Take a fresh look at your lifestyle.

రాజకీయ పార్టీలకు మరో పరీక్ష.. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక

జీహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో తమ శక్తిన ంతా ధారబోసిన రాజకీయ పార్టీలకు, ఇప్పుడు మరో పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తు న్నది. నాగార్జు నసాగర్‌ ‌శాసన సభ్యుడిగా ఎన్నికైనా టిఆర్‌ఎస్‌ ‌నాయకుడు నోముల నర్సయ్య మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రంలో శాసనసభ స్థానాలకు ఇలా ఉప ఎన్నిక జరగటం దీనితో మూడవది. 2018లో శాసనసభ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ ‌స్థానంనుండి గెలిచిన తెలంగాణ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి అదే నియోజకవర్గం నుండి ఎంపిగా ఎన్నిక కావడంతో శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే అప్పుడు జరిగిన ఉప ఎన్నికను దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టగా తీసుకున్నాయి. టిపిసిసి చీఫ్‌ ఉత్తమకుమర్‌రెడ్డి స్థానం కావడంతో ఆ స్థానాన్ని ఎలాగైనా గెలిపించుకోవాలని కాంగ్రెస్‌ ‌విశ్వప్రయత్నంచేసింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వంత నియోజకవర్గం కావడంతో ఆయన ఆ స్థానంలో తన భార్యను నిలబెట్టినప్పటికీ గెలిపించుకోలేకపోయాడు.

ఆ స్థానాన్ని అధికారపార్టీ టిఆర్‌ఎస్‌ ‌కైవసం చేసుకుంది. ఆ తర్వాత అధికారపార్టీ సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ ‌రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో ఏర్పడిన దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఖాళీలో ఆయన భార్యను నిలబెట్టినా సిట్టింగ్‌ ‌స్థానాన్ని టిఆర్‌ఎస్‌ ‌పొందలేకపోయింది. ఈ స్థానంలో అనూహ్యంగా భారతీయ జనతాపార్టీ తన జంఢాను ఎగురవేసింది. దీంతో ఒకటి రెండు స్థానాల్లో కొనసాగుతూ వస్తున్న టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌లకు గట్టి దెబ్బేతాకింది. ఈ స్థానాన్ని గెలుచుకున్న వెంటనే వచ్చిన జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో బిజెపి అదే వరవడిని చూపింది. ఇక్కడ కూడా టిఆర్‌ఎస్‌ ఊహించని దెబ్బ తగిలింది. బిజెపి కన్నా ఏడు స్థానాలు అధికంగా గెలుచుకున్నప్పటికీ స్వయంగా మేయర్‌ను ఎంపిక చేసుకునే పరిస్థితి లేకుండా చేసింది బిజెపి. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న తరుణంలోనే తాజాగా నాగార్జునసాగర్‌ ‌సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ ‌నోముల నర్సింహయ్య మృతి చెందడంతో ఇప్పుడీ రాజకీయపార్టీలు మరో పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా ఇది కాంగ్రెస్‌ ‌స్థానం అయనప్పటికీ, గత ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌ ‌కాంగ్రెస్‌పై పైచెయ్యిని సాధించింది. కాంగ్రెస్‌ ‌పార్టీ దిగ్గజం కుందూరు జానారెడ్డి, టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సయ్య చేతిలో ఓటమి చవిచూడాల్సివచ్చింది. 2009 నుండి ఇక్కడ ఎంఎల్‌ఏగా కొనసాగుతూ వొచ్చిన జానారెడ్డి స్వల్ప తేడాతో ఓటమిపాలైనారు.

