నా నరనరాల్లో బలంగా గూడుకట్టుకున్న ఆకాంక్షల చమురు తో
వెలుగుతున్న దీపం
నా చుట్టూ వ్యాపించిన ఉన్న చీకటి పొరలను చూడకుండా కళ్ళు బైర్లు కమ్మేలా చేసిన
ఇంద్రజాలాన్ని తెలుసుకోలేని దుస్థితి నాది
నిజాలను అగాథం లోకి త్రొక్కి
నిత్యము అసత్యవాక్కులకు శృతి కలుపుతున్న వికృత చేష్టలకు
నా మనసు నన్ను నిందిస్తున్న
తెలియని ఓ మొద్దబారినతనమే
నన్ను హద్దుల్లో పెడుతుంది
నేను పీఠవేసి కూర్ఛోబెట్టిన పెద్దరికమే
హద్దుమీరి నా ఆశలకు చేటు దెస్తున్న
మత్తులోనే జోగుతూ మాట్లాడలేని బలహీనత నన్ను వెక్కిరిస్తుంది
నాకు ఎరగా వేసిన నూకలను
ఆస్వాదించే ఆరాటంలో
నా చుట్టూ ఉన్న ఆకలి కేకలను వినిపించుకోలేని
చెవిటితనానికి మించిన ఆవిటితనమేముంటుంది
నిండుగా పిల్లలతో కలకలలాడిన నా ఊరు బడి
మూతబడటానికి సిద్ధమై మూగగా రోదిస్తున్న రేపటి పౌరుల
భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేని
నిస్సహాయ స్థితి
బడుగుల విద్యాజ్యోతులై వెలిగిన విశ్వవిద్యాలయాలు
ప్రైవేటుకు బలిపశువులౌతుంటే
భంగపాటుతో బెంగటిల్లి నా బలిమి ఏపాటిదని సరిపెట్టుకొంటిని
ఎదిగిన నా కొడుకు లాంటి ఎందరి•
కొలువుల్లేక కలవర పడుతుంటే
క్షణికమైన వరాల మోజులో ప్రగతి పరవళ్ళు తొక్కతుందని
పగటి కలల పరవశం లో
తేలుతుంటిని
అవినీతి అనకొండలను అందలమెక్కించి అల్పజీవులపై కొరడా ఎత్తిన అన్యాయమంటూ మాట్లాడలేని అశక్తత నన్నావరించిన నిష్క్రియా పరత్వం
అన్నదాతలకు బంధువులంటూనే పరాధీనతనుపెంచి పోషిస్తూ పంటలపై ఫత్వాలు జారిచేస్తూ
మంటలురేపుతున్న మాటలురాని నా దీనత్వమునకు సిగ్గుపడటం కంటే చీత్కారమేముంది
కాటగలిసిన ఆదర్శాల నడుమ
మూటలు సరిచేసుకొనే
చాటుమాటు తనానికి సజీవ సాక్షిలా ఉన్న నా దళారి తనానికి తగిన శాస్తి జరగాల్సిందే
– గన్ రెడ్డి ఆదిరెడ్డి, 9494789731