ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు.. రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేస్తామన్న ప్రభుత్వం
విద్యా సంవత్సరం ప్రారంభం కాకుండానే ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడంపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చిలోనే విద్యా సంవత్సరం ప్రారంభమైందని సీబీఎస్ఈ, ఐసీఎస్ పాఠశాలలు చెబుతున్నాయనీ, దీనికి సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఆన్లైన్ క్లాసులను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఓవైపు విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదని ప్రభుత్వం చెబుతోంది మరోవైపు ఆన్లైన్ తరగతులకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది సమాధానమిస్తూ ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగిందనీ, కొరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆన్లైన్ పద్దతిలోనే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నదని కోర్టుకు తెలిపారు.
మరో రెండు రోజుల్లో దీనికి సంబందించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుందని స్పష్టం చేశారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ కొన్ని కార్పొరేట్ పాఠశాలలు గంటల తరబడి ఆన్లైన్లోనే తరగతులు నిర్వహిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందనీ, ఐదో తరగతి లోపు విద్యార్థులు గంటల తరబడి ఆన్లైన్లో ఎలా ఉండగలరని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ప్రైవేటు పాఠశాలలు పాటించాల్సిన విధి విధానాలను కూడా ప్రకటిస్తామని కోర్టుకు తెలిపింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఫీజులు వసూలు చేయవద్దన్న జీవోను సైతం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకు రాగా దీనిపై ప్రస్తుత దశలో ఉత్తర్వులు ఇవ్వలేమనీ, విచారణ పూర్తయ్యాకే ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ఆన్లైన్ తరగతులు నిర్వహణపై తమ వైఖరి వెల్లడించేందుకు సీబీఎస్ఈ హైకోర్టును సమయం కోరగా, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 27కు వాయిదా వేసింది.