Take a fresh look at your lifestyle.

ఇదీ మీ ‘పోగ్రోమ్ ..’

” కరోనా కట్టడి పేరుతో లాక్ డౌన్ ప్రకటించి, చాప కింద నీరు లాగా మీరు చేస్తున్నదేమంటే, జనవరి ఫిబ్రవరి నెలల్లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముందుకు వచ్చిన సమూహాల మీద తీవ్ర నిర్బందాలని, అరెస్టులను అమలు చేస్తున్నారు. భారత రాజ్యాంగం మీద, అది కల్పించిన ప్రజాస్వామ్య హక్కులు, బాధ్యతల మీద విశ్వాసం వున్న ప్రజలు మీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా వ్యతిరేక చట్టాలనూ విధానాలని ప్రశ్నిస్తున్నందుకూ మీరు ఇస్తున్న కానుక అరెస్టులు! తీవ్ర నిర్బంధం! ప్రశ్నించడం అనేది ఈదేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని మేము సహించము అంటున్నారు మీరు! ఈ దేశ బహుళత్వాన్ని గుర్తించి, గౌరవించి అన్ని సమూహాల హక్కుల ప్రశ్నిస్తున్న విద్యార్థినీ విద్యార్థులూ, స్త్రీలూ యువతుల మీద, మైనారిటీ సమూహాల మీదా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ‘ఉపా’ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. గర్భిణీలను కూడా అరెస్టు చేసి జైళ్ళల్లో పెడుతున్నారు..”

k sajayaమే 31తో అధికారికంగా లాక్ డౌన్ ముగియబోతోంది. కానీ, మనసులో ఎక్కడో భయం కూడా నడుస్తోంది. లాక్ డౌన్ పొడిగించమని హోంమంత్రి అమిత్ షా కు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పారనీ, ప్రధానమంత్రి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారనే వార్త కూడా పత్రికల్లో వచ్చింది. బహుశా ఈ వ్యాసం ప్రచురణ అయ్యి బయటకు వచ్చే సమయానికి లాక్ డౌన్ పొడిగింపు వార్త (పొడిగిస్తే?) పాతదై పోవచ్చు. బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా దేశప్రజలను ఉద్దేశించి ఒక లేఖ(ప్రేమలేఖ అనుకోవాలి మనం!!!) రాస్తూ, కరోనా కట్టడిలో ప్రపంచానికే మనం స్ఫూర్తి నిచ్చామనే అ(బ)ద్దాన్ని ‘ఆత్మనిర్భరం’తో ప్రధాని మోడీ ప్రజలకు ప్రకటిస్తున్నారు. పనిలో పనిగా 2014-2019 మధ్య మనదేశ ప్రతిష్ట ఎంతో గొప్పగా పెరిగిపోయిందని కూడా తన లేఖలో పేర్కొన్నారు. కనీసం ఈ లేఖలోనయినా ఇంకా రహదారుల మీద వందల మైళ్ళు నడుస్తూ రక్తమోడ్చే వలస కార్మికుల వెతల గురించి మాట్లాడతారేమో అనుకుంటే, ‘ఆ ఒక్కటి అడక్కు’ అన్నట్లు గిన్నెల తప్పట్ల నుంచీ హెలిఖాఫ్టర్ల నుంచీ పూలు జల్లేవరకూ తన్మయంతో చెబుతూ వెళ్లారు. తూ తూ మంత్రం గా అందరూ ఎన్నో కష్టాలు పడ్డారు, ఐక్యంగా ముందుకు సాగుతున్నారు అనడమే తప్పించి వాటి పరిష్కారాలకి తీసుకునే నిర్దిష్ట చర్యలేమిటి అనే అంశంలో ఎక్కడా స్పష్టత లేదు.

