Take a fresh look at your lifestyle.

త్వరలో మరో 50వేల సర్కార్‌ ‌కొలువులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్షా 34 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టిందనీ, త్వరలోనే మరో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. అదే విధంగా జిల్లాలో పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే అభ్యర్థులకు రాష్ట్రంలోని సబ్జెక్టు నిపుణులతో రెండు నెలలపాటు తరగతులు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఎస్‌డిఎఫ్‌,  ‌గ్రంధాలయ సంస్థ నిధులు మొత్తం కలిపి 3 కోట్ల 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అధునాతన జిల్లా కేంద్ర గ్రంధాలయ సంస్థ భవనంను మంత్రి హరీష్‌రావు సోమవారం ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయ సంస్థ భవనంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ‌లక్కిరెడ్డి ప్రభాకర్‌ ‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…జిల్లాలోని ఉద్యోగార్థులు జిల్లా కేంద్ర గ్రంథాలయం అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పోటీ పరీక్షల్లో సఫలీకృతులు కావాలని మంత్రి కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్‌లలో ఖాళీలను చేజిక్కించుకునేందుకు కూడా జిల్లా కేంద్ర గ్రంథాలయం ఓ చక్కని వేదికలా ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. కేంద్ర గ్రంథాలయం పైన ఉద్యోగార్థుల సౌకర్యార్థం డైనింగ్‌ ‌హాల్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ‌సూచించారు. విజ్ఞానజ్యోతుల వెలుగులో సమాజ భవిష్యత్తుకు పసిడి బాటలు పరిచేవి గ్రంథాలయాలేననీ హరీష్‌ ‌రావు అన్నారు. సిద్దిపేట ప్రజల పాఠకుల సౌకర్యార్థం అన్ని వసతులు, హంగులతో కొత్త జిల్లా కేంద్ర గ్రంధాలయం భవనం ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. అన్ని వయస్సుల పాఠకుల, అభిరుచికి అనుగుణంగా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అదే విధంగా పుస్తకాలను అందుబాటులో ఉంచామన్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ ‌దినపత్రికలను జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచుతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే జిల్లా ఉద్యోగార్థుల కోసం 40 మంది కెపాసిటీ గల ప్రత్యేక రీడింగ్‌ ‌రూము ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో దినపత్రికలు, జర్నల్స్, ‌మ్యాగజైన్స్ ‌చదివేందుకు వీలుగా వేగవంతమైన ఇంటర్నెట్‌తో కూడిన డిజిటల్‌ ‌లైబ్రరీ ప్రత్యేకంగా జిల్లా కేంద్ర గ్రంధాలయంలో అంతర్భాగంగా ఏర్పాటు చేశామన్నారు.. దీనిని జాతీయ డిజిటల్‌ ‌లైబ్రరీతో అనుసంధానం చేశామన్నారు. ఉద్యోగార్థులు జిల్లా కేంద్ర గ్రంథాలయం సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షలలో సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. అన్ని వయసులు, వర్గాల ప్రజలకు గ్రంధాలయాలు విజ్ఞాన సముపార్జనకు నిలయాలన్నా•రు.  వృద్ధుల నుంచి చిన్నారుల వరకు గ్రంథాలయానికి వచ్చి తమ అభిరుచులకు అనుగుణంగా జ్ఞానసముపార్జన చేసుకోవాలన్నారు. డిజిటల్‌లీలకరణ నేపథ్యంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ‌ఫోన్లు వ్యసనంగా మారాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా పిల్లలు డిజిటల్‌ ఉపకరణాలకు దూరంగా ఉంచేలా తల్లిదండ్రులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. అమెరికాలో మాదిరి పిల్లల్లో పుస్తక పఠనం పెంపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. రానున్న రోజుల్లో పాఠకుల అభిరుచి, ఆలోచనలు,సూచనలు, సలహాలకు అనుగుణంగా జిల్లా కేంద్ర గ్రంధాలయంను మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. కవులు కళాకారులు, రచయితలు,మహిళలు జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని తమ వృత్తి నైపుణ్యం పెంపుదల తో పాటు, జ్ఞానసముపార్జన పెంపొందించుకోవాలని మంత్రి కోరారు. సిద్దిపేట జిల్లాకు పేరుప్రఖ్యాతలు, వన్నెతెచ్చిన కవికోకిల బిరుదాంకితులు