పత్రికను పునరుద్ధరించాలని టీయూడబ్ల్యుజె డిమాండ్
ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్: ఏడాది కాలంగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ఆంధ్రభూమి దినపత్రిక ఉద్యోగులు ఇప్పుడు పత్రికను పూర్తిగా మూసి వేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించడంతో రోడ్డున పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని టీయూడబ్ల్యుజె నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పత్రికను పునరుద్ధరించి జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం తమ న్యాయమైన సమస్యలను తీర్చడంలో యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఆంధ్రభూమి దినపత్రిక ఉద్యోగులు టీయూడబ్ల్యుజె ఆధ్వర్యంలో మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.
కోవిడ్ సాకుతో ఆంధ్రభూమి యాజమాన్యం ఏడాది కాలంగా ప్రచురణ నిలిపివేయడంతో పాటు ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదనీ, రిటైర్డ్, కాంట్రాక్టు ఉద్యోగులకు దక్కాల్సిన ప్రయోజనాలను యాజమాన్యం విస్మరిస్తున్నదని ఉద్యోగులు వాపోయారు. పత్రికను పునరుద్ధరించి రెండు తెలుగు రాష్ట్రాలలో దానిని నమ్ముకుని జీవిస్తున్న వేలాది కుటుంబాలకు న్యాయం చేయాలని టీయూడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, రాష్ట్ర నాయకులు ఎ.రాజేష్, కె.రాములు, ఆంధ్రభూమి ఉద్యోగుల సంఘం కన్వీనర్ వెల్జాల చంద్రశేఖర్, నాయకులు విజయప్రసాద్, జెఎస్ఎం మూర్తి, కొండవీటి రవి, స్వామినాథన్, మధుకర్ డిమాండ్ చేశారు. కాగా, ఉద్యోగుల న్యాయమైన పిటిషన్పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సర్ జస్టిస్ చంద్రయ్య స్పందించారనీ, ఆంధ్రభూమి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు టీయూడబ్ల్యుజె నేతలు తెలిపారు.