Take a fresh look at your lifestyle.

డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ళు సవాళ్ళకే పరిమితమా?

గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ళ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టు మునిసిపల్‌, ‌పట్టణాభివృద్ధి వ్యవహరాల మంత్రి కెటి రామారావు ప్రకటించారు. దీన్నొక సవాల్‌గా తీసుకుని పూర్తి చేయనున్నట్టు, వచ్చే దసరాకు కొన్ని ఇళ్ళను లబ్ధిదారులకు స్వాధీనం చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెరాస విజయం కోసం ఆ పార్టీ నాయకులు పన్నిన వ్యూహమే తప్ప ఇందులో వాస్తవం లేదని కాంగ్రెస్‌, ‌బీజేపీ నాయకులు ఆరోపించారు. శాసనసభ వేదికగా ఈ ఇళ్ళ నిర్మాణం విషయంలో కాంగ్రెస్‌ ‌నాయకుడు మల్లు భట్టి విక్రమార్క విసిరిన సవాల్‌ను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ‌స్వీకరించి, స్వయంగా భట్టి ఇంటికి వెళ్ళి ఎక్కడెక్కడ నిర్మాణాలు జరిగాయో అక్కడికి ఆయనను తీసుకుని వెళ్ళి చూపిస్తానని కొన్ని చూపించారు. అయితే, తలసాని చూపించినవన్నీ జంటనగరాల వెలుపల నిర్మించినవనీ, జంటనగరాల లోపల ఎక్కడా ఇటువంటి ఇళ్ళు నిర్మించలేదని భట్టి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ‌వంటి మహానగరాల్లో గజం జాగా దొరకడమే మహా కష్టం. అటువంటిది ఇళ్ళ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోందంటే నమ్మశక్యం కాదని భట్టి మాత్రమే కాకుండా, కాంగ్రెస్‌ ‌సభ్యులు పలువురు స్పష్టం చేశారు. ఇది ఎన్నికల జిమ్మిక్కు అని ఎద్దేవా చేశారు. లక్ష ఇళ్ళ నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుని 85వేలు పైగా పూర్తి చేశామని మంత్రి పేర్కొన్నారు.

డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ళ నిర్మాణం వ్యయప్రయాసలతో కూడినదైన మాట వాస్తవమే. హైదరాబాద్‌, ‌సికిందరాబాద్‌లో పొరుగు జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చేవారు ఇక్కడే స్థిరపడుతుండటంతో జంటనగరాల్లో వసతి సమస్య అధికంగానే ఉంది. ధనవంతులు ఒక వంక విశాల మైన గార్డెన్‌ ‌కలిగిన ఇళ్ళలో విలాసవంతమైన జీవనం గడుపుతున్న మహానగరంలో మరో వంక నిరుపేదలు రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న బతుకు చిత్రం నిత్యం కనిపిస్తూ ఉంటుంది. రెండు పడక గదుల ఇళ్ళుగా వీటిని పిలుస్తున్నారు. ఈ ఇళ్ళ నిర్మాణం పేద, మధ్యతరగతి వర్గాల కలల పంటగా పేర్కొనవచ్చు. ఇళ్ళ నిర్మాణం కోసం, నివేశన స్థలాల కోసం రూపాయి రూపాయి దాచుకుని స్కీమ్‌లలో సభ్యులుగా చేరిన వారు సంవత్సరాల తరబడి ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌పథకం ఈ వర్గాలకు ఆశారేఖగా కనిపించింది. దాంతో చాలా మంది తమ పేర్లను ఈ పథకంలో నమోదు చేసుకున్నారు. అయితే, ఇంకా పూర్తి కాకపోవడంతో అన్ని పథకాల్లాంటిదే ఇదీ అనే నిరాశ అలుముకుంటోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జరిగిన చర్చలో కాంగ్రెస్‌ ‌సభా నాయకుడు, మంత్రి విసురుకున్న సవాళ్ళు ఆసక్తిని రేకెత్తించాయి. భట్టిని ఎక్కడికి తీసుకుని వెళ్ళి తలసాని చూపిస్తారోనని ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ, అక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని భట్టి విమర్శిస్తున్నారు. హైదరాబాద్‌ ‌పరిధిలో కట్టిన ఇళ్ళు లేవని చెబుతూ ఇందుకు నాంపల్లిలో ఇళ్ళు కట్టామన్న ప్రభుత్వం వాదన బూటకమని అన్నారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ళకోసం స్థల సేకరణ పెను సవాల్‌ అవుతోందనీ, కాంగ్రెస్‌ ‌వారే కోర్టులకు వెళ్ళి స్టేలు తెస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన సామగ్రినీ, సాంకేతిక సాయాన్ని అందించేందుకు రహదారులు, భవనాల శాఖ సంసిద్దంగా ఉందని ఆ శాఖ మంత్రి ప్రకటించినప్పటికీ ఆచరణలో నత్తనడక సాగుతోందని ఫిర్యాదీదారులు పేర్కొంటున్నారు.

