Take a fresh look at your lifestyle.

ఏ‌ప్రిల్‌ 17 ‌ప్రపంచ రక్తస్రావ దినం

  • రక్తస్రావ వ్యాధిపై అవగాహన అవసరం

మానవ శరీరంలో రక్తం రక్త నాళాల్లో నిరంతరం ప్రవహిస్తుంది. అదే రక్తం నిరాటంకంగా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతే ఏ జీవికైనా మరణం తప్పదు. కొంతమందికి చిన్న దెబ్బ తగిలి గాయమైనా అది నిరంతర రక్తస్రావానికి కారణమై ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. ఇలా రక్తం సహజంగా గడ్డకట్టడంలో విఫలమయ్యే పరిస్థితిని ‘హీమోఫీలియా’ అంటారు. మరికొన్ని సార్లు ఎలాంటి గాయం కాకుండానే అంతర్గతంగా కూడా రక్త స్రావం అవుతుంది. దీనిని ‘బ్లీడర్స్ ‌డిసీజ్‌’’ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ 17 ‌న ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం జరుపుకుంటారు. ఇది 30వ వార్షికోత్సవం. ఈ సంవత్సరం ‘‘పొందండి మరియు పాల్గొనండి’’ అనే థీమ్‌తో జరుపుకుంటున్నాము. ఈ రోజున ‘హీమోఫీలియా’’ వల్ల ఎదురయ్యే సమస్యలు, రక్తస్రావం జరిగేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, అవసరమయ్యే ఇతర జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. హీమోఫీలియా అనేది ఎక్కువగా వారసత్వంగా జన్యు లోపము వలన వచ్చే వ్యాది. ఇది రక్తం గడ్డకట్టడానికి, రక్తస్రావం ఆపడానికి అవసరమైన ప్రక్రియను శరీర సామర్యాన్ని బలహీనపరుస్తుంది. ఎక్కువగా మేనరిక వివాహాలు చేసుకునే కుటుంబాల్లో కూడా ఈ వ్యాధి కన్పిస్తోంది. హీమోఫీలియాలో అనేక రకాలున్నా ఇందులో హీమోఫీలియా-ఏ అనేది 75 శాతం మందిలో కనిపించే ఎక్కువగా విసృతంగా ఉన్న జబ్బు. ప్రతి 5000 మందిలో ఒకరికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

రక్తంలో ‘హిపారిన్‌’’ అనే పదార్థం ఉండడం వలన రక్త నాళాలో రక్తం గడ్డ కట్టదు. రక్తానికి సంబంధించిన పనులలో రక్తం గడ్డకట్టడం ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ వలన ప్రమాదవశాత్తు గాయమైనప్పటికీ జీవులు బ్రతకగలుగుతున్నాయి. ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తం మూడు నుండి ఆరు నిమిషాల లోపు గడ్డకడుతుంది. శరీరానికి ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తం కొంచెం సేపు మాత్రమే కారుతుంది. తర్వాత రక్తం గడ్డకట్టి తెగిన చోట ఒక ఎర్రని గడ్డలాగ ఏర్పడుతుంది. ఈ ఎర్రని గడ్డనే స్కందనం అంటారు. రక్తం గడ్డ కట్టక పోతే శరీరంపై చిన్న గాయం తగిలినా విపరీతమైన రక్తస్రావం జరిగి జీవి చనిపోతుంది. ఏదైనా గాయం నుండి రక్తం స్రవించినప్పుడు రక్త ఫలకికలు థ్రాంబోకైనేజ్‌ అనే ఎంజైమ్‌ను స్రవిస్తాయి. ఈ థ్రాంబోకైనేజ్‌ ‌రక్తంలో ఉన్న ప్రోత్రాంబిన్‌ను త్రాంబిన్‌గా మారుస్తుంది. త్రాంబిన్‌ ‌రక్తంలోని ద్రవ రూపంలో ఉన్న ఫైబ్రినోజన్‌ను ఘనరూపంలో ఉండే ఫైబ్రిన్‌ ‌తంతువులుగా మారుస్తుంది. ఈ తంతువులలో రక్త కణాలు చిక్కుకుని రక్తం గడ్డ కడుతుంది. ఫైబ్రిన్‌ ‌దారాలు(తంతువులు) దెబ్బతిన్న రక్త నాళపు అంచులకు అతుక్కొని సంకోచించడం వలన అంచులు దగ్గరకు లాగబడి రక్త స్రావాన్ని ఆపుతాయి. రక్తం గడ్డ కట్టిన తర్వాత మిగిలిన గడ్డి పసుపు రంగు ద్రవాన్ని సీరం అంటారు. కొందరు వ్యక్తులలో కె విటమిన్‌ ‌లోపం వలన రక్తం గడ్డకట్టడానికి చాలా ఎక్కువ సమయం పట్టవచ్చు. జన్యులోపం వలన కూడా కొందరిలో రక్తం గడ్డ కట్టడం జరగదు. ఈ లోపాన్నే హీమోఫీలియా వ్యాధి అంటారు. హీమోఫీలియా వ్యాధి గ్రస్తుల రక్తంలో థ్రాంబోకైనేజ్‌ ‌కలిగి ఉండరు. అందువలన రక్తం గడ్డ కట్టదు. హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు గాయాలైనప్పుడు వెంటనే వైద్యం అందక పొతే అదిక రక్త స్రావం వలన మరణానికి దారి తీస్తుంది. ఈ వ్యాధి మగవారిలోనే ఎక్కువగా వస్తుంది. ఆడవారిలో సాధారణంగా రాదు. హీమోఫీలియాను నయము చేయలేము. హీమోఫీలియా ఉన్నవారు శారీరకంగా ధృడంగా ఉండాలి. అందుకోసం శారీరక వ్యాయామం చేయాలి. అందుకే జాగ్రత్తలు చాలా అవసరం. వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, జీవన విధానంలో చేసుకోవలసిన మార్పుల గురించి వైద్యుని సలహాలు తప్పని సరిగా తీసుకోవాలి.(ఇది కేవలం అవగాహన కొరకు మాత్రమే..)
– నెరుపటి ఆనంద్‌,
‌జీవశాస్త్రం ఉపాధ్యాయుడు, ఉన్నత పాఠశాల టేకుర్తి

Leave a Reply