Take a fresh look at your lifestyle.

అరణ్య పుత్రిక

వేయి ఆలోచనల సంఘర్షణలో
ఉద్భవించిన నూటొక్క పూలసౌరభం
వేయి తరగల సరి కొత్త స్రవంతిగా
పరవళ్లు తొక్కుతున్నది

వసంత మేఘ గర్జనలో విరిసిన విద్యుల్లత
జన హృదయ దీపమై కొలువవుతున్నది
అడవితల్లి చనుబాల ధారను తాగిన శిశువు
ఆకాశమంత ఎదిగి తోడ బుట్టినోళ్ళకు కడుపునింపుతున్నది

వెదురు పూల వనాలలో విల్లంబై మొలకెత్తి
వెదురు బాణాలను విసిరిన చేతులతో
చిరుగాలి సితారాను మ్రోగిస్తున్నది
నింగి కెగిసిన  తారకలు చెక్కుకున్న
జీవ పుష్పమై, అభినవ సమ్మక్కై,
ఆరాధ్య సారలమ్మగా
కారడవులను కాలిబాటలగా మలచుకున్నది

వాగులను వంకలను
అవలీలగా దాటుకుంటూ నడుస్తున్న దారులలో
వన గిరులన్నీ  గులకరాళ్లుగా ముడుచుకుంటున్నవి
పర్వత శిఖర సిగ అరుణిమలా
అధిగమిస్తూ అధిరోహిస్తూ
ఆదివాసుల కండ్లలో
ఆకుపచ్చ దీపమై నిలుస్తున్నది.

ఆమె అరికాళ్ల సవ్వడుల స్పర్శతో
నేల నాగటి సాల్లుగా తెరచుకుంటున్నది
పుడమి తల్లి పులకరించిపోతున్నది
ఆటుపోట్ల అర్ణవంలో వేకువ
తీరాలకు ఎదురీదుతున్నది
చెరగని చిద్విలాసపు కౌముది చిరునవ్వులా
జ్వలిస్తున్న జ్వాలా సమ్మోహనంలా
వసంతాన్ని వాగ్ధానం చేస్తున్నది.

apnala srinivas
అస్నాల శ్రీనివాస్‌
9652275560

Leave a Reply