38 మంది మృతి చెందినట్లు వెల్లడి
రిజిస్టేష్రన్ రద్దయ్యిందంటూ మెసేజ్‌లు
హైదరాబాద్,మే8:తెలంగాణలో కొరోనా కేసులు తగ్గడం లేదు. రోజువారి కేసులు ఆరువేలకు అటు ఇటుగా ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,186 కొరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ నివేదిక విడుదల చేసింది. అలాగే కొరోనాతో 38 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటి వరకూ మొత్తం 4.92 లక్షల కొరోనా కేసులు నమోదవగా.. 2,704 మంది మృతి చెందారు.
తెలంగాణలో ప్రస్తుతం68,462 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 904 కొరోనా కేసులు నమోదవగా.. రంగారెడ్డి 399, మేడ్చల్ 366, నల్గొండ జిల్లాలో 317 కేసులు, వరంగల్ అర్బన్ 231, కరీంనగర్ జిల్లాలో 182 కేసులు, నాగర్‌కర్నూలు 172, సిద్దిపేట 181, మహబూబ్‌నగర్ జిల్లాలో 172 కేసులు నమోదయ్యాయి. ఇకపోతే సెకండ్ డోస్ టీకా కోసం రిజిస్టేష్రన్ చేసుకున్న కొందరికి మీ రిజిస్టేష్రన్ రద్దు అయింది. తిరిగి రిజిస్టేష్రన్ చేసుకోండి అంటూ మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో రిజిస్టేష్రన్ చేయించుకున్న వారు ఆందోళన చెందుతున్నారు.
ఈ మేరకు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పలువురికి ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయి. ఒకసారి రిజిస్టేష్రన్ కోసం ఎంతో సమయం పడుతోందని, తీరా రిజిస్టేష్రన్ చేస్తే ఇలా మెసేజ్ రావడం ఏంటని అంటున్నారు. కొందరు ఇంటర్నెట్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలకు వెళ్లి మరీ రిజిస్టేష్రన్ చేయించుకోగా, రిజిస్టేష్రన్ రద్దు కావడంతో అయోమయానికి గురవుతున్నారు.