Take a fresh look at your lifestyle.

ఆశావాహుల్లో ఆందోళన

మరో ఏడాదిలో రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న టిఆర్‌ఎస్‌ ‌నాయకుల్లో ఆప్పుడే ఆందోళన మొదలైయింది. ఎన్నో ఆశలతో పార్టీలో కొనసాగుతున్న తమకు ఈసారికూడా టికట్‌ ‌లభించే అవకాశాలులేవన్న సంకేతాలు వెలువడడంతో ఇంకా ఈ పార్టీలో కొనసాగాలా లేదా పార్టీ మారాలా అన్న మీమాంసలో వారు పడిపోయారు. వివిధ పార్టీలనుండి అనేక మంది నాయకులు టిఆర్‌ఎస్‌లో జంప్‌ ‌కావడంతో గులాబి కారు ఇప్పుడు ఓవర్‌ ‌లోడ్‌ అయింది. మారినవారిలో కొందరు ఇతర పార్టీనుండి శాసనసభ్యులుగా గెలిచినవారు కాగా, మరి కొందరు ఎంఎల్సీలుగా, ఇంకొందరు వివిధ హోదాల్లో ఉన్నవారున్నారు. వారు గులాబీ కండువ కప్పుకునేప్పుడు ఏవైతే హామీలిచ్చారో, ఇప్పుడా హామీలను టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నిలబెట్టుకోవాల్సి ఉంది. కొందరికి ఎంఎల్‌ఏ ‌టికెట్‌ ఇస్తామని, మరి కొందరికి ఎంఎల్సీ పదవిని కట్టబెడతామని చెప్పడంతో ఇంతకాలంగా ఏదో విధంగా కాలం వెళ్ళదీసిన వారంతా ఇప్పుడు తమ భవిష్యత్‌ ఏమిటన్న ఆలోచనలో పడ్డారు. తాజాగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనే వీరిని ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తున్నది. సిట్టింగ్‌ ఎంఎల్‌ఏలకే తిరిగి టికెట్‌ ఇస్తామని ఇటీవల కెసిఆర్‌ ‌బహిరంగంగానే ప్రకటించడంతో టిఆర్‌ఎస్‌ ‌వర్గాలను ఒక్కసారే ఆలోచనలో పడేసింది. ఎన్నికలకు మరో ఏడాదికాలం ఉన్నప్పటికీ ఇప్పుడే ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వొచ్చిందన్న విషయంపైనే తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మునుగోడు ఎన్నిక సందర్భంలో వెలుగుచూసిన నలుగురు ఎంఎల్‌ఏల కొనుగోలు వ్యవహారాన్ని చూసి కెసిఆర్‌ ‌తొందరపడి ఈ ప్రకటన చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇలా ముందస్తుగా ప్రకటిస్తే ప్రధానంగా సిట్టింగ్‌ ఎంఎల్‌ఏలు చేజారకుండా ఉంటారన్న అభిప్రాయంగానే ఆయన ఈ ప్రకటన చేసి ఉంటారన్న వాదన ఒకటుంది. ఎన్నికల సమయానికి ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుం దన్న సర్వేను దృష్టిలో పెట్టుకుని కొందరినైనా తప్పించే అవకాశాలుండకపోవన్న వాదనకూడా వినిపిస్తున్నది.

ఏది ఏమైనా రాష్ట్రంలోని ప్రతీ శాసనసభ నియోజకవర్గంలో ఇద్దరినుండి నలుగురి వరకు టికెట్‌ ‌కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు లేకపోలేదు. టికెట్‌ ‌మాత్రం ఎవరికో ఒకరికి మాత్రమే లభిస్తుంది. అలాంటి పరిస్థితిలో మిగతావారు అభ్యర్థికి మద్దతిస్తారా? అలిగి పార్టీకి దూరముంటారా? లేదా పార్టీ మారుతారా అన్నదే ఇప్పుడు ప్రధానాంశమైంది. వివిధ పార్టీలో మంచి హోదాలో ఉండి, టిఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవులు అలంకరించి, మాజీలైన వారి పరిస్థితికూడా ఇప్పుడు ఆయోమంగా మారింది. ఖమ్మంలో టిఆర్‌ఎస్‌ ‌పట్టుకు తుమ్మల నాగేశ్వర్‌రావు కృషిలేకపోలేదు. కాని, 2018లో ఆయన ఓడినప్పటినుండి పార్టీ నిర్లక్ష్యంగా చూస్తున్నదన్న అపవాద ఉంది. ఆయన ఓటమికి స్వీయపార్టీలోని కొందరు నాయకులే కారణమన్న ప్రచారం ఉంది. అప్పటినుండి దాదాపు రెండేళ్ళకాలంగా ఆయనకు అక్కడ చేపట్టే పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానమే అందడంలేదంటూ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంనుండి ఈసారి పోటీచేయాలనుకున్నారు. కాని కెసిఆర్‌ ‌తాజా ప్రకటన ఆయన ను మరింత కృంగదీసింది. అందుకే ఆయన టికెట్‌ ‌లేనప్పుడు పార్టీలో ఉండడమెందుకని సన్నిహితులతో మదన పడ్డట్లు తెలుస్తున్నది. పార్టీలో ఉండాలా, వద్దా అన్నది త్వరలోనే ఆయన తేల్చుకునే పనిలో భాగంగానే జనవరిలో పాలేరులో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసి, అందులోనే తన భవిష్యత్‌ ‌కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశాలున్నాయంటున్నారు. నిజామాబాద్‌లో రాష్ట్ర మహిళా ఫైనాన్స్ ‌కార్పోరేషన్‌ ‌చేర్‌పర్సన్‌ ఆకుల లలిత చాలాకాలంగా ఎంఎల్‌ఏ ‌టికేట్‌ ‌కోసం ఎదురు చూస్తున్నారు.

