Take a fresh look at your lifestyle.

ఓటమి ఎరుగని ధీరుడు…స్వరాష్ట్రం తెచ్చిన ఉద్యమ యోధుడు

67వ వడిలోకి కేసీఆర్‌..

(ఎ.సత్యనారాయణ రెడ్డి / ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)

ఆసరాతో ఆప్తుడయ్యాడు..
రైతుబంధుతో బంధువయ్యాడు..
రైతు బీమాతో భోజుడయ్యాడు..
కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌తో మేనమామయ్యాడు..
కేసీఆర్‌ ‌కిట్‌తో తాతయ్యాడు..
మిషన్‌ ‌భగీరథ, కాకతీయతో జలాధీశుడయ్యాడు..
నిరంతర విద్యుత్తుతో వెలుగులు వెదజల్లుతున్నాడు..
కాళేశ్వరంతో జలసిరులు కురిపించాడు.
.
స్వరాష్ట్రం తెచ్చాడు.. స్వర్ణకాంతులు వెలిగిస్తున్నాడు..ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర రావు. కేసీఆర్‌గా సుపరిచితం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీ రోల్‌ ‌పోషించిన ఉద్యమనేత. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన యోధుడు. చావు నొట్లో తలపెట్టి మరీ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అధికార కాంగ్రెస్‌ ‌పార్టీని ఒప్పించి, ప్రతిపక్షాలను మెప్పించి.. తెలంగాణ ప్రజల ఆశ, శ్వాస అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సగర్వంగా సాధించారు. బుధవారం కేసీఆర్‌ ‌జన్మదినం. 67వ వడిలోకి అడుగిడుతోన్న కేసీఆర్‌పై ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దినపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం..
నేపథ్యం..
సిద్ధిపేట జిల్లా చింతమడకలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు కేసీఆర్‌ ‌జన్మించారు. ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో కేసీఆర్‌ ‌కుటుంబం భూమి కోల్పోయి చింతమడకకు వచ్చి కేసీఆర్‌ ‌కుటుంబం స్థిరపడింది. సిద్దిపేటలో గ్రాడ్యుయేషన్‌ ‌పూర్తి చేసి.. ఉస్మానియా వర్సిటీలో ఎంఎ తెలుగు చదివారు. 1969లో శోభతో కేసీఆర్‌ ‌వివాహామైంది. వీరికి ఇద్దరు పిల్లలు కేటీఆర్‌, ‌కవిత.
పోరాటం సాగించి…చావుకు ఎదురెల్లి…
దశాబ్దాల పోరాటం సాగించి.. చావుకు ఎదురెల్లి పోరాడి.. తను కాంక్షించిన రాష్ట్రం సాధించుకుని తాను కలలుగన్న రాష్ట్రాన్ని రూపుదిద్దుతూ బంగారు తెలంగాణ సాధనే ధ్యేయంగా అడుగులు వేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌. 2001‌లో ఒక్కరితో ప్రారంభించిన పోరాటం తెలంగాణ రాష్ట్రంతో అపూర్వ విజయం సాధించి ఇప్పుడు అందరితో కలిసి సాగుతూ ప్రగతి పథంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాడు. రాజకీయాలు వేరు.. పరిపాలన వేరు అని బేధం చూపిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములను చేస్తున్నాడు. కేసీఆర్‌కు పొరుగు రాష్ట్రం ఆంధప్రదేశ్‌ ‌ప్రజల్లో కూడా వీరాభిమానం ఉంది. అది పలుసార్లు నిరూపితమైంది కూడా.

