Take a fresh look at your lifestyle.

జంతువుల హక్కులను పరిరక్షించాలి

నేడు…ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం

మానవులకు పెంపుడు జంతువులు ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. కొద్దిపాటి ప్రేమాభిమానాలకు, సంరక్షణకే  పెంపుడు జంతువులు ప్రేమను, విశ్వాసాన్నీ కలిగి ఉంటాయి. పెంచే వారినే సర్వస్వంగా భావిస్తాయి. అవి మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలుగజేస్తు, కుటుంబంలో సభ్యులుగా మారి  చేదోడువాదోడుగా నిలుస్తున్నాయి.ఒక రకంగా వ్యాయామాన్ని, ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తున్నాయి.

భారత రాజ్యాంగపు 21వ అధికరణం వ్యక్తిగత స్వేచ్చ, జీవన హక్కులను ధృవపరుస్తున్నది. భారత పౌరులకు జంతువులను పెంచి పోషించే హక్కును ఈ అధికరణం దృవపరుస్తున్నది.జంతువులపట్ల జాలి, పరితాపములను చూపాలని భారత రాజ్యాంగం 51 ఎ అధికరణం పౌరుల ప్రాధమిక బాధ్యతలను నిర్వచిస్తున్నది.

కుక్క, పిల్లి, చేపలు, పక్షులు – ఏవైనా మనం పెంచే మూగజీవాలను ప్రేమగా చూసుకోవాలి. వాటికి అధికంగా స్వేచ్చ కల్పించాలి. విశాలమయిన  తిరుగాడే సౌకర్యాన్ని కలిగించాలి.  పెంపకంలో జాగ్రత్తలు తీసుకుని, వాటిని సంతోషంగా ఉంచుతూ మచ్చిక చేసుకోవాలి.పెంపుడు జంతువుల నివాస, తిరుగాడే స్థలాలను, ఉపయోగించే వస్తువులను శుభ్రపరచాలి. వాటిని కూడా  పరిశుభ్రంగా ఉంచుకోవాలి.జంతువులకు ముందు జాగ్రత్తగా టీకామందులు వేయించడం, నిర్లక్ష్యం వహించక, క్రమం తప్పకుండా వాటిని పశు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళడం విధిగా చేయాలి.జంతువుల పట్ల ప్రేమ, ముద్దు మురిపాలు పరిమితులు దాటరాదు. కానీ వాటితో మూతులు, ముక్కులు నాకించుకోవడం, అస్తమానం అంటిపెట్టుకుని ఉండడం మంచిది కాదు. కొన్నిచోట్ల పెంపుడు జంతువుల పట్ల ఎలా మసలు కోవాలనే అంశంపై ప్రత్యేకంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే…మాంసం కోసం, వినోదం కోసం కొందరు అనేక రకాలుగా జంతువులకు కష్ట నష్టాలు కలిగిస్తున్నారు. తమ వృత్తులకు, అవసరాలకు జంతు వులను ఉపయోగించు కుంటూ వాటిని హింసిస్తున్నారు. ఆవు, మేక, గేదె మొదలైన జంతువులు ఎక్కువ పాలు ఇవ్వడం కోసం, అలాగే కొన్నింటిని పోటీల్లో గెలుపు కోసం రసాయనాల ఇంజెక్షన్లు ఇస్తూ వానిని హింసిస్తున్నారు. జంతు సంక్షేమానికి సంబంధించి 1960లో పార్లమెంటులో చట్టం రూపొందింది. ఈ చట్టం ప్రకారం జంతువులను ఉద్దేశ్యపూర్వకంగా గానీ, నిర్లక్ష్యంగా గానీ బంధించినా, ఇబ్బంది కలిగించినా శిక్షార్హులు అవుతారు. 1960 డిసెంబర్‌ 26 ‌నుంచి ఈ చట్టం అమలులో ఉంది.భారత పార్లమెంటు రూపొందించిన జంతువుల పట్ల క్రూరత్వం నివారణ చట్టం సెక్షన్‌ 11 (1) ‌నుండి (ఓ), ప్రకారం జంతువులను వేటాడటం, స్వాధీనం లేదా పట్టుకోవడం, ఏ జంతువునైనా అవయవమును తొలగించడం లేదా చంపడంవంటి అనేక ఇతర క్రూర చర్యలకు బాధ్యులైన వారిని చట్టం ద్వారా శిక్షిసారు. జంతు రవాణాలో అనవసర హింసకు పాల్పడే వారికి, జంతువులను కిక్కిరిసినట్టుగా వాహనాల్లో నింపేవారికి, జంతువుల కాళ్ళు కట్టేసి వాహనాలపై తీసుకువెళ్ళే వారికి రూ 100 లేదా మూడు నెలల కారాగార శిక్ష లేదా రెండు శిక్షలూ కలిపి విధించవచ్చు. భారత శిక్షా స్మృతి సెక్షను 428 మరియు 429 కింద జంతువులను భయపెట్టడం గాయ పరచడం చట్టవిరుధ్ధం. జంతువులను లేదా జంతు సంరక్షకులను భయ కంపితులను చేయడాన్ని 1860 భారత శిక్షాస్మృతి సెక్షన్‌ 503 ‌ప్రకారం తెలిసి లేదా స్ఫృహతో చేస్తున్న నేరంగా పరిగణిస్తారు. ఇటువంటి వారిని ఎటువంటి వారంటు లేకుండా అదుపులోకి తీసుకోవచ్చు.

జంతుసంపదను పరిరక్షించడం, వాటిని వృద్ధి చేయడంతోపాటు జంతువుల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. మానవ మనుగడకు అనివార్యమైన పలు ప్రాయోజితాలైన జంతు సంపదను పరిరక్షించడం, వృధ్ధిచేయడం, మానవీయ కోణంలో చూడడం,  తగిన స్వేచ్ఛ కల్పించడం అందరి బాధ్యత. జంతువులపట్ల మరింత మానవీయంగా ప్రవర్తించడం, ఈ స్ఫూర్తిని భావితరాలకు తెలియ జేయడం అవసరం, అనివార్యం.
– రామ కిష్టయ్య సంగన భట్ల, 9450595494

Leave a Reply