ఇప్పుడీ స్థానంలో త్వరలో ఉప ఎన్నిక జరగనుండడంతో కాంగ్రెస్‌ ‌పార్టీ  తిరిగి తమ స్థానాన్ని దక్కించుకోవాలన్న ఉత్సాహంతో ఉంది. దేశంలోనే కాక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ ‌క్రమేణ ఉనికిని కోల్పోతున్న పరిస్థితిలో ఈ ఉప ఎన్నికలోనైనా తన సత్తా చాటుకుని ప్రతిష్టను నిలుపుకోవాలని చూస్తోంది. గత శాసనసభ ఎన్నిక) అనంతరం పలువురు ఎంఎల్‌ఏలు పార్టీ మారడాన్ని నిరోధించలేక పోయాడంటూ ఉత్తమ్‌కుమార్‌పై ఆ పార్టీలో ఒత్తిడి మొదలైంది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలతో అది మరింత తీవ్రతరమవడంతో తన చీఫ్‌ ‌పదవికి రాజీనామ ప్రకటించినా, అధిష్టానం ఆయన్నే కొనసాగిస్తూ వచ్చింది. దానివల్ల ఆ పార్టీ లాభంకన్నా నష్టాన్నే ఎక్కువ చవిచూసింది. అప్పటి నుండి టిపిసిసి చీఫ్‌ ‌పదవి కోసం రాష్ట్ర పార్టీలో నాయకుల మధ్య పోటీ ఏర్పడింది. ఎవరికి వారు ఆ పదవికి తానే అర్హుడినని మీడియా ముందు, అదిష్టానం ముందు చెప్పుకుంటూ వొస్తున్నారు. ఈ విషయమై ఢిల్లీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు తంటాలు పడుతూ వొచ్చారు. అయినా అధిష్టానం ఎవరికీ హామీ ఇవ్వకుండా నెట్టుకొచ్చింది. కాని, తాజాగా జరిగిన జిహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిదెబ్బ తగిలింది. ఉత్తమ్‌ ‌సమర్థవంతుడైన నాయకుడిగా అధిష్టానం చెబుతున్నప్పటికీ ఈ ఎన్నికల్లో కేవలం రెండు అంటే రెండు డివిజన్‌లను మాత్రమే గెలుచుకోవడం ద్వారా  కాంగ్రెస్‌ అ‌ప్రతిష్టపాలైంది. దీంతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన రాజీనామాను అంగీకరించి, కొత్త చీఫ్‌ను ఎన్నుకోవాల్సిందిగా అధిష్టానానికి విజ్ఞప్తి చేయడంతో మరోసారి రాష్ట్ర కాంగ్రెస్‌లో పరుగుపందాలు మొదలైనాయి. ఈ విషయంలో మాజీ మంత్రుల, ప్రస్తుత, మాజీ శాసనసభ్యులు, ఎంఎల్‌సిలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, సీనియర్‌ ‌నాయకులతో పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జి మాణిక్యం టాగూర్‌ ‌నాలుగు రోజులపాటు సమాలోచన చేసేందుకు హైదరాబాద్‌ ‌రావడంతో ఆ పదవిని ఆశిస్తున్న పలువురి పేర్లు వెలుగులోకి వొస్తున్నాయి.

ఇదే క్రమంలో నాగార్జునసాగర్‌ ‌స్థానంలో ఓడిపోయిన జానారెడ్డి పార్టీ మారుతున్నాడన్న వార్త ఆ పార్టీ శ్రేణులను అయోమయంలో పడేసింది. గత ఎన్నికల్లో తనకు బదులుగా నాగార్జునసాగర్‌ ‌స్థానాన్ని తన కుమారుడు రఘువీర్‌రెడ్డికిచ్చి, తనకు ఎంపి టికెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ ‌చేసినప్పటికీ జానారెడ్డికి మాత్రమే శాసనసభ టికెట్‌ ‌లభించింది. అప్పటి నుండి కాస్త అలిగిన జానా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడాన్ని తగ్గించాడు. ఇప్పుడు పార్టీమార్పిడి వార్తలతో ఆయన పార్టీ వీడుతాడేమోనన్న భయం ఆ పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. అయితే దానికి పులిస్టాప్‌పెడుతూ 2013లో పార్టీ గెలిస్తే  ముఖ్యమంత్రిని కావాల్సిన తాను పార్టీ ఎందుకు మారుతానంటూ ఆందరినీ మరో విధంగా ఆశ్చర్యపర్చారు. అయితే ఆయనకు కూడా టిపిసిసి చీఫ్‌ ‌పదవిపై ఆశలున్న విషయాన్ని గతంలోనే అనేక సందర్బాల్లో వెలిబుచ్చారు. ఇక్కడ వొచ్చిన చిక్కల్లా పార్టీలోకి కొత్తగా వొచ్చినవారికి, పాత వారికీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్నది. అధ్యక్షుని ఎంపిక జరిగిన వెంటనే రాష్ట్ర పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినా ఆశ్చర్యపడాల్సిందిలేదన్నది జరుగుతున్న పరిణామాలు తెలుపుతున్నాయి.
మండువ రవీందర్‌ ‌రావు

Leave a Reply