Take a fresh look at your lifestyle.

రైతు వ్య‌తిరేక చ‌ట్టాలు త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాలి..! సీపీఐ నేత విజయ

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ,మార్చి 4: అన్న‌దాత‌ల ఉద్య‌మం చారిత్రాత్మ‌కం అంటూ ఘాజీపూర్‌లో రైతాంగ పోరుకి తెలంగాణ సీపీఐ నేత విజ‌య సంఘీభావం తెలిపారు.వ్య‌వ‌సాయ వ్య‌తిరేక చ‌ట్టాల‌పై దేశవ్యాప్తంగా రైతులు విరోచితంగా ఉద్య‌మం చేస్తున్నార‌ని తెలంగాణ సీపీఐ నేత గుగులోత విజ‌య పేర్కొన్నారు. అయితే, వారి ఉద్య‌మం ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం ఒంటెత్తు పోక‌డ‌ల‌కి పోతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌హోన్న‌తంగా జ‌రుగుతున్న ఈ రైతాంగ ఉద్య‌మం చారిత్రాత్మ‌క‌మ‌ని చెప్పారు. గురువారం దేశ రాజ‌ధాని ఢిల్లీ స‌రిహ‌ద్దులలో ఘాజీపూర్‌లో జ‌రుగుతున్న రైతు ఉద్య‌మానికి ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి రైతుల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

అనంత‌రం విజ‌య మీడియాతో మాట్లాడుతూ… మోడీ స‌ర్కారు అప్ర‌జాస్వామికంగా తీసుకొచ్చిన ఈ మూడు రైతు చట్టాలు భార‌త రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకమ‌ని అన్నారు. మార్కెట్లు, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ ధరలు పూర్తిగా రాష్ట్రల పరిధిలోని అంశాలని ఆమె గుర్తు చేశారు. అందుకే ఇవి రాజ్యాంగ వ్యతిరేకమని రైతులు చెబుతున్నారని తెలిపారు. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రం ఏకపక్షంగా చట్టాలు చేయడం తగద‌న్నారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిప‌డ్డారు. రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకునేందుకు స్వేఛ్చ ఉందని, దలారుల వ్యవస్థ లేదని కేంద్రం చెబుతోందన్నారు.

ఇది పూర్తిగా అబద్ధమ‌ని, ఇప్పటికే ఆ స్వేచ్ఛ రైతులకు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అనేక రాష్ట్రాల్లో ప్ర‌యివేటు మార్కెట్లు ఉన్నాయ‌ని, అయినప్పటీకి ఆ రాష్ట్రాల్లో ప్ర‌యివేటు పెట్టుబడులు వ్యవసాయంలోకి ప్రవేశించలేద‌న్నారు. బిహార్ రాష్ట్ర‌మే ఇందుకు నిలువెత్తు నిదర్శనమ‌ని, అక్కడ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని విజ‌య ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అక్కడి నుంచి వ్యవసాయ ఉత్పత్తులను లారీల్లో తీసుకొచ్చి పంజాబ్ ఇతర రాష్ట్రాల్లో ప్ర‌యివేటు వ్య‌క్తులు అమ్ముకుంటున్నారని వివ‌రించారు. ఈ చట్టాల్లో కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో సరైన నిబంధనలు లేవ‌ని విజ‌య‌ వివ‌రించారు. ఎమ్మెస్పీతో నేరుగా లబ్ధిపొందేది 10 నుంచి 15 శాతం మంది రైతులే కావచ్చ‌ని, కానీ ఆ ధర నిర్ణయించి ప్రకటించడంతో మిగతా వ్యాపారులు ఆ ధర సంకేతంగా తీసుకోవాల్సి ఉంటుంద‌ని గుర్తు చేశారు.

నిత్యావసర సరకుల చట్టంలో నిల్వ పరిమితి పై ఆంక్షలు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. నిల్వ విషయంలో ప్ర‌భుత్వ పెట్టుబ‌డి కూడా ఉండాలని డిమాండ్ చేవారు. ప్ర‌యివేటు గోదాముల స్థానంలో ప్ర‌భుత్వ గోదాములు కూడా ఉండాల‌న్నారు. అదానీ లాజిస్ట్రిక్ కంపెనీ 40 నుంచి 50 శాతం వ్యాపార‌, వాణిజ్యాన్ని సొంతం చేసుకుంద‌ని నొక్కి చెప్పారు. దాంతో పూర్తిగా వ్య‌వ‌సాయ‌ మార్కెట్ వ్యవస్థను దెబ్బతీస్తుంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. ధాన్య సేకరణ రంగాన్ని కూడా వీళ్లు స్వాధీనం చేశార‌న్నారు. ఈ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమే కాక రైతు వ్యతిరేకమైనవి కూడా అని అభివ‌ర్ణించారు.

ఏ ఒక్కరూ ఈ చట్టాలు కావాలని అడగలేద‌ని, సాగు రంగంలో నూతన కార్పొరేట్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకే ఈ చట్టాలు విజ‌య చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఇప్ప‌టికైనా మేల్కొని వీటిని ఉప సంహరించుకోవాల‌ని డిమాండ్ చేశారు. రైతులు, రాష్ట్ర ప్ర‌భుత్వ మ‌రోసారి సంప్ర‌దింపులు జ‌రిపి వాటిని వెన‌క్కి తీసుకోవాల‌ని సూచించారు. తాజా చ‌ట్టాల కార‌ణంగా భూ యజమానులు త‌మ పోలాల్లోనే కూలీలుగా మారుతార‌న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 12.08 శాతం భూమి మాత్రమే మహిళల పేరు మీద ఉంద‌ని గుర్తు చేశారు. ప్రస్తుత చట్టాలతో వారు భూములు కోల్పోతార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పరిహారం దక్కే అవకాశం లేద‌ని గుర్తు చేశారు. శ్రామికులు పూర్తిగా పనులకు దూరమవుతారన్నారు అని అన్నారు.

Leave a Reply