Take a fresh look at your lifestyle.

తెలంగాణలో కొత్తగా మరో 5,567 పాజిటివ్‌ ‌కేసులు

  • ప్రభుత్వ దవాఖానాల వద్ద రోగుల పడిగాపులు
  • బ్యాంకు ఉద్యోగుల్లో కొరోనా కలవరం
  • ఆర్టీసీ బస్సుల్లో శానిటైజేషన్‌ ‌పక్రియ

తెలంగాణ రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. బుధవారం రాత్రి 8 గంటల వరకు 1,02,335 కొరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 5,567 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్‌ ‌విడుదల చేసింది. రాష్ట్రంలో కొరోనాతో  23 మంది మృతిచెందారు. కొరోనా బారి నుంచి నిన్న 2,251 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య 49,781కి చేరింది. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో మరో 989 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కొరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో సర్కారు దవాఖానాల్లో పడకలు నిండుకున్నాయి.  ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్స్, ‌వెంటిలేటర్స్ ‌కొరత ఏర్పడింది. ముఖ్యంగా కొరోనా నోడల్‌ ‌సెంటర్స్‌గా ఉన్న గాంధీ, టిమ్స్‌లో ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్స్, ‌వెంటిలేటర్స్ ‌కొరత తీవ్రంగా ఉంది. చెస్ట్ ‌హాస్పిటల్‌, ‌కింగ్‌ ‌కోటి హాస్పిటల్స్‌లో రెగ్యులర్‌ ‌బెడ్స్ ‌కొంత వరకు ఉన్నప్పటికీ ఐసీయూ, వెంటిలెటర్స్  ‌బెడ్స్ ‌ఫుల్‌ అయ్యాయి. అటు జిల్లాల్లో ఐసీయూ, వెంటిలేటర్స్ అం‌దుబాటులో లేకపోవడంతో అందరూ హైదరాబాద్‌కు క్యూకట్టారు. ఒకరికి ఐసీయూ బెడ్‌ ఇవ్వాలంటే… మరొకరు ఊపిరి ఆగాల్సిందే అన్న పరిస్థితి నెలకొంది. బెడ్స్‌ను సమకూర్చడంలో ఆరోగ్యశాఖ విఫలం అయ్యిందనే
విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో పేషంట్‌… ‌పది హాస్పిటల్స్ ‌తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోడరేట్‌, ‌సివియర్‌ ‌కొరోనా  రోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ప్రైవేట్‌లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చెప్పిన విధంగా చేతల్లో చూపించడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. మే నెలాఖరుకు మరింత దయనీయమైన పరిస్థితులు వస్తాయని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. ఇకపోతే నగరంలోని బ్యాంకుల్లో కొరోనా కలకలం రేపుతోంది. వందలాది మంది బ్యాంకు ఉద్యోగులు కొరోనా బారిన పడుతున్నారు. ఒక్క ఎస్‌బీఐ బ్యాంకులోనే 600 మందికి కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ క్రమంలో బ్యాంకుల సమయాన్ని తగ్గించేలా రాష్ట్ర బ్యాంకర్ల సమితి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకులు తెరిచి ఉంచాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

మరోవైపు బ్యాంకు ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ ‌కోసం స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌చేపట్టనున్నారు.కొవిడ్‌ ‌కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్‌ ఆర్టీసీ బస్సు లోపల సీట్లను ట్రి, ట్రికూ శానిటైజ్‌ ‌చేస్తోంది. రేతిఫైల్‌, ‌సికింద్రాబాద్‌ ‌బస్‌స్టేషన్లతో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. కండక్టర్లు, డ్రైవర్లకు రెండు శానిటైజ్‌ ‌బాటిళ్లు, మాస్క్‌లు అందచేస్తునట్లు డిపో మేనేజర్లు చెబుతున్నారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ‌ధరించాలని, లేకపోతే బస్సులోకి ఎక్కనివ్వమంటూ ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పది రోజులుగా ప్రయాణికుల సంఖ్య భారీగా పడిపోయిందన్నారు. రద్దీ రూట్లలో నెలక్రితం వరకు 60శాతం వరకు నమోదైన ఆక్యుపెన్సీ రేషియో ప్రస్తుతం 35శాతానికి పడిపోయిందని మేనేజర్లు చెబుతున్నారు. ఇదిలావుంటే  ఇళ్లలో మరణించిన కొవిడ్‌ ‌రోగుల అంత్యక్రియల నిర్వహణకు జీహెచ్‌ఎం‌సీ ఏర్పాట్లు చేస్తోంది. పాజిటివ్‌గా నిర్దారణ అయి, హోం ఐసోలేషన్‌లో ఉంటూ చనిపోయిన వారి దహన సంస్కారాలు జీహెచ్‌ఎం‌సీ నిర్వహిస్తోందని ఓ అధికారి తెలిపారు. అందుకయ్యే వ్యయాన్ని సంస్థే భరిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ దవాఖానాల  మరణించిన వారి మృతదేహాలకు మాత్రమే జీహెచ్‌ఎం‌సీ ఖర్చులతో అంత్యక్రియలు చేస్తున్నారు. బాధితులు 040-2111 1111, 91546 86549,  9154686558 కొవిడ్‌ ‌కంట్రోల్‌ ‌నెంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే అదనుగా కొన్ని సంస్థలు చావునూ వ్యాపారం చేస్తున్నాయి. అంత్యక్రియలకు రూ.30-40 వేల వరకు వసూలు చేస్తున్నాయి. సాధారణ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం లేక బాధితులు అడిగినంత ఇవ్వాల్సి వస్తోంది. తాజాగా జీహెచ్‌ఎం‌సీ నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాలకు కొంత ఉపశమనంగా మారనుంది.

Leave a Reply