Take a fresh look at your lifestyle.

విపత్తు సొగసైనదే

యుద్ధోద్విగ్నత వైషమ్యగీతిల
హనన సమయంలో
రాబందు డ్రాగన్‌ల
కదన కబళింపు కాలంలో
పాజ్‌ ‌మీటను నొక్కిన
విపత్తు అందమైనదే..

కష్టాల్లో ఉల్లాసాల
వెతుకులాటను
కన్నీళ్ల విలువలను
ఎరుక పరుస్తున్నది
దు:ఖాల కొండ ఎత్తు ఏమిటో
బాధల సముద్రాల లోతు ఏమిటో
అన్వేషణల ఆలోచనల్ని ఇస్తున్నది

అనంత భూమ్యాకాశాలకు
అధిపతులమనే
అహంకార పోకడలకు
అవధి గీతలను గీస్తున్నది
నరక పౌరసత్వ జాబితా
సాక్షాత్కరించిన వేళ
విభజన కుట్రాజకీయాల వెన్ను విరుస్తున్నది

అంధకారం నుండి ఆధునికం వైపు
అడుగులు వేయించిన పూర్వీకుల
మానవోచితుల జ్ఞాన దీపదారులలో
గెంతులు వేయమని బోధిస్తున్నది
భయాలను నిర్జించే ఆర్ధ్రతలను
పండించే జీవన కాంక్షలను
రగిలిస్తున్నది

విజ్ఞాన పంటలలో
అజ్ఞానపు మూఢత్వాల
కలుపులను
ఏరిపారేస్తున్నది.
మొక్కల పై వాలిన
రెక్కల మిత్రులతో
సంభాషింపచేస్తున్నది
వాటి నిస్వార్థ జీవనాన్ని
అనుసరించమంటున్నది

- Advertisement -

కర్రును కదిలించే కర్షకులతో పాటు
సాహసాలతో తిమిరాలను చీల్చిన
జీవ మిణుగురులు
లీవెన్‌ ‌హాక్‌ ‌పాశ్చార్‌
‌జాన్సన్‌  ‌బైజరింక్‌
‌చురక శుశ్రుత కోట్నీస్‌ ‌వారసులలొ
శౌచ్యపు కార్మికుల స్వేదంలో
దైవత్వాన్ని దర్శింప చేస్తున్నది
మన ఉజ్వల భవిష్యత్‌కు
శ్రమిస్తున్న శాస్రవేత్తలను
శాశ్వత శిల్పాలుగా
హృదయ కోవెల  మలచుకుంటున్నది

ధవళ శ్యామల జాతి వైరుధ్యాల
సరిహద్దులను చెరిపేస్తూ..
మానవజాతి సమస్తం
మిశ్రమ డియన్‌ఏల సంతతనే
జన్యువాదాన్ని బలపరుస్తున్నది
విపత్తు వినాశన ప్రణాళికను వేయిస్తూ
మనిషిలో మనిషి కొల్పోయే ప్రవహించే
విపత్తానంతర సుందర స్వప్నమయ
లోక నిర్మాణానికి అడుగులను వేయిస్తున్నది

apnala srinivas
– అస్నాల శ్రీనివాస్‌
‌ప్రభుత్వ వృక్షశాస్త్ర అధ్యాపకులు,
తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం.
9652275560

Leave a Reply