- సరికొత్త చర్చకు దారితీసిన ఫలితాలు
- ఆంధ్ర ప్రజలకు అధికంగా నివసించే ప్రాంతాల్లో కారు జోరు
- తెలంగాణవాదుల ప్రాంతాలలో కమలం గాలి
నువ్వా నేనా అనే విధంగా సాగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఆత్మ గౌరవ నినాదంతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసికి రెండోసారి జరిగిన ఎన్నికలలో మహా నగర వోటర్లు వినూత్న తీర్పు ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలలో…రాజధాని హైదరాబాద్‌లో స్థిరపడ్డ తెలంగాణ వాదులు అధికార టీఆర్ఎస్ పార్టీకి దూరమవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు. శుక్రవారం వెలువడ్డ జీహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డ తెలంగాణవాదులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో కమలం గాలి వీచింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలలో హైదరాబాద్ సమీప జిల్లాలైన నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలకు చెందిన లక్షలాది మంది ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఈ ప్రజలంతా జీహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఎల్బీనగర్, సరూర్‌నగర్, ఆర్కేపురం డివిజన్లలో ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోనూ బీజేపీ అభ్యర్థులు క్లీన్‌స్వీప్ చేశారు.
ఎల్బీనగర్, హయత్‌నగర్, వహస్తినాపురం, చంపాపేట, మన్సూరాబాద్, సరూర్‌నగర్, గడ్డి అన్నారం, చైతన్యపురి, నాగోలు, హబ్సిగూడ, అడిక్‌మెట్, రాంనగర్, రామంతాపూర్, ఆర్కేపురం, లింగోజిగూడ, డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. జీహెచ్ఎంసి ఎన్నికల సమయంలో ఈ ప్రాంతాలలో బీజేపీ అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహించిన ఆ పార్టీ జాతీయ నేతలు అమిత్ షా, జేపి నడ్డా నిర్వహించిన రోడ్‌షోలకు ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే, ఈ నేతలు పర్యటించిన ప్రాంతాలలో బీజేపీకి వచ్చిన అనూమ్య స్పందనను చూసి ఆ పార్టీ కొన్ని స్థానాలలో గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, ఆ అంచనాలకు భిన్నంగా దాదాపు 14 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఫలితాలు అధికార పార్టీకి షాక్‌ను గురి చేశాయి. తెలంగాణ వాదులు అధిక సంఖ్యలో నివసించే ఈ ప్రాంతాలలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి చవిచూడటం ఆ పార్టీకి మింగుడు పడని అంశమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో ఈ ప్రాంతాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్న తెలంగాణవాదులంతా అప్పటి ఉద్యమ నేత కేసీఆర్‌కు వెన్నంటి నిలిచారు. ఈ ప్రాంతాల వోటర్లంతా ప్రస్తుత సీఎం కేసీఆర్‌కు బాసటగా నిలవాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా బీజేపీ వైపు మొగ్గు చూపారు. జీహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల సందర్భంగా తలెత్తిన ఈ పరిణామంపై ఇప్పటికే సర్వత్రా చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా, ఈ ఎన్నికలలో హైదరాబాద్ నగరంలోని ఆంధ్ర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో నివసించే ప్రజలు అధికార టీఆర్ఎస్కు బాసటగా నిలవడం ఆశ్చర్యకర పరిణామం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలో ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ ఉద్యమానికి అంతగా సహకరించలేదు. ఆంధ్ర ప్రాంత ప్రజలు భారీ సంఖ్యలో నివసించే ప్రాంతాలైన జూబ్లీహిల్స్, కూకట్పల్లి, ఖైరతాబాద్, అమీర్‌పేట, సంజీవరెడ్డినగర్, బాలానగర్, జగద్గిరిగుట్ట, గాజులరామారం ప్రాంతాలలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. ముఖ్యంగా కూకట్పల్లి సర్కిల్లో టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. సర్కిల్ పరిధిలోని 6 డివిజన్లనుఆ పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. ఓల్డ్ బోయిన్పల్లి, బాలానగర్, కూకట్పల్లి, వివేకానందనగర్, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ వోట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో జీహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న సరికొత్త రాజకీయ పరిణామం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎటువంటి మార్పులకు శ్రీకారం చుడుతుందోన్నది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న.