Take a fresh look at your lifestyle.

ఆకర్షణీయమైన “ప్యాకేజీ?”

‘ఇక మరీ విచిత్రం ఏమిటంటే విమానయానం, బొగ్గు  తవ్వకాలు, అంతరిక్ష రంగం వంటి కీలక రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను పెంచుతాం అని కేంద్రం ప్రకటించింది. ఇవి విధానపర నిర్ణయమే కాని, ఆర్ధిక ప్యాకేజీలో భాగం ఎలా అవుతుంది? దీనిలో కేంద్రానికి రూపాయి అయినా ఖర్చు అవుతుందా? పైగా ప్రైవేటు  రంగానికి రహదారి వేస్తారు కనుక ఇంకా ప్రభుత్వానికే అదనంగా నిధులు వస్తాయి. ఏ రకంగా చూసినా కేంద్రం చెప్పిన ప్యాకేజీకి, వాస్తవంగా చేసే ఖర్చు లెక్కపెడితే రెండున్నర లక్షల కోట్ల నుంచి నాలుగు లక్షల కోట్లకు మించి ఈ ఖర్చు ఉండదని ఆర్ధిక వేత్తల చేస్తున్న విశ్లేషణలను బట్టి అర్థమవుతుంది. చెబుతున్నారు. ఇది దేశ జీడీపీలో ఒకటి నుంచి రెండు శాతానికి మించి ఉండదు.’  
Rehanaకరోనా లాక్‌డౌన్‌ వల్ల భారత దేశ ఆర్ధిక వ్యవస్థ స్థంభించింది. మన దేశం ఏమిటి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థే అతలాకుతలం అయ్యింది. తేరుకోవటానికి కనీసం ఏడాది నుంచి రెండేళ్ళు పట్టే అవకాశాలున్నాయి అన్నది అంచనా. పరిశ్రమలు మూతపడటంతో కోట్లాది మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. ఈ సమయంలో ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఆదుకుంటే గాని ఆర్ధిక వ్యవస్థ గాడిన పడదు. ఈ ఆదుకోవటం ఏ రకంగా ఉండాలన్న కసరత్తు కీలకమైంది. రైతులు, వలస కార్మికులు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు, దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ఇలా అనేక వర్గాలకు ప్రభుత్వ చేయూత అవసరం. కోట్లాది మంది ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆలస్యంగా అయినా కేంద్రం 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించింది. ఇది ప్యాకేజా లేక సంస్కరణలా? నిజంగా 20 లక్షల కోట్లు ఆర్ధిక వ్యవస్థలోకి రానున్నాయ లేక అంకెల గారడీనా అన్న చర్చ, విశ్లేషణలు, వాదాలు-ప్రతివాదాలు మొదలయ్యాయి.

