Take a fresh look at your lifestyle.

అం‌తరించి పోతున్న మాతృభాష

భలే మంచి భాష పసందైన భాష,తేనె లొలుకు భాష తెలుగు భాష..అమ్మ వంటి భాష.,విన సొంపు భాష మన తెలుగు భాష. ఒక తరంలో నూటికి 33 మంది మాతృభాషను నేర్చుకో నట్లయితే ఆ భాష తర్వాతి తరాల్లో చచ్చిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6000 భాషలు ఉంటే రానున్న కొద్ది సంవత్సరాలలో అందులో సగం అనగా 3000 లకు పైగా అంతరించ బోతున్నాయి,..అని ఐక్యరాజ్య సమితి విస్తృత అధ్యయనం చేసి తేల్చింది. యూనిసెఫ్‌, ‌యునెస్కో, ఇతర ప్రపంచ స్థాయి సంస్థలు మాతృభాషపై తమ పరిశోధనా ఫలితాలను తెలియజేసి, మాతృభాష పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలను గూర్చి అన్ని దేశాలను కోరినప్పటికీ పరభాషా మోజులో పడి మాతృభాషను చిన్న చూపు చూడడం తో అవి అంతరించే దుస్థితి దాపురించింది. మాతృ భాష అనేది ఆది మానవుల జన్యువుల్లో నే రూపుదిద్దుకుంటుంది.మనము తెలియని విషయాలన్నిటినీ కూడా మాతృభాషలోనే నేర్చుకుంటామని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో మాతృభాషకు ప్రాధాన్యం
రష్యా,జపాన్‌, ‌దక్షిణ కొరియా, జర్మనీ లాంటి దేశాలలో మాతృభాషలోనే ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విద్యాభ్యాసం ఉన్నందువలన అక్కడ శాస్త్ర సాంకేతిక పరిశోధనలు అభివృద్ధి చెందాయి. ధనిక దేశాలు మాతృ భాష ప్రాధాన్యత గుర్తించి వారి విద్యా విధానాలు మార్చుకుంటున్నాయి.విలువైన విజ్ఞానం మాతృభాష ద్వారానే అందుతుంది. త్వరలో అమలు కాబోయే నూతన విద్యా విధానంలో మాతృ భాషకు తగిన ప్రాధాన్యత కస్తూరి రంగన్‌ అధ్యక్షతన ఏర్పడిన నూతన విద్యా విధానం కూడా ప్రాథమిక స్థాయిలో మాతృ భాష బోధన జరగాలని సిఫారసు చేసింది. అమ్మ భాషను అంతరించేలా చూడకూడదని, మిగతా భాష లకు ప్రాధాన్యత ఇస్తూనే మాతృ భాష కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వీలైతే పదవ తరగతి వరకు కూడా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని నూతన విద్యా విధానం చైర్మన్‌ ‌కస్తూరి రంగన్‌ ‌తన నివేదికలో తెలిపారు.

వ్యక్తికి గుర్తింపు వచ్చేది మాతృభాష వలననే
ఒక వ్యక్తికి, సమాజానికి గుర్తింపు వచ్చేది మాతృ భాష మరియు సంస్కృతి వలననే.ఇవి రెండు లేనప్పుడు మనుషులు విలువలు కోల్పోతారు. వ్యక్తిత్వాన్ని కోల్పోతారు ప్రాచీన విజ్ఞానాన్ని శాశ్వతంగా దూరం చేసుకుంటారు. ప్రతి సంవత్సరము మాతృ భాషను వదిలి పరభాష చదువుతున్న విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తద్వారా కొద్ది సంవత్సరాల్లోనే మాతృ భాషలు అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రైవేట్‌ ‌పాఠశాలలో దాదాపు వంద శాతం ప్రాథమిక విద్యా బోధన కూడా ఇంగ్లీష్‌ ‌లోనే జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అధికశాతం ఆంగ్ల మాధ్యమంలోనే బోధించ పడుతోంది.

పాలకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మాతృ భాషా సంస్కృతుల ప్రాధాన్యాలు గుర్తిస్తేనే మాతృభాష బతుకు బట్టకట్టుతుంది. సామాన్యుడికి తెలిసిన మాతృభాషలో ప్రభుత్వ వ్యవహారాలు జరిగేలా పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయాలి. దూరదృష్టితో వ్యవహరించి ప్రాథమిక స్థాయి వరకు కనీసం మాతృభాషలో విద్యాబోధన జరిపితే మాత్రమే మాతృభాష జీవిస్తుంది.మాతృ భాష గొప్పది.మాతృభాష ని గౌరవించుధాం.భాష పరిరక్షణ కి నడుం బిగించి కాపాడుకుందాం.
– రావుల రాజేశం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
.తెలంగాణ సామాజిక రచయితల సంఘం
చరవాణి బీ.9848811424.

Leave a Reply