తెలంగాణరాష్ట్రంలో తెలంగాణేతరులు నాయకత్వం వహిస్తే, తెలంగాణ పోరాటానికి అర్థమేముందన్నది ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలను ఆలోచింపజేస్తున్నది. గత ఒకటిన్నర దశాబ్ధకాలంగా అనేక పోరాటాలుచేసి, ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న ప్రత్యేకరాష్ట్రానికి తెలంగాణేతరులు పాలకులైతే అర్థంలేకుండా పోతుందన్న ఆవేదన అందరిలో ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్ షర్మిల నాయకత్వంలో తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతున్నదన్న వార్త అటు రాజకీయ వర్గాల్లో, ఇటు తెలంగాణ ప్రజానీకంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. షర్మిల పెట్టబోయే పార్టీ ఇక్కడ అధికారంలోకి వొస్తుందా, రాదా అన్నది వేరే విషయం. రాష్ట్రంలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేయడమంటేనే వోట్లు సీట్లు సాధించి అధికారం వైపు అడుగులు వేయడానికే అన్నది తెలియంది కాదు. ఈ రాజకీయ పార్టీ అరంగెట్రంతో మరోసారి తెలంగాణ ప్రజల మధ్య విభేదాలకు దారితీస్తుందేమోనన్న భయాన్ని పలువురు వ్యక్త పరుస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ప్రస్తుత ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణలో కూడా తమపార్టీని కొనసాగించే ఆలోచన చేశాడు.
షర్మిల నాయకత్వంలో తెలంగాణలో పార్టీ నిర్వహించేందుకు పావులు కదిపారు. తాను జగనన్న విడిచిన బాణాన్ని అని చెప్పుకుంటూ తెలంగాణ నగరాలను షర్మిల చుట్టుముట్టిన విషయం తెలియంది కాదు. అయితే కెసిఆర్, జగన్ మధ్య ఏర్పడిన స్నేహబంధం కారణంగా అది కొనసాగలేదు. ఏపిలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా అదేవిషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహరించుకోవాలన్నదే ఏపి సిఎం జగన్ ఆలోచనగా చెబుతున్నారు. అయితే తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టకూడదన్న చర్చమాత్రం గత కొంతకాలంగా ఆ పార్టీలో నలుగుతోందన్న వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇక్కడ పార్టీ పెట్టాలని షర్మిల నిర్ణయించుకున్నట్లుందన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాలు నర్మగర్భంగా చెబుతున్న మాట. జగన్‌ను కాదని పక్కరాష్ట్రంలో చెల్లెలు పార్టీ ఏర్పాటు చేసేంత సాహసం చేస్తుందా? అలా అయితే ఇద్దరి మధ్య విబేధాలేమైనా ఉన్నాయా అంటే అలాంటిదేమీ లేదనంటున్నాయి ఆ వర్గాలు. అలాంటప్పుడు షర్మిల స్వయం నిర్ణయం తీసుకోగల శక్తి ఉందా? ఇంకా దీనివెనుక ఏమైన శక్తులున్నాయా అన్నది తేలాల్సిఉంది. షర్మిల ఏపిలో రాజకీయంగా ఎదిగే అవకాశాలు లేవని, ఎంపి గా అవకాశాలిస్తానని జగన్ నిరాశపర్చాడన్నది మరో ప్రచారం.
బంధువులకు ప్రాధాన్యత నిస్తున్నాడన్న ఆరోపణలకు రాకూడదనే చెల్లెలుకు పదవులు కట్టబెట్టడంలేదన్న వాదనకూడా వినిపిస్తున్నది. ఏది ఏమైనా ప్రస్తుతం తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో మరో కొత్త పార్టీ అరంగెట్రం చేయడం ఎవరికి లాభం, ఎవరికి నష్టమన్నది కూడా ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. తెలంగాణ రాష్ట్రాన్ని తామే ఏర్పాటు చేశామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు ఇక్కడ కొడగడుతోంది. ఆ పార్టీలోని మేటి నాయకత్వమంతా తమ ఉనికిని కాపాడుకునేందుకు, తలోదారి చూసుకోవడంతో ఆ పార్టీ ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఒక వెలుగువెలిగిన టిడిపికి కూడా ఇక్కడ స్థానంలేకుండా పోయింది. ఈ రెండు పార్టీల్లోని అసంతృప్తి నాయకులు ఎటూ వెళ్ళలేక, ఎదగలేక పోతున్నవారితోపాటు, ఇప్పటికీ రాజశేఖర్‌రెడ్డి అభిమానులను ఆకర్షించడం ద్వారా తమ పార్టీని విస్తరించుకోవచ్చన్న ఆలోచనతోనే షర్మిల పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు షర్మిల నిజంగానే జగనన్న విడిచిన బాణమేనా? ఇంకెవరైనా దీనివెనుక ఉన్నారా అన్నది తేలాల్సిఉంది.
