Take a fresh look at your lifestyle.

జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రకటించండి

*-టీయూడబ్ల్యుజె
నేడు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్  నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ లో జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె) ప్రకటన విడుదల చేసింది.ప్రకటనలో.. “ఇప్పటివరకు జరిగిన ప్రెస్ మీట్ లలో వివిధ వర్గాల సంక్షేమాన్ని ప్రకటించిన సీఎం.. జర్నలిస్టుల సంక్షేమంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం అత్యవసర సేవలందిస్తున్న మీడియా లోకాన్ని మనస్థాపానికి గురిచేసింది. రాష్ట్రంలో అసలే వివిధ సమస్యలతో ఆందోళన చెందుతున్న జర్నలిస్టులకు కరోనా విపత్తు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. కనీసం తమ కుటుంబాల ఆకలి తీర్చలేని దీనస్థితిని జర్నలిస్టులు అనుభవిస్తున్నారు. మరోవైపు లాక్ డౌన్ మూలంగా మీడియా సంక్షోభాన్ని ఎదుర్కొంటుండ డంతో జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కరువైపోయింది. కొన్ని మీడియా సంస్థలు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడం, మరికొన్ని సంస్థలు అక్రమంగా ఉద్యోగాల నుండి తొలగించడం వంటి పరిణామాలు చోటుచేసు కున్నాయి. ఈ పరిస్థితులను సీఎం కేసీఆర్ గారు మానవతా దృక్ఫథంతో అర్థం చేసుకొని మీడియా రంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించే చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. అలాగే జర్నలిస్టులను ఆదుకునే దిశలో కనీసం నేటి ప్రెస్ మీట్ లో నైనా సీఎం సానుకూల ప్రకటన చేస్తారని ఆశిస్తున్నాం. జర్నలిస్టుల కష్టాలను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని మేము రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయా జిల్లాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అలాగే మా విన్నపాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా, మెయిల్ ద్వారా పంపించామని  రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ
ప్రకటన లో పేర్కొన్నారు.

Leave a Reply