Take a fresh look at your lifestyle.

జ్యోతిరావు పూలే సిద్ధాంతమే దేశానికి రక్ష

“ఈ దేశ మూలవాసులకు, స్త్రీలకు వేల ఏండ్లుగా విద్యను, ఆస్తిని, అధికారాన్ని దూరం చేసిన విషయాన్ని మొట్టమొదటి సారిగా గుర్తించి ప్రశ్నించిన ధీరుడు మన జ్యోతిరావు పూలే. దేశంలో ప్రజలు అభివృద్ధి కాకపోవడానికి, అణచివేతకు, అన్ని అనర్థాలకు విద్య లేకపోవడమేనని గుర్తించి ప్రజలందరరూ విద్య నేర్చుకోవాలని, తను స్వతహాగా పాఠశాలలు పెట్టి విద్య నేర్పించి ఆచరణాత్మక ఉద్యమం చేశారు. ఆయన ఉద్యమం, కృషి, త్యాగం వల్లనే మనం ఈ మాత్రం విద్య వల్ల ఫలాలను అనుభవిస్తున్నాం.”

ఏ‌ప్రిల్‌ 11 ‌మహాత్మ జ్యోతిరావు పూలే 193వ జయంతి

విద్య లేనందున-జ్ఞానం లేకుండా పోయింది
జ్ఞానం లేనందున-నైతికత లేకుండా పోయింది
నైతికత లేనందున-ఐకమత్యం లేకుండా పోయింది
ఐకమత్యం లేనందున-శక్తి లేకుండా పోయింది
శక్తి లేనందున-శూద్రులు అణచివేయబడ్డారు
ఇన్ని అనర్థాలు కేవలం అవిద్య వల్లే జరిగిపోయాయి.

– మహాత్మ జ్యోతిరావు పూలే

కరోనా వైరస్‌ ‌కరాల నృత్యం చేస్తున్న తరుణంలో దేశంలోని ప్రజల ధీన స్థితి, అసంఘటిత వర్గాల అల్లకల్లోలం, వలస కూలీల వ్యథలు చూస్తుంటే మనకు కన్నీరు రాక మానదు. ప్రపంచంలోనే అన్ని దేశాల కన్నా ఎక్కువగా రెండు వేల సంవత్సరాల పైబడి పరాయి పాలనకు గురైన దేశం మన  ఇండియా. స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లు దాటినా ఇంకా మనం ఇంతటి దుర్భర పరిస్థితిలో ఎందుకున్నట్లు? ఇంకా పొట్ట చేతపట్టుకొని బతుకుదెరువు కోసం వలసలు ఎందుకు కొనసాగుతున్నాయి? స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం ప్రజలందరికి కల్పించాలని రాజ్యాంగములో వ్రాసుకొని 70 ఏండ్లు ఆయినా ఆ సమానత్వం ఎందుకు ఏర్పడడం లేదు? కరోన వైరస్‌ ‌కల్లోలాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఇటు ప్రభుత్వాలకు, అటు ప్రజలకు ఎందుకు లేకుండా పోయింది?  వీటన్నింటికి మనకు సమాధానం కావాలంటే మళ్ళీ మనం 170 ఏండ్ల క్రితం మహాత్మ జ్యోతిరావు పూలే మనకు ఇచ్చిన సందేశం, చైతన్యం, సిద్ధాంతం వెతుక్కోవాలి.