ప్రధానమంత్రి గారూ, మీరు ప్రకటించినట్లుగానే, 2014-2019 మధ్యకాలంలో భారతదేశంలో జరిగిన అప్రజాస్వామిక పరిణామాలను ప్రపంచమంతా వీక్షిస్తోంది. నిజంగానే, మీరు అధికారంలోకి రావటం ప్రజాస్వామ్య చరిత్రలోనే సువర్ణాధ్యాయమైతే గనుక, హేతుబద్ధతతో ప్రశ్నిస్తున్న పన్సారే, దభోల్కర్, సాహిత్యకారుడు కల్బుర్బి, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ ల హత్యలు జరిగివుండేవి కాదు. విభిన్న సంస్కృతుల కలయిక అయిన మనదేశంలో సామాన్య ప్రజల ఆహార అలవాట్ల మీద క్రూరమైన దాడి జరిగేది కాదు. మతం పేరుతో అణగారిన దళిత, ఆదివాసీ వర్గాల మీద దౌర్జన్యానికి, మూక హత్యలకు దిగేది కాదు. ప్రశ్నలను ప్రోత్సహించాల్సిన విశ్వవిద్యాలయాల్లో అధికారం సాక్షిగా వెలివాడలు వచ్చివుండేవి కాదు, అణగారిన దళిత విద్యార్థుల (ఆత్మ)హత్యలు ఉండేవి కాదు. మైనారిటీ విద్యార్థుల అపహరణలు ఉండేవి కాదు. నా కొడుకు ఆచూకీ ఎక్కడ అని నజీబ్ తల్లి, మాపిల్లల చావుకి బాధ్యులెవరు అని రోహిత్ వేముల, పాయల్ తాద్విల తల్లులు ఇంకా ఇంకా అడగాల్సిన పరిస్థితి ఎందుకు వుంది? మీ పాలన సువర్ణాధ్యాయమైతే ఎనిమిదేళ్ల చిన్నారి మీద అత్యాచారం చేసి చంపిన వారికి మద్దతుగా మీ పార్టీ ప్రజాప్రతినిధులే ఎందుకు ఊరేగింపులు చేస్తారు? సిగ్గుపడి తలదించుకోవాల్సిన అంశం కదా? అంతెందుకు, మీపార్టీ ప్రజాప్రతినిధులు ఎంతమంది మీద అత్యాచార ఆరోపణలు వున్నాయో లెక్క తీద్దామా? అలాగే, పనిలో పనిగా అన్ని రాజకీయ పార్టీల లెక్కలు కూడా తీద్దాం!.

ప్రజాస్వామ్య స్ఫూర్తి వుండుంటే, నల్లధనాన్ని అరికట్టే పేరుతో ఏకపక్షంగా నోట్ల రద్దును చేయగలిగేవారా? రాత్రికి రాత్రి దేశ ప్రజలందర్నీ రోడ్డు మీదకు లాగి వారి జీవితాల్ని చిన్నాభిన్నం చేయలేదా? పారదర్శకత పేరుతో మీరు తీసుకువచ్చిన జిఎస్టి ఎవరి ప్రయోజనాల కోసం? దేశ సమగ్రత, సమైక్యతా స్ఫూర్తి అంటూ దాదాపు సంవత్సర కాలంగా కాశ్మీర్ ప్రజలను నిరంతర లాక్ డౌన్ లో వుంచడం ఏ ప్రజాస్వామ్య స్పూర్తికి చిహ్నం? మీరు రాజకీయ ఉ(దురు)ద్దేశం తో పౌరసత్వ చట్టానికి మార్పులు చేయటంతో దేశమంతా వెల్లువై ఎగసిన నిరసనలని, చుక్కానిగా నిలబడిన ఢిల్లీ షహీన్బాఘ్ మహిళలను ప్రపంచమంతా చూస్తూనే వుంది. ఆ తర్వాత మీ కనుసన్నల్లో నడిచిన మారణకాండ ‘ప్రోగ్రోం’ని అంతర్జాతీయ సమాజం గమనిస్తూనే వుంది. మీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల పట్ల విమర్శనాత్మకంగా వున్నారనే కదా అణగారిన సమూహాల హక్కుల కోసం నిరంతరం ప్రజాఉద్యమాలతో మమేకమయిన రచయితలూ, కవులూ, లాయర్లు, అధ్యాపకులను గత సంవత్సరంన్నర కాలంగా జైళ్లలో నిర్బంధించి బెయిలు కూడా ఇవ్వకుండా సమస్యలను సృష్టిస్తున్నది! వారు ఎనభై సంవత్సరాల వ్రుద్దులైనా, శారీరిక వికలాంగులైనా, వయసుతో వచ్చే శారీరిక సమస్యలతో బాధపడే స్త్రీలైనా సరే మీకు పట్టదనే కదా మీరు చెప్పదలచుకుంది! కరోనా పాండమిక్ సమయంలో ఇతర దేశాలన్నీ సామాన్య ఖైదీలతో సహా అందర్నీ విడుదల చేస్తుంటే మీరు రాజకీయ కక్షతో ఇక్కడ బెయిలు కూడా ఇవ్వకుండా సతాయించటం లేదా? వారి ప్రాణాలను ప్రమాదం లోకి తోయడంలేదా? ఎవరూ గమనించటం లేదనుకున్నారా! ఇదా మీరు వక్కాణిస్తున్న ప్రజాస్వామ్య సువర్ణాధ్యాయం? అడగండి అంతర్జాతీయ సమాజాన్ని, ఏం చెబుతారో?.

