Take a fresh look at your lifestyle.

నెల్లూరుకు చేరిన గౌతం రెడ్డి భౌతికకాయం

  • భారీగా తరలివచ్చిన అభిమానులు, నేతలు
  • నేటి ఉదయం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
  • ఉదయగిరి ఇంజనీరింగ్‌ ‌కాలేజీలో ఏర్పాటు
  • హాజరు కానున్న సిఎం జగన్‌, ‌మంత్రులు

నెల్లూరు, ఫిబ్రవరి 22 : గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌ ‌రెడ్డి భౌతికకాయం సొంత జిల్లా నెల్లూరుకు చేరుకుంది. హైదరాబాద్‌ ‌బేగంపేట ఎయిర్‌ ‌పోర్ట్ ‌నుంచి ప్రత్యేక నేవీ హెలీకాప్టర్‌లో గౌతమ్‌ ‌రెడ్డి భౌతిక కాయాన్ని నెల్లూరుకు తీసుకువచ్చారు. నెల్లూరు పోలీస్‌ ‌పరేడ్‌ ‌మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు తరలించారు. పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌నుంచి గౌతమ్‌రెడ్డి నివాసానికి ఆయన భౌతికకాయాన్ని మంత్రి అనిల్‌ ‌కుమర్‌ ‌తదితరులు దగ్గరుండి తరలించారు. ఇప్పటికే గౌతమ్‌ ‌రెడ్డి ఇంటి దగ్గర విషాదఛాయలు అలుకుకున్నాయి. గౌతమ్‌ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. అభిమాన నాయకుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు మేకపాటి అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానుల సందర్శనార్థం ఏర్పాట్లు చేశారు. రాత్రికి గౌతమ్‌రెడ్డి కుమారుడు నెల్లూరు చేరుకుంటారు. బుధవారం ఉదయగిరిలో అధికార లాంఛనాలతో నిర్వహించే అంత్యక్రియలకు సీఎం జగన్‌, ‌మంత్రులు, ప్రముఖులు హాజరవుతారు.

అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించగా.. ఉదయగిరి మెరిట్‌ ఇం‌జనీరింగ్‌ ‌కాలేజీలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గౌతమ్‌రెడ్డి లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఏపీ ఇరిగేషన్‌ ‌మంత్రి అనిల్‌కుమార్‌ ‌యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చాల విషయాల్లోనూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించే వారన్నారు. పెద్దన్నను కోల్పోయినట్లు ఉందన్నారు. అధికారదర్పం ఉండేది కాదని.. అందరితోనూ స్నేహంగా ఉండేవారన్నారు. కాగా, అమెరికాలో ఉంటున్న గౌతం రెడ్డి కుమారుడు కృష్ణార్జునరెడ్డి రావాల్సి ఉంది. ఇప్పటికే అతను బయలుదేరారు. సాయంత్రానికి చేరుకుంటారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆయన రాగానే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు, గౌతంరెడ్డి మృతితో రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యక్రమాలను కూడా వాయిదా వేశారు. నెల్లూరు పోలీస్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌నుంచి గౌతమ్‌రెడ్డి నివాసానికి ఆయన భౌతికకాయం తరలించారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచారు.

Ap minister mekapati goutham reddy dead body reached nellore by navy special helicopter

బుధవారం ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్‌ ‌కాలేజీ ఆవరణలో అధికారిక లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తీవ్రమైన గుండెపోటుతో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఉదయం 7.30 గంటలకే ఈ వార్త నెల్లూరు జిల్లా ప్రజలకు తెలిసినా తొలుత ఎవరూ విశ్వసించలేదు. కండలు తిరిగిన శరీరంతో చలాకీగా కనిపించే ఆరడగుల ఆజానుబాహువుకు గుండెపోటు ఏమిటి..? అని ఆశ్చర్యపోయారు. అయితే కొన్ని నిమిషాలకే గౌతమ్‌రెడ్డి ఇక లేరు.. అనే చేదు నిజాన్ని తెలుసుకొని విషాదంలో మునిగి పోయారు. తొలుత మేకపాటి స్వగ్రామమైన మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వ హించాలని భావించారు.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు రావడానికి వీలుగా హెలిప్యాడ్‌ ‌సిద్ధం చేశారు. అయితే ఉభయ రాష్టాల్ర నుంచి పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖులు రానున్న దృష్ట్యా అందరి సౌకర్యార్థం అంత్యక్రియలను ఉదయగిరికి మార్చినట్లు తెలిసింది. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజనీరింగ్‌ ‌కాలేజీలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు అంత్య క్రియలకు హాజరు కానున్నారు. గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పరిశ్రమల శాఖకు తీరని లోటని ఐటీ స్పెషల్‌ ‌సెక్రటరీ వరవన్‌ అన్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో గౌతమ్‌రెడ్డి ప్రజెంటేషన్‌ అక్కడి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుందని.. రూ.5 వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నామన్నారు. దుబాయ్‌ ‌పారిశ్రామిక వేత్తలు సైతం ఆయన లేరన్న నిజాన్ని నమ్మలేకపోతున్నారని వరవన్‌ అన్నారు.

Leave a Reply