రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న పాలన కొనసాగడం లేదు ఆచార్య కోదండరామ్
సాధించుకున్న తెలంగాణలో ప్రజలు కోరుకున్న పరిపాలన కొనసాగడం లేదని ప్రజా పాలన కోసం మరో ఉద్యమం తప్పదని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆచార్య కోదండరాం అన్నారు. బుధవారం వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆచార్య కోదండరామ్ మాట్లాడుతూ ప్రజాస్వామిక తెలంగాణ ప్రజలు కోరుకున్నారని, కానీ ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో నిరంకుశ పరిపాలన కొనసాగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని, తెలంగాణ ఉద్యమకారులను అవహేళన చేసిన వ్యక్తులకు నేడు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం వల్ల ప్రజాస్వామిక తెలంగాణ పేర్కొన్న విధంగా లేదని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో నిరుద్యోగులను, ఉద్యోగస్తులను, ప్రజల నమ్మకాలను ఈ ప్రభుత్వం వొమ్ము చేసిందన్నారు. ఉద్యోగస్తులకు ఇవ్వవలసిన పిఆర్సి పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాల్సి ఉంది కానీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పిఆర్సి ఇస్తున్నట్లుగా చెప్పడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి ఎవరితో మాట్లాడడు, ఎవరికి అందుబాటులో ఉండడు, ఎవరు చెప్పినా వినడు దీని ద్వారా ప్రజాపాలన సరిగ్గా ఉండదని ప్రజలు కోరుకున్న పరిపాలన ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలకు వ్యతిరేకంగా పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే మరో ఉద్యమం తప్పదని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల గురించి ధర్నా చేద్దామంటే, రోడ్డుమీద బైటాయిస్తామంటే, ఏదైనా సభ పెట్టుకుందామంటే ప్రభుత్వం నుండి అనుమతి దొరకదని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షా 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటున్నారు ఇందులో రెగ్యులరైజేషన్, ప్రమోషన్లు ఉద్యోగ భర్తీ లోనికి రావని కేవలం 71 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని ఇంకా లక్షా ఎనభై వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిన విషయం మీరు సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నామని కోదండరాం పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులను పర్మినెంట్ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఇప్పటికీ అమలు కాలేదని, రాష్ట్రంలో పరిశ్రమల పేరుతో పేదల వద్దనుండి గుంజుకున్నా భూములలో ఒక్క పరిశ్రమ కూడా కట్టలేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా పరిపాలన కోసం తాను ఉద్యమిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మార్పుకు అనుగుణంగా ప్రభుత్వ పాలన ఉండాలని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు క్యాబినెట్ సమావేశం అవుతుంది, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు వస్తాయి, కానీ ప్రభుత్వ రంగ విశ్వవిద్యాలయాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లక్షలాది మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చిన హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న పరిపాలన అందడం లేదని దీనికి మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి అధ్యక్షత వహించగా ప్రెస్‌క్లబ్ కార్యదర్శి వెంకట్, బిఆర్ లెనిన్, సుభాష్, గాడిపెళ్లి మధు, వివిధ పత్రిక మీడియా రంగాల స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.