Take a fresh look at your lifestyle.

మహానగరాలు గాలి కాలుష్య కేంద్రాలా…!

(‘గ్రీన్‌పీస్‌ ‌సౌత్‌ఈస్ట్ ఏసియా గాలి కాలుష్య నివేదిక-2020 ఆధారంగా)

ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యంతో కోట్లాది మంది ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురికావడమే కాకుండా లక్షల్లో మరణాలు సంభవిస్తున్నాయని గ్రీన్‌పీస్‌ ‌సౌత్‌ఈస్ట్ ఏసియా నివేదిక-2020 ప్రమాదకర హెచ్చరికలు చేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు అత్యంత జనాభాగల మహానగరాల్లో 2020లో 1.6 లక్షల మంది, ఒక్క న్యూఢిల్లీలోనే 54,000 మంది గాలి కాలుష్యం బారినపడి చనిపోయారనే భయంకర వాస్తవాన్ని వెల్లడించింది. న్యూఢిల్లీలో ప్రతి మిలియన్‌ ‌ప్రజల్లో 1,800 మంది గాలి కాలుష్యంతో మరణించారని అర్థం అవుతున్నది. కరోనా కారణంగా విధించబడిన లాక్‌డౌన్‌తో కొంత గాలి కాలుష్యం తగ్గినా, ప్రపంచ రాజధానుల్లో కెల్లా న్యూఢిల్లీలో మాత్రమే 54 వేల మంది చనిపోయారని వెల్లడైంది. శిలాజ ఇంధనాల వాడకంతో విడుదలైన అతి ప్రమాదకర పియం-2.5 దూళి కణాల తీవ్రత పెరిగిన న్యూఢిల్లీ, టోక్యో, షాంఘై, సావ్‌ ‌పౌలో మరియు మెక్సికో నగరాల్లో గాలి కాలుష్యం ప్రాణాంతకంగా మారిందని తెలుస్తున్నది. బొగ్గు, చమురు మరియు గ్యాస్‌ ‌లాంటి కాలుష్యాన్ని వెదజల్లే ఇంధనాలను ప్రభుత్వాలు ఉపయోగించినంత కాలం ఇలాంటి పియం-2.5 గాలి కాలుష్య అనారోగ్యాలు జరుగుతాయని నిర్దారించింది. పియం-2.5 కాలుష్యంతో గుండె మరియు ఊపిరితిత్తులు చెడిపోయి అస్తమా లాంటి తీవ్ర అనారోగ్యాలతో పాటు కాన్సర్‌, ‌స్ట్రోక్‌ ‌పెరగడం మరియు కోవిడ్‌-19 ‌బారిన పడినవారు కోలుకోవడం కష్టం అవుతుండటం జరిగిందని వివరించింది.
మహానగరాల్లో గాలి నాణ్యత ప్రమాణాలను నిర్ణయించడానికి గ్రీన్‌పీస్‌ ‌సౌత్‌ఈస్ట్ ఏసియా సంస్థతో పాటు ఐక్యూఏయిర్‌ ‌మరియు సెంటర్‌ ‌ఫర్‌ ‌రీసెర్చి ఆన్‌ ఎనర్జీ అండ్‌ ‌క్లీన్‌ ఏయిర్‌ ‌సంస్థలు ఆన్‌లైన్‌ ‌సహకారాన్ని అందించాయని నివేదిక తెలియజేస్తున్నది. కరోనా విధించిన కట్టడితో న్యూఢిల్లీలో తక్కువ మరణాలు సంభవించాయని తెలుస్తున్నది. ఇండియాలోని న్యూఢిల్లీతో పాటు ముంబాయ్‌, ‌హైదరాబాద్‌, ‌బెంగుళూరు, చెనై మరియు లక్నో మహానగరాల్లో కూడా గాలి కాలుష్య పియం-2.5 స్థాయి ప్రమాదకరంగా ఉందని, దీని వల్ల దాదాపు 1.2 లక్షల మరణాలు జరిగాయని నివేదిక వివరిస్తున్నది. 2020లో పియం-2.5 గాలి కాలుష్యంతో ముంబాయ్‌లో 25,000 మంది, బెంగుళూరులో 12,000, చెనైలో 11,000, హైదరాబాద్‌లో 11,000 మరియు లక్నోలో 6,700 మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా వేసింది. గాలి కాలుష్య మరణాలు మరియు అనారోగ్యాల వల్ల న్యూఢిల్లీలో 58,895 కోట్లు, ముంబాయ్‌లో 26,912 కోట్లు, బెంగుళూరులో 12,365 కోట్లు, చెనైలో 10,910 కోట్లు, హైదరాబాద్‌లో 11,637 కోట్లు మరియు లక్నోలో 8,000 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.
