దుండగుడి కాల్పుల్లో తెలంగాణ యువతి దుర్మరణం
రంగారెడ్డి,మే8 : అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. టెక్సాస్‌లోని ప్రీమియం ఔట్‌లెట్ మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదేళ్ల చిన్నారి సహా ఏడుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా.. టెక్సాస్ కాల్పుల్లో మృతి చెందిన వారిలో తెలంగాణకు చెందిన యువతి కూడా ఉంది. ఆమె పేరు ఐశ్వర్య తాటికొండ. ఐశ్వర్య తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పని చేస్తున్నారు.్గ టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌కు 25 కిలోటర్ల దూరంలోని అలెన్ ప్రీమియం ఔట్‌లెట్స్ అనే పెద్ద మాల్‌లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మాల్‌లో120 వరకు వివిధ కంపెనీల స్టోర్లు ఉన్నాయి.
సెలవు రోజు కావడంతో విపరీతమైన రద్దీ ఉంది. అప్పుడే దుండగుడు మాల్ వద్దకు కారులో వచ్చాడు. కారు బయట ఆపి మాల్‌లోకి చొరబడి కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం విని భయభ్రాంతులైన వందలాది మంది జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఇంకొంత మంది ప్రాణాలు కాపాడుకునేందుకు మాల్‌లోనే దాక్కున్నారు. మృతుల్లో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆ సమయంలో మాల్‌లోనే ఉన్న అలెన్ పోలీసు అధికారి ఒకరు అప్రమత్తమై దుండగుడిని కాల్చిచంపారు. అనంతరం ఎమర్జెన్సీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మృతులను, దుండగుడిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ దిగ్భ్రాతి వ్యక్తం చేశారు.