ప్రపంచంలో మనమెక్కడ?
కరోనా లాక్‌డౌన్‌ వల్ల కోట్లాది మంది వలస కార్మికులు, చిరు వ్యాపారస్తులు, బడుగు బలహీన వర్గాలు ఉపాధి కోల్పయి ఆకలికి అలమటిస్తున్న సమయంలో కేంద్రం లక్షా 70వేల ఆర్ధిక ప్యాకేజీని మొదటి విడతగా ప్రకటించింది. దీనిలో బడ్జెట్‌లో ప్రకటించిన అంశాలు కూడా కలిపి ఉన్నాయనుకోండి. మొత్తంగా ఇస్తే ఇది దేశ జీడీపీలో కేవలం 0.8 శాతం. బడ్జెట్‌లో చెప్పిన అంశాలు కూడా కలిపారు కనుక. వాటిని తీసేస్తే పర్సెంటేజ్‌ ఇంకాస్త కిందకు 0.5కు చేరుతుంది. దీనితో అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. బాధిత వర్గాల నుంచి డిమాండ్‌ పెరిగింది. దీనితో ఆలస్యంగా అయినా కేంద్రం భారీ ఆకర్షణీయ ప్యాకేజీని ప్రకటించింది. కేంద్ర ప్రకటించిన సుమారు 20 లక్షల 90వేల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ మన జీడీపీలో 10 శాతం. ప్రపంచంలోనే భారీ ప్యాకేజీగా కేంద్రం చెప్పుకున్నా…వాస్తవంగా ప్రపంచంలోని అనేక దేశాలు మన కంటే ముందే తమ దేశ జీడీపీలో పది శాతం, కొన్ని ఇంకా ఎక్కువ ప్యాకేజీలను ప్రకటించాయి. అమెరికా తమ దేశ జీడీపీలో 10 శాతం ప్రకటించింది. సామాజిక భద్రత అంటే చిన్న చూపు చూసే ట్రంప్‌ లాంటి వ్యక్తి కూడా ప్రజలను ఆర్ధికంగా ఆదుకునేందుకు ప్రయత్నం చేశారు. అక్కడి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి వారి బ్యాంక్‌ అకౌంట్లలో డబ్బులు డిపాజిట్‌ చేసింది. ఇక బ్రిటన్ ‌ అయితే తమ దేశ జీడీపీలో 17 శాతాన్ని ఆర్ధిక ప్యాకేజీగా ప్రకటించింది. పైగా ఆర్ధిక సమస్యలతో తమ సిబ్బందిని తొలగించకుండా కంపెనీలకు ఊతం ఇచ్చింది. ప్రైవేటు సంస్థలు తమ సిబ్బందికి ఇచ్చే జీతాల్లో 80 శాతం ప్రభుత్వం భరిస్తుందని కంపెనీలకు భరోసా ఇచ్చింది. దీని వల్ల ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవటానికి సిబ్బందికి జీతాల కోత, తొలగింపులు లేకుండా చేసే ప్రయత్నం చేసింది. (మన దగ్గర ప్రభుత్వాలే ఉద్యోగుల జీతాల్లో కోత పెడుతున్నాయన్నది వేరే విషయం). ఇక జపాన్‌ దేశానికి వస్తే తమ దేశ జీడీపీలో ఏకంగా 20శాతం మొత్తాన్ని ఆర్ధిక ప్యాకేజీగా ప్రకటించింది. దక్షిణ ఆఫ్రిక 10 శాతం , మలేషియా 16 శాతం , సింగపూర్‌ 12 శాతం ప్రకటించాయి. ఇవన్నీ మన కంటే చాలా ముందే ఆర్ధిక ప్యాకేజీలన ప్రకటించి అమల్లోకి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా జీడీపీలో కనీసం 5 నుంచి 6 శాతం అయినా ప్రకటించాలన్న డిమాండ్‌ అన్ని వైపుల నుంచి వచ్చింది. వీటికి సమాధానంగానా అన్నట్లు కేంద్రం జీడీపీలో పదిశాతాన్ని ఆర్ధిక ప్యాకేజీగా ప్రకటించింది. ఇది సంతోషించాల్సిన అంశమే. అయితే అసలు గమ్మత్తు ఈ లెక్కల్లోనే ఉంది.

ప్యాకేజీ లెక్కలు-తిరకాసు:
కేంద్రం ఘనంగా చెప్పుకున్న ఈ ఆర్ధిక ప్యాకేజీ లోతుల్లోకి వెళితే అనేక విషయాలు మనకు అర్థమవుతాయి. ప్యాకేజీ పేరుతో సంస్కరణలు(పాతవి, కొత్తవి), గత బడ్జెట్‌లో చెప్పిన విషయాలు, ఇప్పటికే ఇచ్చిన హామీలు అన్నింటిని గుది గుచ్చింది. సూటిగా చెప్పాలంటే వ్యవస్థకు కావల్సిన అంశాలను కాకుండా ప్రభుత్వం ఆశించినవే ప్రకటించింది. ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టాలి, నిధుల ప్రవాహం పెంచాలి అప్పుడే ఆర్ధిక వ్యవస్థ చక్రం తిరగడం ప్రారంభం అవుతుంది. ఈ ఉద్దీపన లూబ్రికెంట్‌లాగా పని చేస్తుంది. ఈ దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు ఆశాజనకంగా లేవు. ఆశించిన స్థాయిలోనూ లేవు. అసలు కేంద్రం చూపించిన భారీ మూట నుంచి బయటకు తీసేది కూడా నామమాత్రమే. ఈ ప్యాకేజీలో ప్రభుత్వానికి ప్రత్యక్షంగా ఖర్చు అయ్యేది లేదా కేంద్రం ఖర్చు చేసేది కేవలం 10శాతం మాత్రమే అన్నది చాలా మంది ఆర్ధిక వేత్తలు చేసిన విశ్లేషణ. ఈ ప్యాకేజీ ఎంత నిస్సారంగా ఉంది అని చెప్పటానికి ఒక సంకేతం స్టాక్ మార్కెట్ వ్యవహరించిన తీరు. సహజంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు ఆర్ధిక రంగానికి, పారిశ్రామిక రంగానికి ఊతం ఇచ్చేవిగా ఉంటే…దాని ప్రభావం స్టాక్‌ మార్కెట్‌ పై పడుతుంది. గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరుగుతుంది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన స్టాక్‌ మార్కెటలను కూడా కదల్చలేకపోయాయి. అంటే ప్రభుత్వ ప్రకటనలు, చర్యలు మార్కెట్ అంచనాలకు దిగువనే ఉండిపోయాయన్నమాట. కుదేలైన ఆర్ధిక వ్యవస్థకు ఊతం ఇచ్చే చర్యలు కాని, వినియోగం, డిమాండ్లను పెంచే ఆశ గాని కేంద్ర ప్యాకేజీ ఇవ్వలేక పోయిందన్నది స్పష్టం.