- Advertisement -

ఈ దేశ మూలవాసులకు, స్త్రీలకు వేల ఏండ్లుగా విద్యను, ఆస్తిని, అధికారాన్ని దూరం చేసిన విషయాన్ని మొట్టమొదటి సారిగా గుర్తించి ప్రశ్నించిన ధీరుడు మన జ్యోతిరావు పూలే. దేశంలో ప్రజలు అభివృద్ధి కాకపోవడానికి, అణచివేతకు, అన్ని అనర్థాలకు విద్య లేకపోవడమేనని గుర్తించి ప్రజలందరరూ విద్య నేర్చుకోవాలని, తను స్వతహాగా పాఠశాలలు పెట్టి విద్య నేర్పించి ఆచరణాత్మక ఉద్యమం చేశారు. ఆయన ఉద్యమం, కృషి, త్యాగం వల్లనే మనం ఈ మాత్రం విద్య వల్ల ఫలాలను అనుభవిస్తున్నాం. పూలే చూపిన మార్గంలోనే  సాహుమహారాజ్‌(‌శివాజీ మహరాజ్‌) ‌తన ఆస్థానంలో విద్యాభివృద్ధికి కృషి చేసారు. పూలే మరణానంతరం జన్మించిన అంబేడ్కర్‌ ‌పూలేను తన గురువుగా ప్రకటించుకోవడమే కాకుండా పూలే చూపించిన మార్గంలో నడిచిన అంబేడ్కర్‌ అణగారిన వర్గాలకు విద్య, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగములో పొందుపరిచారు. అణగారిన వర్గాల మేలు కోసం అంబేడ్కర్‌ ‌చేసిన ప్రతి పనిలో పూలే సిద్ధాంతం ఉందనేది వాస్తవం.
మహాత్మ జ్యోతిరావు పూలే ఆలోచనా సిద్ధాంతంతో ఈ దేశ పీడిత వర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన పాలకులు స్వార్థ రాజకీయాలతో దోపిడీ పాలన కొనసాగిస్తున్నారు. మెజారిటీ ప్రజలతో పాటు జనాభాలో సగబాగమైన స్త్రీలకు విద్య అందిచడం ద్వారానే దేశాభివృద్ధి జరుగుతుందని పూలే సిద్ధాంతం చెపుతుంటే మన పాలకులు 70 ఏండ్లుగా ఆ సిద్ధాంతాన్ని కావాలనే పక్కకు నెట్టి పాలిస్తున్నారు. విద్య-అభివృద్ధి  విడదీయరానివని పాలకులకు తెలిసినా కూడా వారి పాలనంతా వారి అధికారం వారి వర్గ ప్రయోజనాల చుట్టే తిరుగుతుందనేది జగమెరిగిన సత్యం.  ఆనాడు మెజారిటీ ప్రజలకు విద్య లేకపోవడం సమస్య అయితే నేడు అందరికి సమాన విద్య లేకపోవడం పెద్ద సమస్య. ఆనాడు సంపన్న వర్గాల వారు, పాలక వర్గాల వారు చదువుకునేది, నేడు అందరూ చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ ఉన్నోడికి ఒక విద్య లెనోడికి ఒక విద్య కొనసాగుతూ ప్రజల మధ్య అసమాతలు తొలిగించాల్సిన విద్య అసమానతలకు కారణమవుతుంది. నేటికి మెజారిటీ స్త్రీలకు అక్షర జ్ఞానం లేదంటే అతిశయోక్తి కాదు. మెజార్టీ ప్రజలు పాఠశాల స్థాయిలోనే విద్యను నిలిపివేస్తున్నారు. కొద్ది మంది ఉన్నత చదువుల చదివినా ఉన్నత వర్గాలతో పోటీ పడలేకపోతున్నారు.

విద్య లేనందువల్లనే నేడు మెజారిటీ ప్రజలు అసంఘటిత రంగాల్లో జీవనం కొనసాగిస్తూ నానాటికి పెరుగుతున్న ప్రపంచీకరణ, ప్రైవేటీకరణను ఎదుర్కోలేక నానా అవస్థలు పడుతున్నారు. కూటి కోసం దేశాలు దాటి వలస పోవడమే కాకుండా దేశములోని వివిధ పారిశ్రామిక నగరాలకు వలస పోతున్నారు. అవిద్య, చాలీచాలని ఆదాయంతో వారి పిల్లలను ప్రైవేట్‌ ‌రంగంలో చదివించడం కత్తిమీది సాములాగా మారింది. పిల్లల చదువు కోసం, వైద్యం కోసం సంపాదన ధారపోయడమే కాకుండా అప్పుల పాలవుతున్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు, వలస కూలీలు, వారి కుటుంబాల  పరిస్థితి కరోన కల్లోలం వల్ల బాహ్య ప్రపంచానికి తెలిసింది. పాలకులు ఉద్దేశ పూర్వకంగానే ప్రజలను విద్యకు తద్వారా అభివృద్ధికి దూరం చేయడం వల్లనే నేడు దేశంలో ఇంతటి దుర్భర స్థితి ఏర్పడింది.

