Take a fresh look at your lifestyle.

అన్నదాతల ఆక్రందనలకు… 28రోజులు

దేశానికి వెన్నెముక అని గొప్పగా చెప్పుకునే అన్నదాతలు గత ఇరవై ఎనిమిది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతంలో చేస్తున్న ఆక్రందనలకు పరిష్కారమే )భించడం లేదు. తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్న ధోరణిలో చట్టాలన్ని చేశాం ఎట్టి పరిస్థితిలో వాటిని మార్చేదిలేదని ఒక పక్క కేంద్రం భీష్మించుకుని కూర్చుంది. మరో పక్క ఆరునూరైనా ఈ చట్టాలను ఎత్తివేయాల్సిందేనంటూ రైతాంగం వణికిస్తున్న చలిలోకూడా ఒక మెట్టు దిగేదిలేదంటోంది. భారత దేశ జనభాలో నూటికి డెబ్బై శాతం మంది గ్రామీణ ప్రాంతంలో నివసించేవారే. వీరందరి ప్రధాన వృత్తి వ్యవసాయమే. ఎద్దేడిసిన వ్యవసాయం దేశానికి అరిష్టంగా చెబుతారు. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న వారితో చర్చలు జరిపే విషయంలో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్న తీరు యావత్‌ ‌దేశ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నది. అయిదారు దఫాలుగా చర్చలు జరుపుతున్న కేంద్రం రైతాంగానికి కనీస హామీని ఇవ్వలేకపోతోందనడానికి అక్కడ పెరుగుతున్న రైతుల సంఖ్యనే నిదర్శనం. ముసలి, చిన్న పెద్ద అన్న తారతమ్యం లేకుండా లక్షల సంఖ్యలో రైతులు వణికిస్తున్న చలిని కూడా లెక్క చేయకుండా రోడ్ల మీద వేసుకున్న గుడారాల్లో దాదాపు నెల రోజులుగా నివసిస్తూ తమ ఆక్రందనను తెలియజేస్తుంటే కేంద్రం ఎందుకింత నిర్ధయగా వ్యవహరిస్తున్నదన్న ప్రశ్న ఉత్పన్న మవుతోంది.

ఈ పట్టుదలల కారణంగా నిష్కారణంగా దాదాపు నలభై మంది రైతులు మృత్యువాత పడడం విచారకరం. వ్యవసాయరంగంలో నూతన సంస్కరణలకు తెరదీసిన కేంద్రం ఈ చట్టాలను రూపొందించడానికి ముందే విస్తారంగా చర్చలు జరుపాల్సి ఉండింది. కాని, చట్ట సభల్లో తనకున్న బలాన్ని వినియోగించుకుని అధికార బిజెపి అర్డినెన్స్ ‌ద్వారా చట్టాన్ని తీసుకువొచ్చింది. సెప్టెంబర్‌ 14‌న లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పటి నుండీ రైతాంగం దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంది. టిఆర్‌ఎస్‌తో పాటు శివసేన, ఆమా ఆద్మీ, సమాజ్‌వాది, బిఎస్పీ లాంటి పార్టీలు బిల్లుకు వ్యతిరేకంగా వోటువేసి తమ నిరసనను వ్యక్తం చేశాయి కూడా. కాంగ్రెస్‌ ‌మొదటి నుండీ దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంది. రైతులు చేస్తున్న ఆందోళనకు మద్ధతిస్తూ రాహుల్‌గాంధీ నాయకత్వంలో పలువురు కాంగ్రెస్‌ ‌నాయకులు గురువారం రాష్ట్రపతిని కలిసి ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు కూడా. అంతేకాకుండా ఈ బిల్లు పట్ల రైతులు ఎలా వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని తెలిపే విధంగా దేశ వ్యాప్తంగా రెండు కోట్ల మంది రైతుల సంతకాలను ఆ పార్టీ సేకరించి రాష్ట్రపతికి అందజేసింది. రాహుల్‌తో పాటు, ప్రియాంక గాంధీ మరికొందరు నేతలు ర్యాలీలు నిర్వహించి రైతులకు తమ మద్ధతును తెలుపుతున్నారు. ఇటు కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు.