- Advertisement -

ఓటమి ఎరుగని ధీరుడు..
విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో కేసీఆర్‌  ‌యాక్టివ్‌గా ఉండేవారు. కాంగ్రెస్‌ ‌నేత, దివంగత అనంతుల మదన్‌ ‌మోహన్‌ ‌కేసీఆర్‌కు రాజకీయ గురువు. 1970లో కేసీఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌యువజన నేతగా పనిచేశారు. కానీ, 1982లో ఎన్టీఆర్‌ ‌పార్టీ ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్‌ను వీడి టిడిపిలో చేరారు. 1983లో తన రాజకీయ గురువు మదన్‌ ‌మోహన్‌పై పోటీ చేసి గట్టి పోటీనిచ్చారు. కేవలం 877 వోట్లతో ఓడిపోయారు. అలా కేసీఆర్‌ ‌రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1985లో టిడిపి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా పేరు పొందారు. చంద్రశేఖర్‌రావు సిద్ధిపేట నుంచి 1985, 1989, 1994, 1999 ఎన్నికలు, 2001 ఉప ఎన్నికల్లో వరసగా విజయం సాధించారు. 1987లో మంత్రివర్గంలో చోటు దక్కింది.  1997లో కేబినెట్‌ ‌హోదా వరించింది.
1999 నుంచి 2001 వరకు ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఆ కాలంలోనే నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. అనంతరం చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌శాసన సభ ఉప సభాపతిగా పని చేశారు.  1999లో మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు చోటు కల్పించకపోవడంతో కేసీఆర్‌ అసంతృప్తికి గురై… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవులు త్యజించి కొంతమందితో 2001లో టిఆర్‌ఎస్‌ ‌స్థాపించి ఉద్యమబాట పట్టారు. 2001 ఏప్రిల్‌ 27‌వ తేదీన ప్రత్యేక రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌తో కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించారు. 2001లో ఉత్తరాఖండ్‌, ‌జార్ఖండ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రాలు ఏర్పడటంతో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అసాధ్యమేమీ కాదనే అభిప్రాయానికి కేసీఆర్‌ ‌వచ్చారు. అలా ప్రజల్లోకి వెళ్లి ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని తీసుకెళ్లారు. 2001 మే 17వ తేదీన తెలంగాణ సింహగర్జన పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేసి.. రాజకీయ పోరాటం ద్వారా తెలంగాణ సాధిస్తామని ప్రకటించారు. అప్పటి నుంచి ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్‌తో పొత్తు కేంద్రంలో మంత్రిగా కేసీఆర్‌ ‌బాధ్యతలు.. అనంతరం టిడిపి, కమ్యూనిస్టులతో పొత్తు చేసుకుని రాజకీయాల్లో కొనసాగారు. చివరకు గిట్లయితే తెలంగాణ రాదని భావించి 2009 నుంచి ఉద్యమం తీవ్ర రూపం చేశారు. నవంబరు 29న కేసీఆర్‌ ‌తెలంగాణ సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాడు చేపట్టడానికి కరీంనగర్‌ ‌నుండి సిద్ధిపేట దీక్షాస్థలికి బయలుదేరుతుండగా మధ్యలో కరీంనగర్‌ ‌దగ్గరలోని అలుగునూరు వద్ద పొలీసులు అరెస్టుచేసి ఖమ్మం పట్టణానికి తరలించారు.  అదే రోజున పోలీసులు దీక్ష భగ్నం చేసి ఖమ్మం సబ్‌ ‌జైలుకు తరలించారు.  జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించడంతో అక్కడ నుంచి ప్రభుత్వాసుపత్రి, నిమ్స్‌కు కేసీఆర్‌ని తరలించారు. చివరకు ఆమరణ దీక్షకు కూర్చోని తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ ‌సచ్చుడో అనేలా చావు దాక వెళ్లేలా ఆమరణ దీక్ష చేశారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం డిసెంబర్‌ 9 ‌ప్రకటనతో దీక్ష విరమించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఉద్యమాన్ని కేసీఆర్‌ ఉ‌గ్రరూపం దాల్చేలా చేశారు. సమైక్యవాదులు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ కేంద్రం మెడలు వంచి.. అప్పటి హైదరాబాద్‌తో కూడిన 9 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు.
ఉద్యమ నేత నుంచి ముఖ్యమంత్రిగా…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దశాబ్దంన్నరకు పైగా ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, ఆమరణ దీక్ష చేసి ఎట్టకేలకు తెలంగాణను సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావే 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా జూన్‌ 2‌న రాష్ట్ర ఆవిర్భావం నాడే ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చుడుతోనే అద్భుతమైన పరిపాలన నిర్ణయాలు తీసుకుంటూ.. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ కేసీఆర్‌ ‌పేరు ప్రతిష్ఠలు సంపాదించాడు. అనూహ్యమైన రాజకీయ నిర్ణయాలు తీసుకుని అందరి దృష్టిలో పడ్డారు. తన రాజకీయ వ్యూహంతో తెలంగాణలో ఇతర పార్టీలను కోలుకోలేని దెబ్బ తీశాడు. తనదైన నిర్ణయాలతో తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగిరేలా చేశాడు. అనంతరం 2018లో అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి అద్భుతమైన ఫలితాలు సాధించి తిరుగులేని విజయాన్ని కేసీఆర్‌ ‌సృష్టించాడు. రెండో పర్యాయంలోనూ తన పాలనతో దూసుకెళ్తున్నాడు. ఆయన పరిపాలనకు ఫలితాలే రెఫరెండంగా భావిస్తున్నారు. అందుకే స్థానిక పంచాయతీ, మునిసిపల్‌, ‌సహకార సంఘం, జిల్లా పరిషత్‌, ‌జిహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అపూర్వ ఫలితాలు సాధించింది.  బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న అపర భగీరథుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ‘ప్రజాతంత్ర’ తెలంగాణ దిన పత్రిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది.

Leave a Reply