Take a fresh look at your lifestyle.

తెలంగాణ వైపు…ఏపీ మందుబాబుల చూపు

  • సరిహద్దు జిల్లాల నుంచి రాష్ట్రంలోకి
  • మందుబాబులకు జడిసి నిత్యావసర దుకాణాలు మూసివేస్తున్న వ్యాపారులు

ఏపీ మందుబాబుల చూపు తెలంగాణపై పడింది. ఆ రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెంచడంతో సరిహద్దు జిల్లాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించి మరీ మద్యం కొనుగోలు చేస్తున్నారు. కొరోనా నియంత్ర కట్టడి చర్యలలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ ‌కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. అయితే, కొరోనా కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు 40 రోజుల తరువాత షరతులతో కూడిన మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. దీంతో రెండు రోజుల వ్యవధిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రభుత్వాలు మద్యం విక్రయాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఏపీలో మద్యం ధరలను అంతకుముందుతో పోలిస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం పెంచింది. భారమైనప్పటికీ విక్రయాలు ప్రారంభమైన రెండు రోజుల పాటు అదే ధరలకు ఏపీలో మద్యం కొనుగోలు చేసిన మందుబాబులకు తెలంగాణలో మద్యం విక్రయాలు ప్రారంభం కావడం ఊరటనిచ్చింది. తెలంగాణలో గతంతో పోలిస్తే కేవలం 16 శాతం మాత్రమే మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. అదే ఆంధ్రలో 75 శాతం పెరిగాయి. చీప్‌ ‌లిక్కర్‌ ‌దగ్గరి నుంచి హైలెవల్‌ ‌లిక్కర్‌ ‌వరకు అన్ని రకాల బ్రాండ్ల రేట్లు, రెండు రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది.

చీప్‌ ‌లిక్కర్‌ ‌ఫుల్‌ ‌బాటిల్‌పై రూ. 500 వరకూ తేడా వస్తోంది. దీంతో మందుబాబులు సరిహద్దు జిల్లాలలో ఉన్న మందుబాబులు తెలంగాణలోకి ప్రవేశించి మద్యం కొనుగోళ్లు చేస్తున్నారు. కాగా, ఏపీతో సరిహద్దును పంచుకునే జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా ఉంది. మధిర,, సత్తుపల్లి నియోజకవర్గాలకు కృష్ణా జిల్లా, అశ్వారాపుపేట నియోజకవర్గానికి పశ్చిమ గోదావరి, భద్రాచలం నియోజకవర్గానికి తూర్పు గోదావరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఆంధ్రాలో మద్యం ధరలు భారీగా పెంచడంతో ఈ జిల్లాల్లోని మందుబాబులు ఖమ్మం జిల్లాల్లోని వైన్‌ ‌షాపులకు వచ్చి మందు కొనుక్కొని వెళుతున్నారు. ఇక ఇక తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం సరిహద్దుగా ఉంది. ఈ నియోజకవర్గం నుంచి కూడా మందుబాబులు అధిఖ సంఖ్యలో సూర్యాపేట జిల్లాలోని వైన్స్ ‌షాపుల వద్ద భారీ స్థాయిలో మద్యం కొనుగోలు చేసి తీసుకుని వెళుతుండటం విశేషం. ఇదిలా ఉండగా, తెలంగాణలో మద్యం విక్రయాలు ప్రారంభమైన రెండు రోజులకే వైన్స్ ‌షాపులు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఎక్సైజ్‌ ‌శాఖ డిపోలలో మద్యం నిల్వలు రెండు రోజులకు సరిపడ మాత్రమే ఉండటంతో పాటు డిమాండ్‌కు తగిన స్థాయిలో మద్యం ఉత్పత్తి చేయలేకపోవడం ఇందుకు కారణంగా ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మద్యం ఉత్పత్తికి, ఎక్సైజ్‌ ‌డిపోల నుంచి మద్యాన్ని వైన్స్ ‌షాపులకు వాహనాలలో సరఫరా చేసే వలల కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు లేదా జిల్లాలకు వెళ్లిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో మద్యం షాపుల ముందు విక్రయాలు ప్రారంభమైన తొలి రోజు ఉన్న సందడి మూడు రోజుల తరువాత కనిపించడం లేదు.

మరోవైపు, వైన్స్ ‌షాపులలో మద్యం విక్రయాల కారణంగా సమీపంలో ఉన్న నిత్యావసర సరుకులు, కూరగాయల వ్యాపారులకు తలనొప్పిగా మారాయి. మందుబాబులు ఉదయం నుంచే వైన్స్ ‌షాపుల వద్ద బారులు తీరుతుండటంతో సమీపంలోని నిత్యావసర దుకాణాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ ‌నగరంలోని చాలా ప్రాంతాలలో ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అసలే మందుబాబులు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలియక వైన్స్ ‌షాపులకు దూరంగా ఉన్న దుకాణాలకు వెళుతున్నారు. ఇక వ్యాపారులు సైతం మందుబాబులతో తమకెందుకులే అని తమ దుకాణాలను ఉదయం నుంచి సాయంత్రం వరకూ మూసి వేస్తున్నారు. దీంతో మద్యం విక్రయాలు, మందుబాబుల కారణంగా వైన్స్ ‌షాపులకు సమీపంలో ఉన్న దుకాణాదారులు ఆర్థికంగా నష్టపోతుండగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

Leave a Reply