కేరళ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రులు బాహాటంగానే రైతులకు మద్దతుగా నిలిచారు. అధికారంలో ఉండే ఏ ప్రభుత్వమైన తమ పాలనాతీరుకు నిదర్శనంగా కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టడం సహజం. అయితే వ్యవసాయమే ప్రధానంగా ఉండే భారతదేశంలో ఆ రంగంలో చేపడుతున్న సంస్కరణల విషయమై ముందస్తుగా చర్చలు జరుపకపోవడమే ఈ ఆందోళనకు కారణంగా మారింది. కనీసం రాష్ట్ర ప్రభుత్వ నేతలతోనైనా దీనిపై విచారణ చేయలేదన్న అపవాదు కేంద్రంపై ఉంది. ఈ చట్టంలో పొందుపర్చిన అంశాలు వినడానికి రైతాంగానికి మేలు చేసేవిగానే కనిపించినా, పరోక్షంగా రైతులకు నష్టాన్ని కలిగించేవిగా ఉన్నాయంటున్నారు రైతు నాయకులు. ఇప్పటివరకు తాము పండించిన పంటను ఏదో ధరకు అమ్ముకోవడం కన్నా, ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడ అమ్ముకునే అవకాశం ఈ చట్టం కలిగిస్తున్నదని చెబుతున్నప్పటికీ, దీనివల్ల ఇప్పుడున్న మార్కెటింగ్‌ ‌వ్యవస్థ కుప్పకూలి, కార్పొరేట్‌ ‌వ్యవస్థ వేళ్ళూనుకునే ప్రమాదం కలుగుతుందంటున్నారు రైతు నాయకులు, కొంతమంది విశ్లేషకులు. ఫలితంగా చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంటుందన్నది వారి వాదన.

- Advertisement -

కొంతకాలానికి సమీప మార్కెట్‌లు మూతపడితే చిన్నకారు రైతు తన పంట దిగుబడిని ఎక్కడికి పట్టుకుని పోతాడన్నది ప్రశ్న. అలాగే మార్కెటింగ్‌ ‌విషయంలో ముందస్తుగానే కొనుగోలుదారులతో ఒప్పందం చేసుకోవొచ్చన్న దాని విషయం కూడా అనుకున్నంత సులభమేమీకాదన్న వాదన ఉంది. కార్పొరేట్‌ ‌లేదా కొనుగోలుదారు సూచనమేరకు పంటరకం వేయాల్సి ఉంటుందని, అది ఒక విధంగా పరోక్షంగా భూమిమీద పెత్తనానికి దారితీస్తుందన్నది రైతుల వాదన. ఇప్పుడు దలారీలతో రైతులకు ఎలాంటి తలనొప్పి ఉందో అంతకన్నా ఎక్కువగా కార్పొరేట్‌ ‌సంస్థలతో ఏర్పడే అవకాశముంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ , ఎవరిపైనా గానీ న్యాయ స్థానాన్ని ఆశ్రయించే అవకాశం లేకుండ చట్టం చేయడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .ప్రకృతి వైపరీత్యాలతో ఏర్పడే ఇబ్బందుల విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలే సరైన రీతిలో రైతులకు న్యాయం చేయలేక పోతున్నాయి. కార్పొరేట్‌ ‌వ్యవస్థ కొనుగోలుదారుగా మారినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినట్లుగా రైతులు అడుగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు వారు చెప్పిందే వేదం. నాణ్యతలో ఏమాత్రం తేడా కనిపించినా రైతు నెత్తిన గుడ్డ వేసుకోవాల్సిందేనంటున్నారు రైతు నాయకులు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి, ఈ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేనని, అందుకు తమ ఆందోళనకు ప్రజలంతా సహకరించాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

మండువ రవీందర్‌రావు

Leave a Reply