Take a fresh look at your lifestyle.

బిఆర్‌ఎస్‌ ‌సిట్టింగ్‌ల్లో ఆందోళన…

పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపైన ముచ్చటగా మూడవసారి గులాబి జెండాలను ఎగుర వేయాలన్న ధ్యేయంగా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రణాళికలను రచిస్తోంది. గత ఏడాది టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌ ‌పార్టీగా మార్చినప్పటినుండి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పార్టీని విస్తృతపరిచే కార్యక్రమాలను కొనసాగిస్తూనే, రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికలకు ఆ పార్టీ వ్యూహ రచన చేస్తూనే ఉంది. గత ఎన్నికల వాతావరణానికి నేటి వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉంది. గత ఎన్నికల్లో  ప్రధాన ప్రత్యర్థి పార్టీలుగా భారతీయ జనతా పార్టీ,   కాంగ్రెస్‌లున్నప్పటికీ బిఆర్‌ఎస్‌కు అనుకున్నంత స్థాయిలో పోటీ ఇవ్వలేక పోయాయి. కాని, నేటి పరిస్థితి  వేరుగా ఉంది. పై రెండు పార్టీలు కూడా దాదాపు రెండు సంవత్సరాల ముందునుండే ఇక్కడ ఎన్నికల వాతావరణాన్ని సృష్టించాయి. అడుగడుగున అధికార బిఆర్‌ఎస్‌ ‌తప్పిదాలను, అవినీతిని ఈ రెండు పార్టీలు ప్రజలకు వివరించడంలో  ఒక విధంగా పోటీ పడ్డాయనే చెప్పాలె. వీటికి తోడుగా తెలంగాణా జన సమితి, వైఎస్‌ఆర్‌టిపి,బిఎస్పీ మరో పక్క నిత్యం ప్రజల్లో ఉంటూ బిఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారపడుతున్నాయి..

ఈ నేపథ్యంలో  ఈ సారి ఎన్నికలు బిఆర్‌ఎస్‌కు అంత సులభమైనవిగా కనిపించడంలేదు. రానున్న ఎన్నికల్లో గెలుపు ఓటములపై ఇప్పటికే పలు సర్వేలు చేయించినట్లు చెప్పుకుంటున్న బిఆర్‌ఎస్‌ ‌పార్టీ తమ గెలుపు నల్లెరుపైన నడకేనని చెబుతున్నప్పటికీ, లోపల మాత్రం అంత ఈజీ కాదన్నదని అర్థమైంది. అందుకే దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించే కార్యక్రమానికి కెసిఆర్‌ ‌కాస్తా సెలవు ప్రకటించినట్లు తెలుస్తున్నది. ఇప్పుడాయన దృష్టినంతా రాష్ట్ర ఎన్నికలపైనే కేంద్రీకరించినట్లు తెలుస్తున్నది.  రానున్న ఎన్నికల్లో వంద స్థానాలకు మించి బిఆర్‌ఎస్‌ ‌గెలుచుకుంటుందని బాహాటంగా ప్రకటిస్తున్నా, ప్రజాభిప్రాయంలో భిన్న వాతావరణం కనిపిస్తున్నది. రైతు పార్టీగా చెప్పుకుంటున్న బిఆర్‌ఎస్‌ ‌తన సొంత రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించలేక పోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నేటికీ కళ్ళాల్లో ఉన్న ధాన్యం రోజుల తరబడి అలానే మూలుగుతున్నది. ఒక పక్క వరుణుడు ఆగ్రహిస్తే, మరో వైపు కొనుగోలుదారుల దాష్టికానికి రైతులు బలైపోతున్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసామని చెబుతున్న ఈ ప్రభుత్వం మరోసారి వ్యవసాయం దండుగేనని రైతులనోట అనిపిస్తున్నది. ఐకెపి తూకంలో దండికొడుతుంటే, మిల్లర్లు తమకు తోచిన డిమాండ్‌తో రైతుకు నష్టం చేస్తున్నా ప్రభుత్వం మాత్రం రంగంలోకి దిగి రైతుల పక్షాన నిలబడలేక పోయిందన్న అపవాదను ఇప్పటికే మూటగట్టుకుంది.
ఇక ఉద్యోగాలకోసం నిర్వహించిన పరీక్షల గందరగోళం, పూర్తికాలం ఉద్యోగులుగా గుర్తించాలన్న పలుశాఖల్లో కొనసాగుతున్న  ఆందోళనలు, కాళ్ళొచ్చిన  సర్కార్‌ ‌భూములు, ధరణి తప్పిదాలు లాంటి పలు అంశాలు రాష్ట్ర ప్రజలను వేధిస్తున్న  అంశాల కారణంగా రానున్న ఎన్నికలను బిఆర్‌ఎస్‌ అం‌త సులభంగా తీసుకునే పరిస్థితి  లేదు. దీనికి తగినట్లు గత అక్టోబర్‌లో టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా పేరు మార్చిన క్రమంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే మరోసారి పార్టీ టికట్‌ ఇవ్వనున్నట్లు పార్టీ అధినేత,రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ప్రకటించిన విషయం తెలిసిందే.

దీంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలంతా ఇక తమ సీటుకు ధోకా  లేదని  తెగ సంతోష పడ్డారు. అయితే దాదాపు  అన్ని నియోజకవర్గాల్లో ఈసారి టికట్‌ ‌సాధించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న వారిలో మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రతీ నియోజవర్గంలో ఇద్దరు ముగ్గురు పోటీకి సిద్ధపడుతున్న  వారున్నారు. ఉద్యమకాలంనుండీ ఎలాంటి గుర్తింపు పొందని వారూ ఉన్నారు. వారంతా నిరాశకు  లోనవుతున్నారు.  ఇదిలా ఉంటే సిట్టింగ్‌లకు కూడా పిడుగులాంటి వార్త వినిపించారు బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌. ‌రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే కెసిఆర్‌ ‌పలు సర్వేలు చేయించినట్లు వార్తలు వొచ్చాయి. వాటిల్లో చాలామంది ఎమ్మెల్యేల  ప్రవర్తనపై అనేక ఆరోపణలు వొచ్చాయి. అదే విషయాన్ని ఎమ్మెల్యేల ముఖంగా కెసిఆర్‌ ఆ‌గ్రహాన్ని వ్యక్తం చేశారు. విచిత్రకర విషయమేమంటే ప్రభుత్వ పథాకాలు అమలు పర్చే క్రమంలో ఏ మేరకు పర్సంటేజ్‌ ‌తీసుకుంటున్నారన్న విషయాన్ని ఆయన ప్రకటించడం. ఇది విపక్షాలకు ఆయుధంగా మారింది. స్వీయ  పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ ‌చూసీచూడనట్లుగా వొదిలేయడమేంటని ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్నాయి. అలాంటి వారిని పార్టీనుండి సస్పెండ్‌ ‌చేయాల్సిందిపోయి, మరోసారి తన దృష్టికి వొస్తే బాగుండదని హెచ్చరించి  వొదిలివేయడమేంటని ఆ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

అక్రమాలకు పాల్పడుతున్న ముప్పై అయిదుగురు ఎమ్మెల్యేల జాబితా తన వద్ద ఉందని  ప్రకటించడంతో ఇప్పుడు ఎమ్మెల్యేల్లో ఎవరికి వారికి ఆ జాబితాలో తమ పేరుందేమోనన్న టెన్షన్‌ ‌మొదలైంది. ఎవరికివారు •సార్‌  ‌తమను ఉద్దేశించే అన్నారా అన్న డైలమాలో పడ్డారు. కాగా త్వరలో రానున్న ఎన్నికలు ఇప్పుడు బిఆర్‌ఎస్‌కు జీవన్మరణ సమస్యగా తయారైంది. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా అన్నట్లు ముందుగా ఇంట గెలువకుండా జాతీయ స్థాయిలో ఆ పార్టీ మనుగడ సాగించడం కష్టం. అందుకే ఎట్టి పరిస్థితిలో ఈ ఎన్నికలు గెలువాల్సిన అవసరం బిఆర్‌ఎస్‌కు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే నాయకులెవరూ తమ నియోజకవర్గాలను వీడి రావద్దని కెసిఆర్‌ ఇటీవల వారిని హెచ్చరించారు. దానికి తగినట్లుగా కాంగ్రెస్‌, ‌బిజెపి నుండి తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉండడంతో అంగబలం, అర్థబలం, ప్రజాపలుకుబడి ఉన్నవారికే టికట్‌ ఇవ్వాలన్న  లక్ష్యంగానే బిఆర్‌ఎస్‌ ఎక్సర్‌సైజ్‌ ‌చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీన్నిబట్టి గతంలో కెసిఆర్‌ ‌హామీ ఇచ్చిన మేరకు సిట్టింగ్‌లందరికీ తిరిగి టికట్లు వొచ్చే అవకాశాలు మాత్రం కనిపించడంలేదు.

Leave a Reply