- నేతాజీ జయంతి సందర్భంగా మోదీ నిర్ణయం
- ఘనంగా నివాళి అర్పించిన ప్రధాని
న్యూదిల్లీ,జనవరి23 : పరాక్రమ్ దివస్ సందర్భంగా అండమాన్, నికోబార్‌లోని 21 పెద్ద దీవులకు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పేరు పెట్టారు. పరమవీర చక్ర విజేతలుగా పిలువబడే ఈ ద్వీపాలకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహితల పేర్లను నామకరణం చేశారు. ఏటా జనవరి 23న నేతాజీ జయంతిని పురస్కరించుకొని, పరాక్రమ్ దివస్‌గా నిర్వహిస్తూ నివాళులర్పిస్తోన్న కేంద్రం.. ఈ సారి అండమాన్, నికోబార్ లలోని పేరు లేని అతిపెద్ద దీవులకు పేర్లు పెట్టేందుకు సంకల్పించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకార్థం.. అండమాన్ -నికోబార్ దీవుల చారిత్రక ప్రాముఖ్యతను పురస్కరించుకుని, ప్రధాన మంత్రి 2018లో ద్వీపాన్ని సందర్శించిన సందర్భంగా రాస్ దీవులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని నామకరణం చేశారు. దేశం కోసం జీవితాన్ని, ప్రాణాన్ని త్యాగం చేసిన రియల్ హీరోస్ కు ప్రధాని మోడీ ఈ విధంగా వారికి నివాళులర్పించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. స్వాతంత్య ్రసమరయోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్‌కు ఘనంగా నివాళులర్పించారు. జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు నివాళులర్పిస్తూ ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ శౌర్యపరాక్రమానికి ఒక కర్మయోగి జీవితకాల భక్తుడు అంటూ సోషల్ డియా మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ వేదికగా మోడీ ఆర్కైవ్స్ ద్వారా విడుదల చేశారు. ఈ వీడియోలో ప్రధాని మోడీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన తనకు మార్గదర్శకుడని దీనిలో వివరించారు. యువతకు మార్గనిర్దేశకుడని.. అందరికి స్ఫూర్తి ప్రదాత అంటూ కొనియాడారు. తనకు రాజకీయ మార్గ దర్శకుడని, రోల్ మోడల్ అంటూ పేర్కొన్నారు. తన జీవితం మొత్తం సుభాస్ చంద్రబోస్ అంకితం అంటూ ప్రధాని మోడీ వివరించారు. యువ కార్యకర్త నాటి నుంచి సుభాస్ చంద్రబోస్‌ని ఎంతలా ఆరాధించేవారో కూడా వివరించారు. ఆకాలంలో డైరీలో రాసిన పలు సూక్తులను చూపించారు. దీంతోపాటు బీజేపీ కార్యకర్తగా.. బీజేపీ జాతీయ కార్యదర్శిగా, గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కార్యక్రమాలను వివరించారు. దీంతోపాటు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాల గురించి తెలియజేశారు.
అలాగే బోస్ కుటుంబసభ్యులను కలిసిన చిత్రాలను చూపించారు. అలాగే సుభాస్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం పరాక్రమ్ దివస్ గా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా చూపించారు. అలాగే కర్తవ్యపథ్ ప్రారంభోత్సవం, తీసుకున్న పలు నిర్ణయాల గురించి దీనిలో స్పష్టంగా వివరించారు. కాగా.. ప్రధాని మోడీ.. చిన్ననాటి నుంచి నేతాజీ సుభాస్ చంద్రబోస్‌ను రోల్ మోడల్ తీసుకోని.. అంచలెంచలుగా రాజకీయాల్లో పైకి ఎదిగారు. అందుకే ఆయన జయంతి సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. దీనిలో భాగంగా నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతిని.. పరాక్రమ్ దివస్‌గా అధికారంగా నిర్వహించాలని 2021లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతిని.. ఏటా జనవరి 23న పరాక్రమ్ దివస్‌గా నిర్వహిస్తూ స్వాతంత్య ్రసమరయోధుడికి నివాళులర్పిస్తోంది. ఈ ఏడాది పరాక్రమ్ దివస్ సందర్భంగా 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను.. అండమాన్ అండ్ నికోబార్ దీవులలోని పేరు లేని అతిపెద్ద 21 దీవులకు వారి పేర్లను పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.