అమ్మడం కూడా ఒక రకమయిన ఉపాధి అని సలహా ఇచ్చారు. ఈ రోజు అది సాకారమయింది.

ఆన్ లైన్ విద్యాబోధన సత్ఫలితాలు ఇవ్వలేదు. అధిక శాతం విద్యార్థులు వసతులు లేక అధ్యయనం చేయడం సాధ్యం కాలేదు. 9 తరగతుల వరకు నెట్టుకు రాగలిగారు. కానీ 10 వ తరగతి నుంచి ..ఆ తరువాత తరగతులకు ఆన్ లైన్ బోధన కారణంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ను ఇచ్చే లాబ్స్ కోల్పోయారు. ప్రాజెక్ట్ వర్కులకూ దూరమయ్యారు. ఇటువంటి సాధారణ స్థాయి పరిస్థితుల్లో విద్యార్థులు జాతీయ స్థాయి లో జరిగే పోటీ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు పొందలేరు.కోవిడ్ ఆంక్షలతో కోచింగ్ సెంటర్లు ముఠా పడడంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులు కూడా మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఇతర ఏ రంగాలకు వర్తించని ‘మూసివేత’ కేవలం విద్యా వ్యవస్థ కే శాపంగా మారింది. పటిష్టమయిన ,ఆరోగ్యకరమయిన వ్యవస్థను నిర్మించే విద్యా వ్యవస్థ నిరాదరణకు గురి కావడం పాలనా సమర్ధతకు నిదర్శనం.

Leave a Reply