Take a fresh look at your lifestyle.

అపస్వరం ..!

ఏవార్త వినకూడదని కోట్లాది మంది ప్రజలు ముక్కోటి దేవతలకు మొక్కుతున్నారో  ఆ వార్త  శుక్రవారం మధ్యాహ్నం వినాల్సి వొచ్చింది. విధి బలీయం అనేది పుక్కిటి మాట కాదు.  గానగంధర్వ ఎస్‌ ‌పి బాల సుబ్రహ్మణ్యం కొరోనా నుంచి కోలుకున్నారనీ, లేచి కూర్చుంటున్నారనీ,  ఫిజియో థెరిపీ చికిత్స జరుగుతోందని  ఆయన కుమారుడు  ఎస్పీ చరణ్‌ ‌కొద్ది రోజుల క్రితం ప్రకటించినప్పుడు  కోట్లాది మంది ఆయన అభిమానులు  ఎంతో ఆనందించారు. మళ్ళీ ఆయన పాటలు వినే అదృష్టం కలుగుతుందని ఆశించారు. కానీ,   గురువారం ఉన్నపళంగా ఆయనకు  వ్యాధి తిరగబెట్టడం వల్ల  ఇరవై నాలుగు గంటలుపైగా     అభిమానులను  తీవ్ర ఉత్కంఠకు గురి  చేసి  కన్నుమూశారు.  ఎస్పీగా , బాలూగా  అభిమానులు పిలుచుకునే   బాలసుబ్రహ్మణ్యం జీవితం  పూల పాన్పు కాదు. ఎన్నో ఎగుడుదిగుడులు. కష్టాలతో నిండినది. ఎస్పీ  సినీ రంగంలో ప్రవేశించడం , శ్రోతల అభిమానం చూరగొన్న ఏకైక గాయకునిగా స్థిరపడటానికి ఆయన ఎంతో  కష్టపడ్డారు.  స్వయం కృషి వల్లనే ఆయన సినీ రంగంలో  మేరు నగమంత ఎత్తు ఎదిగారు. ఆయన   గాయకుడే కాదు.  నిర్మాత, నటుడు,   రికార్డింగ్‌ ‌థియేటర్‌ ‌వ్యవస్థాపకుడు,   ఎంతో మందికి  గాత్ర దానం చేసిన డబ్బింగ్‌ ఆర్టిస్టు,  సంగీతానికి సంబంధించి అన్ని విభాగాలపైనా ఆయనకు పట్టు ఉంది.   అదంతా స్వయంకృషి వల్లనే సాధ్యమైంది.

