Take a fresh look at your lifestyle.

విశాఖలో మరో గ్యాస్‌ ‌లీక్‌ ‌ఘటన

  • పరవాడ ఫార్మాసిటీలో లీకయిన విషవాయువు
  • ఇద్దరు మృతి..పలువురికి అస్వస్థత
  • ఆస్పత్రికి తరలించిన అధికారులు
  • ఘటనాస్థలిని పరిశీలించిన కలెక్టర్‌, ‌పోలీస్‌ ‌కమిషనర్‌
  • ‌ప్రమాద ఘటనపై ఆరా తీసిన సిఎం వైఎస్‌ ‌జగన్‌

విశాఖపట్టణం,జూన్‌ 30 : ‌పరవాడ ఫార్మాసిటీలో సాయినార్‌ ‌లైఫ్‌ ‌సైన్స్ ‌ప్రైవేట్‌ ‌కంపెనీ లిమిటెడ్‌లో విషవాయువు లీక్‌ అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ ‌ఘటన మరువకముందే విశాఖ ఫార్మాసిటీలోమరో గ్యాస్‌ ‌లీక్‌ ‌ప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలో సాయినార్‌ ‌లైఫ్‌ ‌సైన్స్ ‌ప్రైవేట్‌ ‌కంపెనీ లిమిటెడ్‌లో విషవాయువు లీక్‌ అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. కంపెనీలో షిప్ట్ ఇన్‌ ‌చార్జ్ ‌రాగి నాయుడు, కెమిస్ట్ ‌గౌరీశంకర్‌ ఈ ‌ప్రమాదంలో మృతి చెందారు. పరవాడలోని ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్‌ ‌వినయ్‌ ‌చంద్‌, ‌నగర పోలీసు కమిషనర్‌ ఆర్కె నా పరిశీలించారు. మృతి చెందిన వారిని కేజీఎచ్‌కు కంపెనీ ప్రతినిధులు తరలించారు. ప్రమాదం రాత్రి 11:30 కు జరిగితే కంపెనీ సిబ్బంది మూడు గంటల తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన ఎల్వీ చంద్రశేఖర్‌, ‌పి.ఆనంద్‌ ‌బాబు, డి.జానకీ రామ్‌, ఎం.‌సూర్యనారాయణలను గాజువాకలోని ఆర్కే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలెక్టర్‌ ‌విననయ్‌చంద్‌, ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ఆర్‌కే నా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తుస్తున్నారు.

కంపెనీపై కేసు నమోదు
విశాఖ సాయినార్‌ ‌కంపెనీలోని బాయిలర్‌లో గ్యాస్‌ ‌లీకవడంతో ప్రమాదం జరిగిందని సీపీ ఆర్కే నా తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కలెక్టర్‌, ‌సీపీ ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సాయినార్‌ ‌కంపెనీపై ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదు చేశామని అన్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని, నలుగురు కార్మికులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు. మృతుల్లో షిప్ట్ ఇన్‌చార్జ్ ‌నరేంద్ర గుంటూరు జిల్లా తెనాలి వాసి కాగా…కెమిస్ట్ ‌గౌరీశంకర్‌ ‌విజయనగరానికి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. మూడేళ్ల క్రితం ఇదే సంస్థలో రియాక్టర్‌ ‌పేలి ఇద్దరు మృతి చెందారని… గతంలో జరిగిన ప్రమాదంపైనా విచారణ చేస్తున్నామని సీపీ ఆర్కే నా వెల్లడించారు.

ఘటనాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే
ఘటనా స్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే అదీప్‌ ‌రాజు మాట్లాడుతూ ఒక రియాక్టర్‌ ‌నుంచి మరో రియాక్టర్‌కు గ్యాస్‌ ‌పంపిస్తున్నప్పుడు పైప్‌ ‌సరిగా బిగించకపోవడంతో గ్యాస్‌ ‌లీక్‌ అయినట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనలో ఆరుగురు స్ప•హ తప్పిపడిపోయారని, వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారన్నారు. నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఎమ్మెల్యే చెప్పారు. మృతి చెందిన కుటుంబాలకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. వైసీపీ ప్రజల పక్షాన పనిచేసే పార్టీ అని, యాజమాన్యాలకు కొమ్ముకాసే పార్టీ కాదని అదీప్‌ ‌రాజు అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని మరోసారి ఆయన స్పష్టం చేశారు.

