Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం…!!

టీఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం తామంటే తామని కాంగ్రెస్‌, ‌బిజెపిలు జబ్బలు చరుచుకుంటున్నాయి. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో గోలకొండపైన జండా ఎగురవేసింది కూడా మేమంటే మేమేనని ప్రచారం చేసుకుంటున్నాయి. ఆ మేరకు ప్రణాళికలనుకూడా సిద్దం చేసుకుంటున్నాయి. అయితే ఈ రెండు పార్టీలను అదుపుచేసే విషయంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కూడా తన సర్వాధికారాలను వినియోగిస్తున్నది. ఏడేండ్లుగా, అంటే ఒక విధంగా తెలంగాణ ఏర్పడినప్పటినుండి అధికారంలో కొనసాగుతున్న టిఆర్‌ఎస్‌ ‌పార్టీపట్ల ఇప్పుడిప్పుడే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఈ రెండు పార్టీలతో పాటు వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ, మాజీ ఐపిఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌నాయకత్వంలో దూసుకొస్తున్న బహుజన సమాజ్‌పార్టీలు కూడా విపరీతంగా పోటీ పడుతున్నాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో గత కొంతకాలంగా రాజకీయ వేడి వాతావరణం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఈసారి ముందస్తు ఎన్నికలు వస్తాయని వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పార్టీలన్నీ దూకుడు పెంచాయి. అధికార పార్టీ తప్పులను ఒక్కొక్కటిగా ఎత్తి చూపుతూ ప్రజాపక్షాలు పోరాటంలో ఎవరికి వారు ముందున్నట్లుగా ప్రకటించుకోవడానికి తహతహలాడుతున్నాయి.

ముఖ్యంగా అధిక సంఖ్యలో ఉండే రైతాంగాన్ని, యువకులను ఆకట్టుకునే విషయంలో ఈ పార్టీలు పోటీ పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన నిరుద్యోగం, వరి ధాన్యం కొనుగోలు, ఉద్యోగ ఉపాధ్యాయ బదిలీలను ఇరకాటకంలో పెట్టిన 317 జీఓ సమస్యలపై దాదాపు అన్ని ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ఇరుకునపెట్టే విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడంలేదు. అయినప్పటికీ ఒక వేళ ముందస్తు ఎన్నికలే సంభవిస్తే అధికార టిఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ‌బిజెపిల మధ్యనే తీవ్రపోటీ ఉండే అవకావాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమేరకు ఈ రెండు పార్టీలే ఇప్పుడు ఎక్కువ దూకుడుగా ముందుకు పోతున్నాయికూడా. ఈ రెండు పార్టీలకు రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్న వ్యక్తులిద్దరు యువకిశోరాలె. వీరిద్దరు కూడా అధికార పార్టీని నిలదీయటంలో మాటల తూటాలు పేల్చే విషయంలో దాదాపు సమాన స్కందులే.

వీరిద్దరికీ యువకుల్లో మంచి ఫాలోయింగ్‌ ఉం‌ది. కాని రాష్ట్ర రాజకీయాలను పరిశీలించినప్పుడు క్రమేణ కాంగ్రెస్‌ ‌గ్రాఫిక్‌ ‌పడిపోతూ ఉంటే, అదేసమయంలో బిజెపి గ్రాఫిక్‌ ‌పెరుగుతూ వస్తోంది. ఇంతవరకు జరుతూ వచ్చిన ప్రతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తన పూర్వపు ఔన్నత్యాన్ని నిలుపుకోలేకపోవడమే ఇందుకు కారణం. దానికి మరో కారణం ఆ పార్టీలో మొదటినుండి ఉండే అంత:కలహాలు అలానే కొనసాగుతూ ఉండ డమే. ఈ దశలో పార్టీని ఒడ్డుకు పడేసే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని ఆ పార్టీ అధిష్టానం యువకుడైన రేవంత్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది. కాని, వెనుకటి గుణమేలమాను.. అన్నట్లు రేవంత్‌రెడ్డి పెద్దరికాన్ని పార్టీలోని చాలా మంది సీనియర్లు నేటికీ ఇష్టపడడంలేదనడానికి అనేక దృష్టాంతరాలున్నాయి. ఆయనకు పిసిసి అధ్యక్ష పదవిని కట్టబెట్టడాన్ని మొదట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విహెచ్‌ ‌హన్మంతరావు లాంటి పలువురు సీనియర్లు జీర్ణించుకోలేక పోయారు.

మరి కొందరు బహాటంగా విభేదించక•పోయినా నేటికీ సహాయ నిరాకరణ కొనసాగిస్తున్నారు. దీని ప్రభావం రాష్ట్రంలో జరిగిన పలు ఎన్నికలపై పడింది. ముఖ్యంగా ఆయన పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార ప్రతిపక్షాలకు సవాలుగా మారిన హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌గెలుపు మాట ఎట్లున్నా కనీసం దరిదాపు వోట్లను కూడా సాధించలేక పోవడం ఆ పార్టీ నేతల కృషి ఏమేరకున్నదన్నది అర్థమవుతున్నది. కాంగ్రెస్‌ ‌పార్టీకి వోటు బ్యాంకుకేమీ కొదువ లేకున్నా, వాటిని సమకూర్చు కోవడంలో ఫెయిల్‌ అయిందన్న వాదన ఉంది. ఇదే సమయంలో భారతీయ జనతాపార్టీ ఆ అవకావాన్ని అందిపుచ్చుకుంది. టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ను తీవ్రంగా విభేదించి నిలిచిన ఈటల రాజేందర్‌ను గెలిపించుకోవడంలో బిజెపి ఒక విధంగా భూమి ఆకాశాన్ని ఒకటిచేసింది. రాష్ట్ర నాయకులతోపాటు జాతీయ నాయకులతో ప్రచారం చేయించింది. ఎట్టి పరిస్థితిలో ఈ స్థానాన్ని గెలిపించుకోవడం ద్వారా టిఆర్‌ఎస్‌కు భవిష్యత్‌లో ప్రత్యమ్నాయం తామేనని చెప్పే విషయంలో ఒక విధంగా సఫలమైందనే చెప్పాలే.

ఈ గెలుపులో స్వతహాగా ఈటల రాజేందర్‌ ‌కృషి ఉన్నా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వెనుక యావత్‌ ‌పార్టీ నిలబడింది. కాని, ఇదే హుజురాబాద్‌లో తమ అభ్యర్థిని గెలిపించు కోవాలన్న పట్టుదల కాంగ్రెస్‌ ‌నాయకుల్లో మాత్రం కనిపించలేదు. అంతెందుకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సంజయ్‌ను అరెస్టు చేస్తే ఒక విధంగా క్షణాల మీద కేంద్ర నాయకత్వం ఇక్కడ వాలి, ఆయనకు మద్దతుగా నిలిచింది. ఇదే కాంగ్రెస్‌లో రోజుకో నాయకుడు ఏదో కారణంతో రేవంత్‌ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వారిని వారించి రేవంత్‌కు అండగా మేమున్నామని అధిష్ఠానం అభయమివ్వలేక పోతున్నది. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్‌కు ప్రత్యమ్నాయం ఎలా అవుతుందో కాంగ్రెస్‌ ఆలోచించుకోవాల్సిన అవసరముంది.

Leave a Reply