Take a fresh look at your lifestyle.

సిద్ధిపేట జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటు

కుకునూరుపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ
సిద్ధిపేట, జూలై 28 (ప్రజాతంత్ర బ్యూరో): సిద్ధిపేట జిల్లాలో కొత్తగా మరో మండల కేంద్రం ఏర్పాటైంది. జిల్లాలోని గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని కొండపాక మండల పరిధిలో గల కుకునూరుపల్లిని 17గ్రామాలతో కలిపి కొత్తగా మండల కేంద్రంగా ఏర్పాటూ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్‌ ‌రహదారిపైన గల కుకునూరుపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ గత కొంత కాలంగా స్థానికులు డిమాండు చేస్తున్నారు. ఇటీవల రాష్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు కుకునూరుపల్లి మండల పర్యటన సందర్భంగా ప్రజలు, మండల సాధన సమితి ప్రతినిధులు హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. వినతి పత్రం ఇచ్చారు. ఆ సందర్భంగా మంత్రి హరీష్‌రావు సైతం కుకునూరుపల్లిని మండల కేంద్రంగా చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తాననీ అన్నారు.

ప్రజలకు, మండల సాధన సమితి ప్రతినిధులకు హామీ ఇచ్చిన మేరకు మంత్రి హరీష్‌రావు రాష్ట్ర ప్రభుత్వానికి కుకునూరుపల్లిని మండల కేంద్రంగా చేయాలంటూ సిఫారుసు చేశారు. మంత్రి హరీష్‌రావు సిఫారుసు మేరకు కొండపాక మండల పరిధిలోని మెదిన్‌పూర్‌, ‌కుకునూరుపల్లి, తిప్పారం, తిమ్మారెడ్డిపల్లి, బొబ్బాయిపల్లి, మంగోల్‌, ‌కోనాయిపల్లి, ముద్దాపూర్‌, ‌మాథ్‌పల్లి, లక్డారం, జగదేవ్‌పూర్‌ ‌మండలంలోని చిన్నకిష్టాపూర్‌, ‌జంగంరెడ్డిపల్లి, రాయవరం, రామచంద్రాపూర్‌, అం‌తాయిగూడ, ఎల్లాయిగూడ, పిటి.వెంకటాపూర్‌ ‌గ్రామాలను కలుపుతూ కుకునూరుపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. కుకునూరుపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిఎం కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply