Take a fresh look at your lifestyle.

ఆనందయ్య ఆందోళన

దే శంలో ఇప్పుడు కొరోనా కన్నా  ఆనందయ్య మందు పైనే ఎక్కువ చర్చ జరుగుతున్నది. ఆనందయ్య ఇచ్చేది ఆయుర్వేద మందు కాదు, అది పక్కా నాటు వైద్యమని కొందరంటే, ప్రాచీన కాలం నుండి మనకు సంక్రమించిన వైద్యవిధానమని  మరికొందరి మధ్య నిత్యం వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఏ పత్రికలో చూసినా, టివి ఛానళ్ళలో చూసిన దీనిపై గంటలకు గంటలు డిబేట్‌ ‌నడుస్తున్నది. కొన్ని ఛానళ్లు ఆనందయ్య వైద్యాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తుంటే మరికొన్ని ఛానళ్ళు దాని శాస్త్రీయతను ప్రశ్నిస్తున్నాయి. కేవలం ఛానళ్ళు, పత్రికలకే పరిమితమైతే ఫరవాలేదు. కాని సోషల్‌మీడియాలోకూడా సమర్థించేవారు, విమర్శించేవారంటూ  రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఆధునిక వైద్యులు, సైన్స్ ‌మీద కమాండింగ్‌ ఉన్నవాళ్ళు దీన్ని పాతచింతకాయ పచ్చడిగా పేర్కొంటుండగా, రిటైర్డ్ ఆయుర్వేద వైద్యులు, ఆ రంగంలో పనిచేసే నిపుణులు ఆ మందుకున్న ప్రాధాన్యత ఎత్తి చూపుతున్నారు. ఏది ఏమైనా ఏపిలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లో ఆయుర్వేద వైద్యుడు కాని ఆనందయ్య అనే వ్యక్తి తయారుచేసిన మందు పై విస్తృత ప్రచారం జరుగుతున్నది. ఆయన మందుకోసం హాస్పిటల్స్  ‌ల్లో అవసానదశలో కొట్టుమిట్టాడుతున్న కొరోనా బాధితులు  ఆక్సీజన్‌తో సహా అంబులెన్స్‌లను వేసుకుని ఆనందయ్య మందుకోసం బారులు తీరుతున్నారు. చావు బతుకుల్లో ఉన్న వారి కంట్లో మందు వేసిన పది నుంచి పదిహేను నిమిషాల్లో ఆ రోగి లేచి కూర్చుంటున్నాడంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు. రోజుల తరబడి ప్రభుత్వ హాస్పిటల్స్  ‌ల్లో నానా అవస్థలు పడుతున్నవారు, లక్షలాది రూపాయలు వెచ్చించినా బతుకుతామో లేదో తెలియకుండా రోజులు నెట్టుకొస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్  ‌లో చికిత్స పొందుతున్నావారంతా కృష్ణపట్టణానికి లైన్‌ ‌కడుతున్నారు.

ఇప్పటివరకు అరవై డెబ్బై వేల మంది ఆయన మందు వాడిన వారున్నారు. ఎవరు కూడా తమకీ మందు పడలేదనో, దీనివల్ల తగ్గలేదనో ఫిర్యాదు చేసిన వాళ్ళు లేక పోగా తమకు వెంటనే గుణాన్నిచ్చిందని, గంటలోనే మామూలు మనిషినైనాని వీడియో ద్వారా వారు చెబుతున్న మాటలకు అసలు కొరోనాకే ఇంతవరకు సరైన మందు కనుక్కోలేక పోతున్న ఈ ఆధునిక శాస్త్రీయత కన్నా, పూర్వం రుషులు మనకు ప్రసాదించిన వంటింటి పదార్థాలతో తయారైన మందే శ్రేష్ఠంగా భావిస్తున్న ప్రజలు కేవలం ఏపికి చెందిన వారే కాకుండా తెలంగాణ, మహారాష్ట్రతోపాటు ఇతర సరిహద్దు రాష్ట్రాలవారు కూడా ఇక్కడికి క్యూ కడుతున్నారు. దీంతో అటు అలోపతివారు, ఇటు ప్రాచీనతను వ్యతిరేకించేవారు పనికట్టుకుని  ప్రెస్‌ ‌మీట్లుపెట్టడం, సోషల్‌ ‌మీడియాలో పోస్టింగ్‌లు పెట్టడం, టివి డిబేట్‌ ‌లో విమర్శలు చేయడంతో దీనికిప్పుడు విస్తృత ప్రచారం లభించింది. దానితో అందరి దృష్టి ఆనందయ్య మందు పైనే ఉంది. అమ్మపెట్టదు అడుక్కోనివ్వదన్నట్లు కొరోనా పేషంట్లకు గ్యారెంటీగా చికిత్స అందివ్వకపోగా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తగ్గిస్తానన్న ఆనందయ్య మందును అందుబాటులో లేకుండా చేసిందిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకు ఆనందయ్య మందు అని ఎందుకంటున్నామంటే ఆ మందుకు ఆయన ఇంతవరకు శాస్త్రీయ నామం చెప్పలేదు కనుక. శాస్త్రీయ నామం పెట్టకపోవడానికి కారణం ఆ మందు శాస్త్రీయంగా తయారు చేయలేదని మరికొందరి వాదన.