ఇవన్నీ ఒక ఎత్తయితే, కరోనా వైరస్ పేరుతో మీరు అత్యుత్సాహంతో అమలుపరుస్తూ వచ్చిన లాక్ డౌన్ విధానాల వల్ల ఎంతమంది రోడ్ల మీద, రైలు పట్టాల మీద, రైల్వే ఫ్లాట్ ఫారాల మీద చనిపోయారో మీకు కనీసం లెక్క తెలుసా? మీరు 2020లో ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీలో కనీసం ఈ చనిపోయినవారికన్నా ఏమన్నా ఎక్ష్ గ్రేషియా ఉందా? బతికిఉన్నవారికే దిక్కులేదు, ఇంకా మీరు గుర్తించని చావులకు ఆశించడం మాదే బుద్ధి తక్కువ అవుతుంది! మొత్తుకోగా మొత్తుకోగా మొత్తానికి శ్రామిక రైళ్ల నిర్వహణలో మొత్తం రాష్ట్రాల బాధ్యతే గానీ మీ కేంద్రం నుంచీ నిధులు లేవనే విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు చనిపోయినవారి బాధ్యత కూడా ఆయా రాష్ట్రాలదే అవుతుందేమో మరి! నడుస్తున్న వలస కార్మికుల బాధ, కష్టం చూడలేక ప్రజలు మతాల కతీతంగా ముందుకు వచ్చి సహాయం అందిస్తుంటే మీ అభిమాన సంఘాలవారు, అది కూడా మీ చలవే అని డప్పేసుకుంటున్నారు. నిజంగా కరోనా కట్టడిలో మన దేశం ప్రపంచ దేశాలకు స్పూర్తిగా వుంటే రెండు నెలల లాక్ డౌన్ తర్వాత వైరస్ బారినపడే వారి సంఖ్య తగ్గాలి కానీ, ఇంకా ఎందుకు పెరుగుతున్నట్టు? అంటే మీ ‘ఆత్మ నిర్భరం’ ఉపయోగపడదనేగా దాని అర్థం!.