ఏదిఏమైనా షర్మిల పార్టీ నిర్మాణం చేస్తున్నదన్న వార్త మాత్రం ప్రధానంగా తెలంగాణ రాజకీయ పార్టీల్లో తుఫాన్‌గా మారిందనడం మాత్రం నిజం. సహజంగా కొత్తగా రాజకీయ పార్టీ రూపుదిద్దుకుంటుందంటే చూద్దాం అనే రాజకీయ వర్గాల్లో ఒక్కసారే ప్రశాంతత చెదిరినట్లైంది. అందుకే పార్టీలన్నీ ఒకరిపై ఒకరు విరుచుకు పడుతున్నారు. పార్టీ ఏర్పాటు విషయంలో షర్మిల స్పష్టత ఇవ్వకున్నా, గత రెండు రోజులగా మీడియాతో ఆమె మాట్లాడుతున్న తీరుమాత్రం పార్టీ ఏర్పాటు తధ్యమన్నది స్పష్టమవుతున్నది. ముఖ్యంగా పాలక పార్టీ అయిన టిఆర్ఎస్ పైన ఆమె అప్పుడే బాణం ఎక్కుపెట్టినట్లు కనిపిస్తున్నది. తెలంగాణలో ఏ వర్గాలు ప్రశాంతంగా లేవంటూ తన విమర్శనాస్త్రాన్ని సంధించింది.. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కనుసన్నల్లోనే షర్మిల కొత్తపార్టీ ఉద్బవిస్తోందంటున్న కాంగ్రెస్ ఎంపి రేవంత్‌రెడ్డి ఆరోపణలను ఆమె ఆరోపణలు కొట్టిపారేసీవిగా ఉన్నాయి. అలాగే తెలంగాణపై కనీస పరిజ్ఞానంలేని వారు ఇక్కడికి వొచ్చి, ఇక్కడి రైతుపై మొసలి కన్నీరు కార్వడమేందని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు లాంటివారు ప్రశ్నిస్తున్నారు.. విచిత్రమేమంటే ఈ విషయంలో కెసిఆర్ కూడా స్పందించకుండా ఉండలేకపోవడం.. ఆమె పార్టీ పెట్టే విషయంలో టిఆర్ఎస్ ప్రమేయంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో ఇప్పటికి ఎన్నో కొత్త పార్టీలు వొచ్చాయి, పోయాయి, పార్టీ పెట్టడమంటే పాన్‌డబ్బా పెట్టటంకాదన్న కెసిఆర్ మాటలు కూడా దీనివెనుక టిఆర్ఎస్ హస్తమేదీ లేదన్న విషయాన్ని స్పష్టంచేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని మరింత భూస్థాపితం చేసే కుట్రలో భాగమే ఈ పార్టీ ఏర్పాటని, అందుకు టిఆర్ఎస్, బిజెపి పార్టీల కుట్ర ఉందంటున్నారు కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి, టిఆర్ఎస్ వ్యతిరేక వోటు కాంగ్రెస్‌కు రాకుండా చేయడానికే ఈ కుట్ర అన్నది ఆయన ఆరోపణ. ఇంకా పార్టీ ఆవిర్భావం కాకముందే రాజకీయ పార్టీలన్నీ ఇలా ఎవరికి వారు విమర్శలకు దిగుతున్నారంటే.., ఆ పార్టీల్లో ఆందోళన ఏ మేరకుందన్నది స్పష్టమవుతోంది.