ఆజాంజాహి మిల్ గ్రౌండ్ లో ఇటివల తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హుటాహుటిన అక్కడకు చేరుకుని జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఫైర్ అధికారులు, పోలీస్, విద్యుత్ అధికారులతో చర్చించి వారికి సలహాలు ఇచ్చారు. అర్థరాత్రి వరకూ అక్కడే ఉండి స్థానిక కార్పోరేటర్ సోమిశెట్టి శ్రీలత ప్రవీణ్ తో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించారు. దీంతో మంటలు అదుపులోకి వచ్చి పెద్ద ప్రమాదం తప్పినట్టైందన్నారు.
బిపిసిఎల్‌ను తరలించాలని కేసీఆర్, కేటీఆర్‌లను కోరతా.. : ఎమ్మెల్యే నరేందర్
1981లో అప్పుడున్న పరిస్థితులు, నాడు జన సాంద్రత తక్కువ ఉండటంతో బీపీసీఎల్ ను ఏర్పాటు చేశారు. కానీ నేడు దాని చుట్టూ 50 వేల వరకు జనాభా నివాసం ఉంటారు. బస్టాఫ్, రైల్వే స్టేషన్, వ్యాపార, వాణిజ్య భవన సముదాయలు ఉంటాయి. దురదృష్టవ శాత్తూ ఏదైనా జరగరాని ఘటన జరిగితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రజల విజ్ఞాపన, ప్రజా ప్రతినిధిగా తన ఆలోచన కూడా దాన్ని అక్కడ నుండి తరలించాలనే అని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిల్లా ఇంచార్జ్ మంత్రి సత్యవతి రాథోడ్, ఉన్నతాధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెల్లి బీపీసీఎల్ ను ఇక్కడ నుండి తరలించేందుకు కృషి చేస్తానన్నారు. అందుకు అనుగుణంగా బీపీసీఎల్ అధికారులతో ఈ విషయం చర్చించారు. శుక్రవారం కలెక్టర్, పోలీస్ కమీషనర్ లను కలిసి వారికి సమస్య తీవ్రత వివరిస్తామన్నారు.అంతకు ముందు రాంకీ విల్లాకు చెందిన ప్రముఖులు ఎమ్మెల్యేను కలిసి బీపీసీఎల్ తరలింపుపై వినతి పత్రం అందచేశారు.