ఇప్పటికీ వందలాదిమంది వలస కార్మికులు తమ ఇళ్ళకు జేరటానికి రోజుల తరబడీ తిండీ తిప్పలు లేకుండా రోడ్ల మీద ఎందుకు నడుస్తున్నారు? ‘బిల్కుల్ ఘర్ మే రహేగా’ అంటూ తిప్పి తిప్పి చెప్పిందే చెప్పిన మీరు వాళ్ళని వారి ఇళ్ళకు చేర్చే బాధ్యతను ఎందుకు మర్చిపోయారు? ఎర్రటి ఎండలో కనీసం చెప్పులు కూడా లేకుండా రోడ్డున పడి నడుస్తున్న ప్రతిఒక్కరూ చెబుతున్నది ఒకటే, వారితో ఇన్నాళ్ళూ వెట్టి చాకిరీ చేయించుకున్న యజమానులు వారికి జీతం ఇవ్వలేదు, తిండీ తిప్పలు చూడలేదు, వాళ్ళని ఊళ్లకు చేర్చే బాధ్యత తీసుకోలేదు. మరి, ఈ యజమానులందరి మీదా ఏం చర్య తీసుకోబోతున్నారు? తల్లి చనిపోయిందో లేదో కూడా తెలుసుకునే ఊహ కూడా లేని ఆ పసివాడు ‘మా అమ్మ ఎందుకు చచ్చిపోయింది’ అని మిమ్మల్ని భవిష్యత్తు లో ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు? ‘అలసిపోయి నిద్రపోయిన మా మీద నుంచీ రైలు వెళ్లి మమ్మల్ని చంపేసింది. ఇదేనా ఈ దేశ స్ఫూర్తి?’ అని ఆ కార్మికులు ఎవర్ని ప్రస్నించాలి? ‘ఆత్మనిర్భరమంటే రోడ్డు మీద ప్రసవించి వెంటనే 150 కిలోమీటర్లు నడవటమా?’ అని ఆ తల్లి అడిగితే మీదగ్గర ఏం సమాధానం వుంది? బహుశా వీరిద్దరూ మీ దృష్టిలో భారతమాతలు కాదు? అందుకే, ఇలాంటివారి గురించి మీ దగ్గర ఏమీ సమాధానం వుండదు. మీ ‘వందేభారత్ మిషన్’లో వీరికి స్థానం వుండదు.

మరో ముఖ్యమైన విషయమేమంటే, కరోనా కట్టడి పేరుతో లాక్ డౌన్ ప్రకటించి, చాప కింద నీరు లాగా మీరు చేస్తున్నదేమంటే, జనవరి ఫిబ్రవరి నెలల్లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముందుకు వచ్చిన సమూహాల మీద తీవ్ర నిర్బందాలని, అరెస్టులను అమలు చేస్తున్నారు. భారత రాజ్యాంగం మీద, అది కల్పించిన ప్రజాస్వామ్య హక్కులు, బాధ్యతల మీద విశ్వాసం వున్న ప్రజలు మీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా వ్యతిరేక చట్టాలనూ విధానాలని ప్రశ్నిస్తున్నందుకూ మీరు ఇస్తున్న కానుక అరెస్టులు! తీవ్ర నిర్బంధం! ప్రశ్నించడం అనేది ఈదేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని మేము సహించము అంటున్నారు మీరు! ఈ దేశ బహుళత్వాన్ని గుర్తించి, గౌరవించి అన్ని సమూహాల హక్కుల ప్రశ్నిస్తున్న విద్యార్థినీ విద్యార్థులూ, స్త్రీలూ యువతుల మీద, మైనారిటీ సమూహాల మీదా నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ‘ఉపా’ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. గర్భిణీలను కూడా అరెస్టు చేసి జైళ్ళల్లో పెడుతున్నారు. ఇదేనా, మీరు నొక్కి నొక్కి వక్కాణిస్తున్న ‘ప్రజాస్వామ్య సువర్ణాధ్యాయం’? దేశ రాజధానిలో మతపరమైన విధ్వంస కాండకు ఆజ్యం పోసిన అసలు నేరస్థులను(మీ పార్టీ వారనేగా!?)వదిలివేసి, ప్రజలపక్షాన నిలబడ్డవారి మీద మీరు చూపిస్తున్న నిర్బంధం, చేస్తున్న అరెస్టులూ ఏవైతే వున్నాయో వాటిని ఈ దేశ, అంతర్జాతీయ పౌర సమాజం చూడటం లేదనుకుంటున్నారా!?.

Leave a Reply