Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో మరో ‘ఉప’ పోరు

రాష్ట్రం మరో ఉప పోరు సిద్ధం కానుంది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ ‌పార్టీ పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన దరిమిలా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్‌ ‌నియోజకవర్గానికిప్పుడు ఉప ఎన్నిక అనివార్యమయింది. రాష్ట్రంలో రెండవ సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పటివరకు మూడు ఉప ఎన్నికలు జరగ్గా ఇది నాలుగవ దవుతుంది. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు మొదటిసారిగా జరిగిన ఎన్నికల కాలం పూర్తి కాకుండానే తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన విషయం తెలిసిందే. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల సందర్భంగా హుజూర్‌ ‌నగర్‌ ‌శాసనసభ్యుడిగా గెలిచిన కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి నల్లగొండ ఎంపిగా ఎన్నిక కావడంతో మొదటిసారిగా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యత ఏర్పడింది. ఈ స్థానాన్ని పదిలపర్చు కునేందుకు ఉత్తమ్‌ ‌చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ ఉప ఎన్నికలో తన భార్యను కాంగ్రెస్‌ ‌పక్షాన నిలబెట్టినప్పటికీ, టిఆర్‌ఎస్‌ ‌నుండి పోటీచేసిన సైదిరెడ్డి విజయం సాధించాడు.

అలాగే దుబ్బాకలో కూడా.. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఖాలీ ఏర్పడింది. ఆ నియోజకవర్గంలో రామలింగారెడ్డి కి మంచి పేరు, ప్రతిష్టలు ఉండటం, స్థానిక ప్రజలు ఆ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరడంతో అధికార టిఆర్‌ఎస్‌ ఆ ‌కుటుంబంపట్ల ఉన్న సానుబూతితో రామలింగారెడ్డి భార్యకు టికట్‌ ఇచ్చింది. అయితే అనూహ్యంగా ఈ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ చేజిక్కించుకుంది. ఆ పార్టీ నుండి పోటీ చేసిన రఘునందన్‌రావు పైన అక్కడి ప్రజల్లో ఏర్పడిన సానుబూతి ఆయనకు ఆ అవకాశాన్ని కలిగించింది.

మూడవసారి నాగార్జునసాగర్‌ ‌శాసనసభ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు, టిఆర్‌ఎస్‌ ‌నాయకుడు నోముల నర్సింహయ్య అకస్మాత్తుగా మరణించడంతో ఇక్కడ ఖాలీ ఏర్పడింది. విచిత్రమేమంటే ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపినట్లు అయింది. కాంగ్రెస్‌లో మోస్ట్ ‌సీనియర్‌, ‌దిగ్గజంగా పేరున్న కుందూరు జానారెడ్డి సొంత నియోజకవర్గం కావడం వల్ల కూడా ఇక్కడ ఎన్నికకు ప్రాధాన్యత ఏర్పడింది. అది ఉప ఎన్నిక కాబట్టి జానారెడ్డి ఆయిష్టత చూపించినా, తన కుమారుడికి టికట్‌ ఇస్తే అభ్యంతరంలేదని చెప్పుకొచ్చాడు. కాని దుబ్బాక ఎన్నిక తర్వాత రాష్ట్రంలో బిజెపి ఎలా దూసుకువస్తున్నదన్నది చూసిన కాంగ్రెస్‌ ‌నేతలకు ఈ స్థానాన్ని గెలుచుకోవడంద్వారా పోయిన తమ పరువును నిలుపుకోవాలన్న పట్టుదల చూపించారు.

అందుకు సమర్థుడు జానారెడ్డే నంటూ ఆయన్ని అక్కడినుండి పోటీ పెట్టారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్‌, ‌బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌మధ్య ట్రైయాంగిల్‌ ‌ఫైట్‌ను తలపించింది. టిఆర్‌ఎస్‌ ‌కూడా దీన్ని సవాలుగా తీసుకుంది. దుబ్బాకలో జరిగిన పొరపాటు ఇక్కడ జరగనీయకుండా ముందస్తు వ్యూహాలతో ముందుకు పోవడంతో తుదకు విజయం సాధించింది. దుబ్బాకలో మాదిరిగా మృతిచెందిన కుటుంబ సభ్యులకే టికట్‌ ‌కేటాయించినా, రాష్ట్రంలోని తమ పార్టీ యంత్రాంగాన్నంతా అక్కడ కేంద్రీకరింపజేయడంతో నర్సింహయ్య కుమారుడు భగత్‌ ‌రాజకీయాలకు కొత్త అయినా నెట్టుకురాగలిగాడు.

ఇప్పుడు ఈటెల రాజీనామాతో మరోసారి రాష్ట్రంలో ఉప ఎన్నిక అనివార్యత ఏర్పడింది. ఈటెల సొంత నియోజకవర్గమేకాక, పలుసార్లు ఇక్కడినుండి విజేతగా నిలుస్తూ వొస్తున్న ఆయన అధిష్టానం తో విభేదాలతో రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడాయన భారతీయ జనతా పార్టీ తీర్థం తీసుకుంటున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించాడు. కాషాయ కండువా కప్పుకోవడమే తర్వాయి. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో అనివార్యంగా ఇక్కడ ఉప ఎన్నిక జరుగాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్వరలో ఇక్కడ జరుగబోయే ఎన్నిక కూడా ఇటీవల జరిగిన నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికంత హడావిడి ఉండబోనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ముందువరుసలో నిలిచిన నేతగా, రాష్ట్ర ప్రభుత్వంలో నెంబర్‌ ‌టు గా ఈటెలకు పేరుంది.

అలాంటి వ్యక్తి స్థానంలో ఉప ఎన్నిక జరుగబోతుందంటే రాజకీయ వర్గాల్లో సహజంగానే ఆసక్తి ఉంటుంది. కెసిఆర్‌ ‌పాలనను విమర్శిస్తున్నవారు, ప్రతిఘటిస్తున్నవారు ఒక వైపు, పాలనకు బ్రహ్మరథం పడుతున్నవారి మధ్య ఇప్పటినుండే చర్చోప చర్చలు జరుగుతున్నాయి. రాజీనామా చేస్తున్న ఈటెల తిరిగి ఇక్కడి నుండి పోటీ చేస్తారా, లేక తన బదులుగా ఆయన భార్యను నిలబెడుతారా అన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదిఏమైనా ఈ స్థానాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని టిఆర్‌ఎస్‌ ఇప్పటినుండే పావులు కదుపుతోంది. కాగా,ఈటెల పై గెలిచే వ్యక్తికి పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందన్న ఊహతో స్థానిక నాయకులు చాలామంది ఇక్కడినుండి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

Leave a Reply