క్రీస్తు పూర్వం నుండి మన దేశం పరాయి పాలనలో ఉండడమే కాకుండా అప్పటి ఆర్య పాలకులు మనుధర్మ శాస్త్రం అనే రాజ్యాంగ రాసి దేశ మూలవాసులను విద్యకు, ఆస్తికి, అధికారానికి దూరం చేశారు. మనుధర్మ శాస్త్రం ప్రకారం శూద్రులు(దేశ మూలవాసులు) వీధుల్లో నడిస్తే మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టుకొని నడవాలనేటటువంటి దుర్మార్గ నిబంధనలు ఉండేవి. ఈ నిబంధనలు మొగల్స్ ‌కాలంలో కూడా కొనసాగాయి. బ్రిటీష్‌ ‌కాలంలో కూడా కొనసాగుతున్న క్రమంలో జ్యోతిరావు పూలే ధైర్యం చేసి మనుధర్మాన్ని బద్ధలు కొట్టి మన దేశ ప్రజలకు, స్త్రీలకు విద్య, సమానత్వం గూర్చి 18వ శతాబ్దం లోనే సాహసోపేతమైన ఉద్యమం చేసాడు. అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం జ్యోతిరావు పూలే చేసిన కృషి స్వాతంత్రానాంతరం మన పాలకులు కొనసాగించలేదు. స్త్రీలకు విద్య అందించడం కోసం తన సహచరి సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి స్త్రీలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత కూడా పూలేకు దక్కుతుంది.

విద్యతో పాటు సామాజిక రుగ్మతలపై, స్త్రీ సమానత్వంపై, అంటరానితనపై ఎన్నో పోరాటాలు చేసిన పూలే నేటి పాలకులకు, ప్రజలకు ఆదర్శం కావాలి. ఇప్పటి కరోన వైరస్‌ ‌లాగానే 1897లో దేశంలో ప్లేగు వ్యాధి సోకిన క్రమంలో ప్రజలు రోగులకు సేవలందించడానికి వెనుకడుగు వేసిన స్థితిలో ఆ రోగులకు సేవాలందిస్తూ తన సహచరి సావిత్రిబాయి పూలే మరణించింది. నేటి కల్లోల సమయంలో దేశ ప్రజలకు పూలే దంపతులు ఆదర్శం కావాలి. ఎన్నో విలువలు బోధించిన పూలే దేశంలో ఉన్న కుల సమాజం పట్ల కూడా మాట్లాడాడు, కొంతమంది బ్రాహ్మణీయ స్వార్థ పాలకుల చేత దేశ ప్రజలు కులాలుగా విడదీయబడ్డారని, మన అందరి మధ్య రక్త సంబంధాలున్నాయని దేశ మూలవాసి ప్రజలందరూ ఇక్యం కావాల్సిన అవసరముందని కూడా పూలే బోధించారు.
పూలే చూపిన విధాభివృద్ధి మార్గం దేశంలోని ఉత్తర రాష్ట్రాలకన్నా దక్షిణ రాష్ట్రాల్లో ఎక్కువ పలితాలనిచ్చింది. దక్షిణంలో పెరియార్‌, ‌నారాయణ గురు, అయ్యంకాలి, పండిత అయోతి దాస్‌, అం‌బేడ్కర్‌ ‌లాంటి వాల్ల పోరాటాలు, కృషి వల్ల విద్యాభివృద్ధి జరిగింది. విద్యాభివృద్ధి జరిగిన దక్షిణాది రాష్ట్రాల్లోనే నేడు ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది, నేడు దేశంలో విలయతాండవం చేస్తున్న కరోన కూడా విద్యలో వెనుకబడ్డ ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉందనేది గమనించదగిన విషయం. 1827 ఏప్రిల్‌ 11‌న జన్మించి 1890లో మరణించిన జ్యోతిరావు పూలే సిద్ధాంతం, పనితీరు పాలకులకు, ప్రజలకు స్ఫూర్తిదాయకం కావాలి. పూలే జయంతి సందర్భంగానైనా పాలకలు విద్యకు అభివృద్ధికి మధ్య ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలందరికి ఉచిత సమాన విద్య అందించడానికి, ప్రజా ఆరోగ్యానికి అవసరమైన వైద్య విద్యను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతిన బూనాలి. అలా ప్రతిన బూని పూలే సిద్ధాంతాన్ని అమలు చేస్తే కరోన లాంటి ఎన్ని విపత్తులు వచ్చిన ఎదుర్కొనే శక్తి ఇటు ప్రజలకు, అటు పాలకులకు ఉంటుంది.

sai narendhar
– సాయిని నరేందర్‌
9701916091

Leave a Reply