- తెలుగు రాష్ట్రాల సిఎంలకు ఆహ్వానాలు అందచేత
- ఇరు రాష్ట్రాల సిఎంలు కలుసుకునే ఛాన్స్‌పై ఊహాగానాలు
విశాఖపట్టణం, జనవరి 21 : విశాఖ వేదికగా సిఎం జగన్, తెలంగాణ సిఎం కెసిఆర్ భేటీ కాబోతున్నా రన్న ప్రచారం సాగుతుంది. విశాఖలోని శారదాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎం జగన్‌కి ఆహ్వానం అందింది. దీంతో ఈ నెల 28న జగన్ శారదాపీఠంకి వెళ్లనున్నారని సమాచారం. రాజశ్యామల యాగంలో కూడా జగన్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇదే యాగానికి తెలంగగాణ సిఎం కెసిఆర్ కూడా వస్తారన్న ప్రచారం ఉంది. ఇరు రాష్టాల్ర సిఎంలకు ఆహ్వానం అందించారని తెలుస్తోంది. 2019 ఎన్నికలకు ముందు జగన్ ఈ యాగం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి రావడంతో.. పలుమార్లు శారదాపీఠానికి వెళ్లి స్వామి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. అయితే.. జగన్‌కి ఈ యాగం చేయమని సలహా ఇచ్చింది కేసీఆరే అని అప్పట్లో వార్తలు వచ్చాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరవాత తెలంగాణ సిఎం కెసిఆర్‌తో చర్చలు జరిపారు. వీరిద్దరూ కలిసి.. వివిధ అంశాలపై చర్చలు జరిపారు. కానీ.. ఆ తర్వాత కృష్ణా జలాలు, పోతిరెడ్డిపాడు వివాదాలతో కేసీఆర్-జగన్ మధ్య దూరం పెరిగినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీళ్లిద్దరు మళ్లీ కలిసి కనిపించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే తెలుగు రాష్టాల్ర ముఖ్యమంత్రులు విశాఖలో భేటీ కాబోతున్నారని ఇక్కడ ప్రచారం సాగుతోంది. శారదాపీఠం ఆహ్వానం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కూడా అందిందని బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే.. కేసీఆర్ ఏ రోజు విశాఖ వస్తారన్న దానిపై స్పష్టత లేదు. కానీ.. తప్పకుండా ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారని.. స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని సమాచారం.
విశాఖ రానున్న కేసీఆర్‌కు జగన్ స్వాగతం పలుకుతారా.. లేదంటే వ్యక్తిగత పర్యటనగా భావిస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. కేసీఆర్, జగన్ భేటీ అయితే రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరువురి మధ్య రాజకీయంగా పరస్పర అవగాహన ఉందని ఇప్పటికీ ప్రచారం జరుగుతోంది. జగన్‌కు మేలు చేయడానికే కేసీఆర్ ఏపీలో బీఆర్‌ఎస్ శాఖను ప్రారంభించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాపు సామాజికవర్గం ఓట్లను చీల్చి.. వైసీపీకి మేలు చేయాలని ప్లాన్ చేసినట్టు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే రోజు విశాఖకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.