ఉపాధి హామికి 45వేల కోట్లు, వలస కార్మికుల కోసం 3,500 కోట్లు వంటివి కొన్ని ప్రత్యక్ష ప్రయోజనం కలిగించేవి మినహాయిస్తే ఎక్కువ శాతం సంస్కరణలకు సంబంధించిన అంశాలు, గత బడ్జెట్‌లో చెప్పిన విషయాలను కూడా ఈ ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం ప్రకటించుకుంది. కొన్నింటికి అసలు ఎంత ఖర్చు చేస్తారో కూడా ఇతమిద్దంగా చెప్పలేదు. ప్రజారోగ్య వ్యవస్థను మెరుగు పరుస్తాం, అంటు వ్యాధుల కోసం ప్రత్యేకంగా బ్లాకులు ఏర్పాటు చేస్తాం అని చేసిన ప్రకటన ఈ కోవలోకే వస్తాయి. ఇవి సాధారణ బడ్జెట్‌లో ఉండే విషయాలే. ఇక ‘వన్‌ నేషన్‌ వన్‌ కార్డ్’‌ వంటివి గతంలో ప్రకటించినవే. కొత్తవి కావు. రైతాంగాన్న ఆదుకోవటానికి దేశ వ్యాప్త మార్కెటింగ్‌ అవకాశాలు ఏర్పరుస్తాం అన్నారు. చిన్న, సన్నకారు రైతులు తమ పంటను ఊరు దాటి మార్కెట్‌ చేసుకోవటమే కష్టం. ఇతర రాష్ట్రాలకు వెళ్లి అమ్ముకునే అవకాశం క్షేత్ర స్థాయిలో ఉంటుంది. కేంద్రం నిర్ణయం వల్ల కార్పొరేట్ సంస్థలు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున తక్కువ ధరకు రైతుల నుంచి పంటలు కొని కోల్డ్‌ స్టోరేజిల్లో భద్రం చేసే అవకాశం ఉండవచ్చు. వాటిని నచ్చిన సమయంలో ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం వారి చేతుల్లోకి వెళుతుంది. ఆహార ఉత్పత్తులు, మార్కెట్‌ పై కార్పొరేట్‌ సంస్థలకు గుత్తాధిపత్యం ఏర్పడితే భవిష్యత్తులో ధరలు పెరగే ప్రమాదం ఉంటుంది. ఇక మరీ విచిత్రం ఏమిటంటే విమానయానం, బొగ్గు తవ్వకాలు, అంతరిక్ష రంగం వంటి కీలక రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను పెంచుతాం అని కేంద్రం ప్రకటించింది. ఇవి విధానపర నిర్ణయమే కాని, ఆర్ధిక ప్యాకేజీలో భాగం ఎలా అవుతుంది? దీనిలో కేంద్రానికి రూపాయి అయినా ఖర్చు అవుతుందా? పైగా ప్రైవేటు రంగానికి రహదారి వేస్తారు కనుక ఇంకా ప్రభుత్వానికే అదనంగా నిధులు వస్తాయి. ఏ రకంగా చూసినా కేంద్రం చెప్పిన ప్యాకేజీకి, వాస్తవంగా చేసే ఖర్చు లెక్కపెడితే రెండున్నర లక్షల కోట్ల నుంచి నాలుగు లక్షల కోట్లకు మించి ఈ ఖర్చు ఉండదని ఆర్ధిక వేత్తల చేస్తున్న విశ్లేషణలను బట్టి అర్థమవుతుంది. చెబుతున్నారు. ఇది దేశ జీడీపీలో ఒకటి నుంచి రెండు శాతానికి మించి ఉండదు.