గత ఏడాది ప్రథమార్థంలో లాక్‌డౌన్‌ ఉన్నప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసుకున్న 28 నగరాల్లోకెల్లా న్యూఢిల్లీలో గాలి కాలుష్యంతో అత్యధికంగా 24,000 మరణాలు నమోదు అయ్యాయని తెలుస్తున్నది. ముంబాయ్‌లో పియం-2.5తో పాటు నైట్రోజన్‌ ఆక్సైడ్‌ ‌కాలుష్యంతో వేల మరణాలు జరిగాయని వివరించింది. పట్టణీకరణతో నగర జనాభా పెరగడం, వాహనాల విచ్చలవిడి వాడకం, రోడ్డు వెడల్పు మిషతో చెట్లు నరకడం, నిర్మాణరంగం విస్తరించడం, వలసలతో మురికివాడలు పెరగడం, ఉద్యోగఉపాధుల పేరుతో నగరాలకు చేరడం, విద్య కోసం పట్టణాలకు మారడం, నాణ్యమైన జీవితంకోసం నగరాలకు ప్రవేశించడం లాంటి కారణాలతో గాలి కాలుష్యం తీవ్రస్థాయికి చేరడం జరుగుతోంది.
ఇలాంటి ప్రమాదకర గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి తరగని సాంప్రదాయేతర ఇంధనాల వినియోగాన్ని పెంచాలని నివేదిక సూచిస్తున్నది. తరగని ఇంధనాలైన సౌరశక్తి, పవనశక్తి, అలలశక్తి, ఎలక్ట్రికల్‌ ‌వాహనాల వాడకం లాంటి ప్రత్యామ్నాయాలను సత్వరమే ప్రోత్సహించాలి. నగరాల్లో తిరిగే వాహనాలను క్రమబద్దీకరించడం, ప్రజారవాణను ప్రోత్సహించడం, సియన్‌జి ఆధారిత వాహనాలను వినియోగించడం లాంటి చర్యలు కొంత వరకు గాలి కాలుష్య ప్రతికూల ప్రభావాలను కట్టడి చేస్తాయని ప్రజలు తెలుసుకోవాలి. నేటి నవ్య మానవుడి విలాసవంతమైన జీవనశైలితో తాత్కాలిక సౌకర్యాలు కలిగినా శాశ్వతంగా మనిషి మరణానికి దగ్గర కావడం వాస్తవమని కళ్లు తెరవాలి.
ఆధునిక మానవుడు తన గోతిని తానే తవ్వుకొంటున్నాడని మరిచి మాయా ప్రపంచపు ఊయలలో ఊగుతూ, చావుకు దగ్గర అవుతున్నాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలని, చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలని మరియు కాలుష్య విషకోరల్లో చిక్కక ముందే జాగ్రత్తలు తీసుకోవాలని మరువరాదు. సాంప్రదాయ తరిగే ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తూ, సాంప్రదాయేతర తరగని ఇంధనాలను వాడుకుంటూ అందరం ఆరోగ్యంగా మనుగడ సాగిద్దాం.
Dr. Burra Madhusudan Reddy Recipient of the National Best Faculty Award, Retired Principals, Government Degree PG, College Karimnagar
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్‌ – 99497 00037

Leave a Reply