Take a fresh look at your lifestyle.

‘‌ప్రజామోదం’ తరువాతనే రాజధాని..!

capital issue, amaravathi, telugudesam partyఅమరావతి రాజధానిగా అక్రమాలకు పాల్పడిందని గత తెలుగుదేశం ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ వొస్తున్న వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభుత్వం ఆధారాలతో నిరూపించి, ప్రజల్లో ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేసే ప్రయత్నంగానే కావాలని రాజధాని విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నదన్న ప్రచారం జరుగుతున్నది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నప్పటినుండీ వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌రెడ్డి అమరావతి రాజధానిపై పెద్దగా ఆసక్తిని కనబర్చలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినతర్వాతకూడా త్వరతగతిన రాజధాని నిర్మాణం జరుగాలన్న ఆసక్తినికూడా ఆయన చూపించలేదు. రాజధాని నిర్మాణంకోసం బడ్జెట్‌లో నిధులనుకూడా పెద్దగా కేటాయించక పోవడానికికూడా అదేకారణంగా చెబుతున్నారు. తాజాగా ఆ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఆయన తన మనసులో మాటనుకూడా బహిర్గతం చేయడంతో ఇప్పుడా రాష్ట్రప్రజల్లో గందరగోళం చోటుచేసుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానులు వస్తాయేమో అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రం అట్టుడికి పోతున్నది.

ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పులు, ఛీత్కారాలు, ఆవేశ ప్రసంగాలతో జనం మధ్య తీవ్ర విబేధాలు ఏర్పడ్డాయి. రాష్ట్రం మూడు ప్రాంతాలుగా ఏర్పడి, ఎవరికివారు తమ ప్రాంతానికి రాజధాని రావాలన్న అభిలాషను వ్యక్తం చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని నిర్మాణంచేయడం సిఎం జగన్‌కు ఇష్టంలేదన్న విషయం ఆయన ప్రకటనద్వారా, ఆయన మంత్రివర్గం చేస్తున్న ప్రకటనలద్వారా ఎలాగూ స్పష్టమవుతోంది. అయితే దేనికైన ఓ ప్రాతిపదిక కావాలి కాబట్టి జిఎస్‌రావు కమిటి నివేదికను ఆధారం చేసుకోవాలని వైఎస్‌ఆర్‌ ‌పార్టీ ప్రభుత్వం భావించింది. తన ఆలోచనలకు అనుకూలంగా జిఎస్‌రావు కమిటి ఇచ్చిన నివేదికను బహిర్ఘతం చేయడంతో అమరావతి ప్రాంతమంతా అట్టుడికిపోయింది. అక్కడి మంటలు ఇప్పట్లో చల్లారేట్లు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో ఆలోచనచేసింది. బోస్టన్‌ ‌కన్‌సల్టెన్సీ గ్రూప్‌ను కూడా రాజధానిపై నివేదికను తయారు చేయాల్సిందిగా కోరింది.

అదికూడా ప్రైవేటు కంపెనీయే కాబట్టి ఎలాంటి నివేదిక ఇస్తుందో తెలియందికాదు. ఆ నివేదికకూడా ప్రభుత్వ ఆలోచనకు అనుకూలంగా ఉంటుందికాబట్టి తమకు జరిగే న్యాయం ఏమీ ఉండదని అమరావతి రైతులంటున్నారు. ఏదిఏమైనా బోస్టన్‌ ‌కంపెనీ ఇచ్చే నివేదిక తర్వాతే నిర్ణయం తీసుకోవటం జరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నా ఈ విషయంలో మరికొంత జాప్యం జరిగే అవకాశాలులేకపోలేదు. ఎందుకంటే తాజాగా శుక్రవారం జరిగిన ఏపి క్యాబినెట్‌ ‌సమావేశానంతరం మంత్రి పేరినేని నాని మీడియాతో చెప్పిన మాటలు అదే విషయాన్ని చెబుతున్నాయి. దాన్నిబట్టి ఇప్పుడప్పుడే రాజధానిపై ఏపి ప్రభుత్వం ప్రకటించే అవకాశంలేదు. బోస్టన్‌ ‌కన్‌సల్టెన్సీ గ్రూప్‌ ‌తన నివేదికను సమర్పించేందుకు ఎంతలేదన్నా మరో పదిహేను రోజులు పట్టవచ్చని స్వయంగా మంత్రే చెప్పారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత, గతంలో జిఎస్‌రావు కమిటి ఇచ్చిన నివేదికను కలిపి మరో హై పవర్‌ ‌కమిటి సమీక్షించాల్సి ఉంటుంది.

- Advertisement -

ఈ హైపవర్‌ ‌కమిటీ అన్నది ఇంకా ఏర్పాటు కావాల్సిఉంది. ఉద్యోగులు, మంత్రులు, ఐఏఎస్‌ అధికారులతో కూడిన ఈ హైపవర్‌ ‌కమిటి దీనిపై సమీక్షించేందుకు మరికొంత సమయం పడుతుంది. ఈలోగా ఎలాగూ ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. ఈ మూడు కమిటీల నివేదికల వివరాలను అసెంబ్లీలో సభ్యుల ముందుంచుతారు. దీనితో ప్రజలకు, ప్రతిపక్షాలకు చెప్పినట్లు అవుతుంది. అలాగే ఎలాగూ సభలో అధికార పార్టీ బలంగా ఉంటుంది కాబట్టి ఆ పార్టీ భావించినదగ్గరే రాజధాని ఏర్పాటు ప్రకటన వెలువడుతుందన్నది సుప్పష్టం.. రాజధాని విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మొదటి నుండీ ఆరోపిస్తున్న వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ఆమేరకు ఫిబ్రవరిలో జరిగే శాసనసభ సమావేశాలనాటికి రుజువులను సేకరించేపనిలో పడిందంటున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో గత టిడిపి నాయకత్వం ఇన్‌సైడ్‌ ‌ట్రేడింగ్‌కు పాల్పడిందన్నది వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌చేస్తున్న ప్రధాన ఆరోపణ.

ఈ విషయంలోనే గత శాసనసభ సమావేశాల్లోనే టిడిపి నాయకుల పేర్లు, ఎవరెవరు ఎంతెంత భూమిని ఇక్కడ కొనుగోలు చేశారన్న పెద్ద జాబితానే ప్రకటించిన విషయం తెలిసిందే. భవన నిర్మాణంలోకూడా కాంట్రాక్టర్లకు ఇచ్చే విషయంలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ, ఇలాంటి మరికొన్ని ఆరోపణలపై ఆధారాలను సేకరించి, టిడిపిని దోషిగా నిలబెట్టేందుకే రాజధాని ప్రకటనపై వైఎస్‌ఆర్‌ ‌ప్రభుత్వం కావాలని జాప్యంచేస్తున్నదన్నది పరిశీలకుల భావన. ఇవన్ని సాకుగా చూపించి అవినీతికి తావులేకుండా, పక్షపాతంలేకుండా, అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి పర్చేందుకే తాము మూడు రాజధానుల ప్రకటన చేశామన్న అంశాన్ని ముందుకు తీసుకువచ్చి, ప్రజలతో ఆమోద ముద్రవేయించుకునే ప్రయత్నంలో జగన్‌ ‌సర్కార్‌ ఉం‌దని స్పష్టమవుతుంది.

Tags: capital issue, amaravathi, telugudesam party, ysrcp party

Leave a Reply