మాజీ ఎంఎల్‌ఏకూడా అయిన ఆమె కాంగ్రెస్‌ ‌నుండి టిఆర్‌ఎస్‌లోకి చేరేప్పుడు ఎంఎల్సీ హామీమీదనే వొచ్చినట్లు తెలుస్తున్నది. ఎంఎల్సీగా ఆమెకు అవకాశం వొచ్చి నట్లే వొచ్చి పోవడంతో ఆమె తీవ్ర నిరాశలో పడిపోయింది. కల్వకుంట్ల కవితను ఎంఎల్సీగా చేయడంతో లలితకు అవకాశం చెయ్యిజారిపోయింది. నిజామాబాద్‌ అర్బన్‌ ‌సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ ‌బీగాల గణేష్‌గుప్త స్థానం టికెట్‌ ‌కోసం ఆమె ఎదురు చూస్తున్నది. కాంగ్రెస్‌ ‌నుండి వొచ్చిన ఖైరతాబాద్‌ ‌సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ ‌దానం నాగేందర్‌ ‌స్థానంలో టికెట్‌ ఆశించిన స్థానిక కార్పోరేటర్‌ ‌విజయారెడ్డి ఇప్పటికే టిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ ‌కండువ కప్పుకోగా, తాజాగా తిరిగి టిఆర్‌ఎస్‌లో చేరిన శ్రవణ్‌కుమార్‌, ‌మన్నె గోవర్థన్‌రెడ్డిలు అక్కడ టికెట్‌ ‌కోసం ఆశిస్తున్నారు. మహేశ్వరంలో కాంగ్రెస్‌నుండి ఎంఎల్‌ఏ ‌గా గెలిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రిపదవి దక్కగా,ఆమె చేతిలో ఓడిన తీగల కృష్ణారెడ్డి తన పరిస్థితేమిటన్న ఆలోచనలో పడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ ‌వనమా వెంకటేశ్వర్‌రావు స్థానంకోసం ఆయన చేతిలో ఓటమి చవిచూసిన జలగం వెంకట్రావ్‌ ఆశిస్తుండగా, ప్రస్తుతం రాష్ట్ర హెల్త్ ‌డైరెక్టర్‌గా పనిచేస్తున్న గడల శ్రీనివాసరావు సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. ఇలా ప్రతీ నియోజవర్గంలో ఇతర పార్టీలనుండి వొచ్చిన వారో, ఆ పార్టీలో గత దశాబ్ధానికి పైగా సేవలందిస్తున్నవారో ఆశపెట్టుకుని ఉన్నారు. కాగా పార్టీ పక్షాన ఎంపిలుగా గెలిచిన వారుకూడా ఈసారి తాము ఎంఎల్‌ఏలుగా పోటీచేయాలన్న అలోచనలో ఉన్నవారున్నారు. వారి ఒత్తిడికూడా పార్టీపైఉండే అవకాశాలు లేకపోలేదు. వీటన్నిటికీ మించి వామపక్షపార్టీ తో పొత్తు దరిమిలా ఆ పార్టీలకు ఇచ్చే స్థానాలెన్నీ, ఎక్కడెక్కడ అన్నది కూడా తేలాల్సి ఉంది. ఈ అవకాశం పోతే మళ్ళీ అయిదేళ్లవరకు తమ పరిస్థితేమిటన్న ఆయోమయంలో టిఆర్‌ఎస్‌ ‌క్యాడర్‌ ఉం‌ది.

Leave a Reply