నగరంలో వివిధ ప్రాంతాల్లో 80 శాతం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయనీ, పూర్తి అయిన ఇళ్ళను మహానగర పాలక సంస్థకు అధీనం చేయాలని మంత్రి కేటి రామారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. కానీ, వాస్తవానికి దసరాకైనా ఇళ్ళను లబ్ధిదారులకు స్వాధీనం చేస్తారా అనేది అనుమానమేనని ప్రతిపక్షాలు నిరాశను వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల ముందు ఇలాంటి ప్రజాకర్షణ పథకాలను సత్వరం పూర్తి చేయడానికి ప్రభుత్వాలు ఎక్కువ ఆసక్తి చూపుతాయి. మామూలు ఇళ్ళ నిర్మాణం కూడా మాటలు కోటలు దాటిన చందంగా జరుగుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ఇళ్ళ నిర్మాణం కోసం భూసేకరణ అనేది ఒక మహాయజ్ఞంగా తయారైంది. ప్రతిపక్షాలు కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకుని వస్తుండటంతో ప్రభుత్వాలు ముందుకు అడుగు వేయలేని స్థితిలో ఉన్న మాట నిజమే. ఖాళీ జాగా దొరికితే కబ్జా చేసే వారు మహానగరాల్లో ఎక్కువ మంది ఉంటారు. వారికి రాజకీయ నాయకుల ప్రాపకం, మద్దతు ఉంటుంది.

అందువల్ల స్థల సేకరణ నిజంగానే బృహత్‌ ‌కార్యమే. అయితే, డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ళకు అలాంటి సమస్యలు ఎదురు కాకుండా ముందే తాము ప్రణాళిక ప్రకారం నిర్మాణాలను చేపట్టామని కేటి రామారావు మొదటి నుంచి చెబుతుండటం వల్ల చాలా మందిలో నమ్మకం కలిగింది. ఆయన ఆదేశాలిచ్చినా అమలు జరగడానికి వ్యవధి పడుతుంది. ఉదాహరణకు నగరంలో నాలాలపై ఆక్రమణలను తొలగించేందుకు ఆయన చాలా సార్లు డెడ్‌ ‌లైన్లు పెట్టారు. కానీ, అవి అమలు జరగడం లేదు. అలాగే, భారీ వర్షాలకు నాలాలపై క్యాప్‌లు లేకపోవడం వల్ల మురుగు నీరు పొంగి పొరలుతోంది. ఈ మధ్య మల్కాజ్‌ ‌గిరిలో ఒక బాలిక, సరూర్‌ ‌నగర్‌లో ఒక వ్యక్తి నాలాల్లో కొట్టుకుని పోయి సమీపంలో ఉన్న చెరువుల్లో తేలారు. ముందుగా భూగర్భ డ్రైనేజి వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. గట్టిగా వాన కురిస్తే భాగ్యవంతుల కాలనీల్లోనే నీటి మడుగులు ఏర్పడుతున్నాయి. నగర పాలక సంస్థ సిబ్బంది అలసత్వానికి తోడు అక్రమ ఆక్రమణ దారులు ప్రణాళిక లేకుండా ఇళ్ళు నిర్మించడం వల్ల కూడా ఇటువంటివి చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష నాయకుల సవాళ్ళు, ప్రతిసవాళ్ళ వినివిని జనం విసిగి పోయారు. పథకాలు కార్యరూపం ధరిస్తే ఆనందిస్తారు.

Leave a Reply