ఒక ఉదాహరణ:
ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల దగ్గరకు వెళదాం. దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరశ్రమలు …ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ.. ల్లో 99.9 శాతం సూక్ష్మ తరహా పరిశ్రమలే. గత కొంత కాలం నుంచి కొనసాగుతున్న ఆర్ధిక వ్యవస్థ మందగమనం వల్ల చిన్న తరహా పరిశ్రమలు ఇప్పటికే కష్టాలతో సహజీవనం చేస్తున్నాయి. తాజా లాక్‌డౌన్‌తో వీటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒకటి తమ ఉత్పాదనలకు గిరాకీ లేదు. అసలు ఉత్పత్తి చేపట్టాలన్నా కార్మికులు అందుబాటులో లేరు. వలస కార్మికులు ఎదుర్కొంటున్న లాక్‌డౌన్‌ సంక్షోభం వల్ల వలస సొంత ఊర్లకు మళ్లాయి. దీనితో కార్ఖానా ముందుకు కదిలే పరిస్థితి లేదు. ఉపాధి కల్పనలో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలే దేశానికి ఆధారం. వీటిని ప్రభుత్వం ఆదుకోకపోతే వేలాది పరిశ్రమలను మూత వేసుకోవటం మినహా వీటి ముందు మరో మార్గం లేదు. తాజా ప్యాకేజీలో కేంద్రం ఎమ్‌ఎస్‌ఎమ్ఈలకు రుణ సదుపాయాలు కల్పించింది. పైగా ఈ రుణాలకు కేంద్రమే భరోసా ఉంటానంది. బాగుంది. ఈ చర్య అవసరమే. కాని ఇదొక్కటే సరిపోతుందా? వస్తు ఉత్పత్తికి గిరాకీ లేకపోతే ఏ పారిశ్రామిక వేత్త అయినా రుణం ఎందుకు తీసుకుంటాడు, తీసుకుని ఏం చేస్తాడు? పైగా ఇవి షరతులు లేని రుణాలు మాత్రమే. రుణ భారం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల పైనే ఉంటుంది. ఒక వేళ రుణాలు తీసుకుని ఎగ్గొడితే మాత్రం కేంద్రం చెల్లించాల్సి వస్తుంది. ఈ రుణాలు తీసుకోవటం, ఎగవేత ఈ ఏడాదిలోనే జరిగిపోవు కదా. రుణ చెల్లింపుకు నాలుగు సంవత్సరాల సమయం కేంద్రం ఇచ్చింది. అంటే తక్షణం కేంద్రం భరించాల్సింది నయా పైగా కూడా ఈ ఏడాదికి లేదు. చిన్న పరిశ్రమల విషయంలో. ఇంకా చెప్పాలంటే వంద మంది రుణం తీసుకుంటే అందరూ ఎగవేతదారులుగా మారరు కదా. పదిశాతమో, పదిహేను శాతమో ఎగవేతలుంటాయి. ఈ పరిశ్రమల్లో తిరిగి ఉత్పత్తులు ప్రారంభించటానికి అవసరమైన ముడిసరుకు, కార్మికులకు వేతనాలు, ఇప్పటికే ఉన్నబ్యాంక్‌ రుణాల చెల్లింపు కనీస గడువు పొడిగింపు, విద్యుత్‌ చార్జీల మినహాయింపు, అద్దె బకాయిల వాయుదా, ఉత్పత్తులకు మార్కెటింగ్‌ వసతి వంటివి ఈ రంగం కోరుతోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించిన రుణాల పై మూడు నెలల మారటోరియం వల్ల కూడా చిన్న,సూక్ష్మ తరహా పరిశ్రమలకు ఆర్ధికంగా ఊరట ఇచ్చేవి కావు. కేవలం ఊరట మాత్రమే… ఇప్పుడు రుణ వాయిదా చెల్లించకపోతే తర్వాత వడ్డీ రేటు పెరుగుతుంది. అంటే రుణ భారం పెరుగుతుంది. ఇటువంటి కీలక సమస్యలను కేంద్రం పరిగణలోకే తీసుకులేదు. మరి ప్యాకేజీ వల్ల ఏ రకంగా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగం గాడిన పడుతుంది?

ముక్తాయింపు:
స్థూలంగా చెప్పాలంటే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలోని చాలా అంశాలు కొత్తవి కావు. చెప్పుకున్న అంకెకు వాస్తవంగా ప్రజలకు ఇప్పుడు అందే ప్రయోజనాలకు మధ్య పొంతన లేదు అని ఫిచ్ సొల్యూషన్స్ తన రిపోర్ట్ లో పేర్కొంది. ప్యాకేజీ జీడీపీ లో కేవలం ఒక శాతం మాత్రమే అని విశ్లేషించింది. అన్నింటి కంటే ముఖ్యంగా ఉపాధి అవకాశాలు పెంచటం, ఉద్యోగ భద్రత కల్పించటం, పరిశ్రమలకు ఆర్ధికంగా చేయూత ఇవ్వటం వంటి ఉద్దీపనాలు చేసినట్లయితే ప్రజల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వినియోగం పెరిగినప్పుడు వస్తు, సేవలకు డిమాండ్ పెరుగుతుంది. అది సప్లయ్‌కు మార్గం ఏర్పరుస్తుంది. ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ పునరుజ్జీవం అవుతుంది.

Leave a Reply