ప్రమాద ఘటనపై కమిటీ..
హైడ్రోజన్‌ ‌సల్ఫైడ్‌ అధిక మోతాదులో రియాక్టర్‌ ‌వద్ద రావడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్‌ ‌వినయ్‌ ‌చంద్‌.. ‌నలుగురు అధికారులతో కమిటీని నియమించారు. పరవాడ ఫార్మా సిటీ ప్రమాద ఘటనపై కలెక్టర్‌తో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మట్లాడారు. ప్రమాద వివరాలను అడిగి తెలుకున్నారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ప్రమాదంపై సిఎం జగన్‌ ఆరా
ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. సీఎంవో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఇద్దరు మరణించారని, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, మరో ముగ్గురు సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. రియాక్టర్‌ ‌వద్ద లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. సోమవారం రాత్రి 11:30 గంటలకు ప్రమాదం జరిగిందని, తమ దృష్టికి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీ ప్రాంతానికి జిల్లా కలెక్టర్‌, ‌సీపీ చేరుకున్నారని వివరించారు.ముందు జాగ్రత్తగా ఫ్యాక్టరీని షట్‌డౌన్‌ ‌చేయించారని, ప్రమాదం ఫ్యాక్టరీలో ఓ రియాక్టర్‌ ఉన్న విభాగానికి పరిమితమని ఎలాంటి ఆందోళన అవసరంలేదని అధికారులు నివేదించారు. బాధితులను కలెక్టర్‌ ‌వినయచంద్‌, ‌విశాఖ సిటీ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌నా పరామర్శించారని తెలిపారు. ఈ ఘటనపై విచారణ కూడా చేయిస్తున్నట్టు కలెక్టర్‌ ‌వెల్లడించారన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ఆదేశించారు.

టిడిపి నేతలను అడ్డుకున్న పోలీసులు
విశాఖ సాయినగర్‌ ‌లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌ఫార్మా కంపెనీలో ప్రమాదాన్ని పరిశీలించేందుకు వచ్చిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. కంపెనీ లోపలకు ఎవరిని వెళ్లనివ్వకుండా బారికేడ్లు, రోప్‌ ‌పార్టీతో ప్రవేశ మార్గాన్ని పోలీసులు మూసివేశారు. కంపెనీ లోపలకు వెళ్లేందుకు పై అధికారులతో చర్చించిన తర్వాత అనుమతిస్తామని మాజీ మంత్రి బండారుకు పోలీసులు తెలియజేశారు. గతంలో ఇప్పుడు ఇటువంటి పరిస్థితి లేదని… పోలీసులతో అడ్డుకోవడం చాలా దారుణమని బండారు సత్యనారాయణ మండిపడ్డారు.

చంద్రబాబు దిగ్భ్రాతి
విశాఖలోని సాయినార్‌ ‌ఫార్మా కంపెనీలో గ్యాస్‌ ‌లీకేజీపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. పరవాడలో రియాక్టర్‌ ‌నుంచి బెంజీన్‌ ‌లీకేజీపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ ‌లీకేజి మరువక ముందే పరవాడ గ్యాస్‌ ‌లీకేజి దుర్ఘటన బాధాకరమన్నారు. విశాఖలో వరుస గ్యాస్‌ ‌లీకేజీలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని…. గ్యాస్‌ ‌లీకేజీ బాధితులకు వెంటనే అత్యున్నత వైద్యసాయం అందించాలని చంద్రబాబు డిమాండ్‌ ‌చేశారు. సాయినార్‌ ‌కంపెనీ మృతుల కుటుంబాలకుకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్‌ ‌చేశారు. ఇద్దరు మృతి చెందడం, మరో ఐదుగురు అస్వస్థతకు గురవడం విచారకరమన్నారు. బాధితులకు మెరుగైన ఉచిత వైద్యం, ఆర్థిక సహాయం అందించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్‌ ‌నిల్వలున్న పరిశ్రమలన్నింటినీ తనిఖీ చేయాలన్నారు. పదేపదే విశాఖలో జరుగుతున్న విషవాయువుల లీకేజీ ఘటనలపై… సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ ‌చేస్తున్నామని సీపీఐ నేత రామకృష్ణ తెలిపారు.

Leave a Reply