సాహిత్యం , సంగీతాల్లో లోతులు తెలుసున్న వారు మాత్రమే   ఆయనలా పాడగలరు.   పాటలు అందరూ పాడతారు. భావాన్ని అర్థం చేసుకుని ఎక్కడ స్వరం పెంచాలో,ఎక్కడ తగ్గించాలో తెలుసుకుని పాడేవారే శ్రోతల అభిమానాన్ని చూరగొంటారు . ఎస్పీ గారికి ముందు తెలుగు సినిమా రంగంలో అమరగాయకుడు   ఘంటసాల వెంకటేశ్వరరావు ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగింది. ఆయన  ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో  ఎస్పీ సినీ రంగంలో ప్రవేశించి తొలి గీతాన్నే ఆయనతో  కలిసి పాడారంటే అది ఆయన అదృష్టమే.  హాస్య నటుడు పద్మనాభం నిర్మించిన  శ్రీ మర్యాద రామన్న చిత్రంలో  ఘంటసాల, రంగస్థల కృష్ణుడు   ఈలపాట రఘురామయ్యలతో కలిసి పాడే అవకాశం  ఆయనకు వొచ్చింది. ఆయన  దానిని సద్వినియోగం చేసుకుని గురువు   ఎస్పీ కోదండ పాణి మన్ననలను అందుకున్నారు. ఆ తర్వాత ఘంటసాల సైతం  పలు సందర్భాల్లో  ఆయన శ్రద్దాసక్తులను, దీక్షను మెచ్చుకుని ప్రోత్సహించారు. అలాగే,   నేపద్యగాయని  జానకి కూడా తనను ఎంతో ప్రోత్సహించారని ఆయనే ఎన్నో సందర్భాల్లో స్వయంగా ప్రకటించారు. ఎంత ఎదిగినా   ఒదిగి ఉండాలన్న పెద్దల  హితవచనాన్ని ఒంట పట్టించుకుని   సినీ నేపధ్య గాన ప్రస్థానంలో ఎవరూ చేరనంత ఎత్తుకు చేరుకున్నారు. ఏభై ఏళ్ళలో  17 భాషల్లో  40 వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్‌ ‌రికార్డు సాధించారు.
విభిన్న తరహాల పాత్రల వారికి విభిన్న రీతులలో గాత్రాన్ని దానం చేసిన   కళాకారుడు ఆయన. తెలుగులో ఎన్టీఆర్‌, అక్కినేని మాదిరిగానే  తమిళంలో    కమలహసన్‌, ‌రజనీకాంత్‌, ‌కన్నడంలో రాజ్‌ ‌కుమార్‌, ‌విష్ణువర్ధన్‌,  ‌మలయాళంలో   ముమ్ముట్టి,    మోహన్‌ ‌లాల్‌  , ‌హిందీలో అనిల్‌ ‌కపూర్‌ ‌వంటి విభిన్న భాషా చిత్రాల హీరోలకు ఆయన పాడిన పాటలు జనాదరణ పొందాయి. అలాగే, కమల్‌ ‌హసన్‌, ‌రజనీలకు గాత్ర దానం చేసినప్పుడు స్వయంగా వారు మాట్లాడుతున్నట్టే జనం    అనుభూతి చెందేవారు.  ఇవన్నీ ఒక ఎత్తు,  ఔత్సాహిక గాయకులను ప్రోత్సహించేందుకు ఆయన నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది  యువ గాయనీగాయకులు తయారయ్యారు. ఎస్పీ   తండ్రి  సాంబమూర్తిగారు కూడా  కళాకారుడు. హరికథాకళాకారునిగా ఆయన    రామాయణ, మహాభారత పురాణాల ఘట్టాలను శ్రోతలను తన్మయం చేసే రీతిలో హరికథాగానం చేసేవారు.  బాల సుబ్రహ్మణ్యానికి తండ్రి నుంచే కళారాధన  అబ్బింది.

గడిచిన ఆరు దశాబ్దాల్లో నేపధ్య సంగీతంలో అనేక మార్పులు వొచ్చాయి. ఎన్నో పరికరాలు వొచ్చాయి.  గతంలో  గాయకులు కష్టపడనక్కరలేకుండా ట్రాక్‌ ‌లు వొచ్చాయి. ఆ రోజుల్లో అవేమీ లేవు.   అయినప్పటికీ స్వయం కృషి ఫలితంగా  ఎస్పీ అందరూ మెచ్చిన పాటలను అందరికీ పాడి అందరివాడుగా పేరొందారు. సినీ రంగంలో   రాజకీయాలెన్ని ఉన్నా ఆయన తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.అదే సందర్భంలో రాజకీయ నాయకులతో ఆయనకు సత్సంబంధాలు ఉండేవి.  అందుకే ఆయన మరణవార్తను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  నెల్లూరు జిల్లావారే కావడం, వయసు రీత్యా కొంచెం ఇటూ అటూగా తనకు సమకాలీనుడు కావడం వల్ల ఆయనకు  ఎస్పీ అన్నా, ఆయన పాటన్నా ఎనలేని అభిమానం.    జీవితంలో ఎవరూ ఎదగనంత ఎత్తు ఎదిగిన  ఎస్పీ  భారత ప్రభుత్వ విశిష్టపౌర పురస్కారం పద్మభూషణ్‌, ‌పద్మ శ్రీ వంటి పురస్కారాలెన్నింటినో పొందారు.అన్నింటినీ మించి   సినీ శ్రోతల అభిమానాన్ని లెక్కలేనంతగా మూటగట్టుకున్నారు. ఎస్పీ పాట  రేడియోలో, టీవీల్లో వొస్తోందంటే పనులు మానుకుని      స్థాణువులై వినేవారు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు.  ఆయన  పునర్జన్మ ఎత్తి తెలుగు శ్రోతలను అలరిస్తారని ఆశిద్దాం. ఆయన  భౌతికంగా మన మధ్య లేకున్నా,  ఆయన గానం, ఆయన  రూపం ప్రేక్షకుల మదిలో కలకాలం ఉంటుంది.

Leave a Reply