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కొరోనా ఒకటిన్నర సంవత్సరాలుగా లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంటుంటే చూస్తున్న ఈ శాస్త్రీయత, వంటింటి దినుసులతో ఉచితంగా బతికిస్తానంటే ఎందుకు అనుమతివ్వడంలేదన్నది మరికొందరి వాదన. ఇవ్వాళ దీన్ని వ్యతిరేకిస్తున్నవారు గుండెమీద చెయ్యి వేసుకుని చిన్నప్పుడు కడుపులో నొప్పి లేస్తే వాము నలిపి తినిపించిన అమ్మమ్మలు నానమ్మలు  ఏ శాస్త్ర ప్రమాణాలు పాటించారో చెప్పాలంటున్నారు. వేల సంవత్సరానుండి వస్తుగుణాలను అనుభవించి, ఆచరించి వేద అధ్యయనాల ద్వారా చెప్పినవాటిని పుక్కిట పురాణాలు అని  ఎలా తీసివేస్తారంటున్నారు వాటిని ఆమూలాగ్రం చదివినవారు. ఆ కాలంలో ల్యాబ్‌లు లేకపోవడంవల్ల వాటిని శాస్త్రీయంగా చూపలేదని ఇవ్వాళ కొట్టిపారేయడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు. పోనీ ఆలోపతి మందులే సరైనవైతే లక్షలాదిమంది ఎందుకు మృత్యువాత పడుతున్నారో చెప్పాలని వారు నిలదీస్తున్నారు.  ఇవ్వాల్టికి డయాబెటిస్‌ ‌పేషంట్లను మెంతిపొడి తినమంటున్నారు అలోపతి వైద్యులు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతి మనకు ప్రసాదించిన ప్రతీ వస్తువులో మనిషికి మేలుచేసే ఏదో సుగుణం ఉంటూనే ఉంది అలాంటప్పుడు ఉచితంగా మేలు చేసే వైద్యాన్ని నిలిపివేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పరిశోధన పేరున మందుపంపిణీ జరుగకుండా నిలిపివేయడంతో లక్షలాది మంది ఈ మందు కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. పద్దెనిమిది వనమూలికల తో తయారు చేసిన  ఈ మందు లో ఎలాంటి హానికర పదార్ధాలేవీ లేవని ఆయుష్‌శాఖ తేల్చేసింది. విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ, ఎస్వీ ఆయుర్వేద కళాశాల సంయుక్తంగా చేసిన పరిశోధనలో హానికర వస్తువులేవీ లేవంటూనే జంతువులపై పరిశోధన చేయాలంటున్నారు. చివరకు తమకు ఈ వైద్యమే కావాలని కొందరు కోర్టుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా ఏదో వంకతో ఆనందయ్య మందునైతే ఆపేశారు. కాగా ఆయన్ను అరెస్టు చేశారని కొందరు గగ్గోలు పెడుతుంటే, ఆయనకు భద్రత కల్పిస్తున్నామంటున్నారు పోలీసులు.

ఎలాంటి నిర్భంద మోగాని ఈ నిర్భంద కాలంలో ఆయనతో రహస్యంగా కొందరు పెద్దలు తమ వాళ్ళ కోసం మందు తయారుచేయించుకుంటున్నారని ఆరోపిస్తున్న  ప్రతిపక్షాలు ఈ మందు పెద్దలకేనా, పేదలకు లేదా అంటూ నిలదీస్తున్నాయి.  దానికి తగినట్లుగా తనను మందు ఫార్ములా చెప్పాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారంటూ ఆనందయ్య తరఫు లాయర్‌ ‌కోర్టు దృష్టికి తీసుకువచ్చారంటే ఆ మందు సత్‌ ‌ఫలితాన్నిస్తున్నదని ఆంచనావేసి, దాన్ని వ్యాపారం చేసుకోవాలని కొన్ని శక్తులు చూస్తున్నారంటూ ఆనందయ్య లాయర్‌ ‌కోర్టుకు వివరించిన తీరు చూస్తుంటే గతంలో కానుగ చెట్టు ఆకులతో డిజిల్‌ ‌తయారు చేసిన వ్యక్తిని ముప్పు తిప్పలుపెట్టి మూడుచెర్ల నీళ్ళు తాగించి, చివరకు దాన్ని నిరుపయోగ జాబితాలో ఎలాపడేశారో, ఆనందయ్య అసలు డాక్టర్‌ ‌కాదన్నదగ్గరనుండి ఆయన మందుకు శాస్త్రీయత లేదనేందుకు ఎంత సమయంతీసుకోవాలో అంత సమయాన్ని తీసుకుని ఆయన నొక్కేస్తారన్న అనుమానం ఇప్పుడు అందరిలో ఉంది. ఇప్పటికే ఆ మందు వాడిన వారికి పరీక్షలు నిర్వహిస్తే తేలే విషయానికి ఇంత తతంగం అవసరం లేదన్న వాదన కూడా ఒకటుంది.

Leave a Reply