వేముగంటి నరసింహాచార్యులు పేరును పెడుతున్నట్లు ప్రజల కరతాళధ్వనుల మధ్య  మంత్రి హరీష్‌ ‌రావు ప్రకటించారు. నతన జిల్లా కేంద్ర గ్రంథాలయం ప్రారంభించినప్పటికీ పాత లైబ్రరీనీ కొనసాగిస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. శాసనమండలి సభ్యుడు ఫారూక్‌ ‌హుస్సేన్‌ ‌మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా, సిద్దిపేట పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు శ్రమిస్తున్నారని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం వినూత్న స్కీమ్‌లతో ప్రజల ఆదరాభిమానాలను మంత్రి చూరగొన్నారని ఆయన తెలిపారు. జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేలి రోజా రాధాకృష్ణశర్మ  మాట్లాడుతూ.. విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు చక్కటి వేదికలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సై•తం అనేక పుస్తకాలు అధ్యయనం చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రంను దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపారని ఆమె తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేరణతో జిల్లా ప్రజలు పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్‌  ‌వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ…జిల్లా కేంద్ర గ్రంథాలయం భవనం, స్థల ఎంపిక నుంచి, నిధుల విడుదల, సకాలంలో భవనం పూర్తి చేసే వరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ప్రత్యేక చొరవ,సంపూర్ణ సహకారం మరువలేనిదన్నారు. నిర్మాణంకు ముందే అన్ని వయసుల పాఠకులకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు, ముఖ్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు పూర్తి సమాచారం అందుబాటులో ఉంచేందుకు డిజిటల్‌ ‌లైబ్రరీ ప్రత్యేక ఏర్పాటుకు  మంత్రి హరీష్‌ ‌రావు సమావేశం నిర్వహించి తమకు దిశా నిర్దేశం చేశారని తెలిపారు. ఆన్‌లైన్‌ ‌విధానంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఆన్‌లైన్‌ ‌తరగతులు నిర్వహించే సౌకర్యాన్ని కూడా మంత్రి కల్పించారని తెలిపారు.  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌  ‌ప్రభాకర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు గ్రంథాలను నిర్లక్ష్యం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గ్రంధాలయాల పూర్వ వైభవంకు కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి  తన్నీరు హరీష్‌ ‌రావు ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాకేంద్ర గ్రంధాలయాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు పాఠకులకు చేరువ చేసేందుకు జిల్లా పాలక వర్గం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి,  మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌కడవేర్గు రాజనర్సు, సుడా ఛైర్మన్‌ ‌మారెడ్డి రవీందర్‌రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ఎండుతున్న పంటలకు ఊతం..ఇమాంబాద్‌ ‌బతుకమ్మ చెరువులోకి గోదావరి నీళ్లు  
రోజు రోజుకు పెరుగుతున్న ఎండలతో ఇమాంబాద్‌లోని వరి పంటలు ఎండిపోతున్నాయని, బతుకమ్మ కుంటలో నీరుంటేనే పంటలు గట్టెక్కుతాయని గ్రామ రైతులు మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లి మొర పెట్టుకున్నారు. వెంటనే స్పందించిన మంత్రి హరీష్‌రావు…మోటారు ఎత్తిపోతల ద్వారా నీటిని కాలువ నుంచి విడుదల చేయిస్తానని ఇమాంబాద్‌ ‌ప్రజలకు మాట ఇచ్చారు. ఈ మేరకు ఇచ్చిన మాట ప్రకారం మోటారు ద్వారా బతుకమ్మ చెరువుకు నీళ్లు అందించే కార్యక్రమాన్ని సోమవారం ఎంపి కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డితో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు రంగనాయకసాగర్‌ ‌నుంచి మల్లన్నసాగర్‌ ‌వెళ్లే కాళేశ్వర జలాలను మంత్రి హరీష్‌రావు విడుదల చేసి గోదావరి జలాలను ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ ‌రవీందర్‌ ‌రెడ్డి, మునిసిపల్‌ ‌కోఅప్షన్‌ ‌సభ్యుడు రాజయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply