యువరాజు పట్టాభిషేకానికి వేళాయె..!

తెలంగాణ రాష్ట్రంలో యువరాజు పట్టాభిషేకానికి ముహూర్తం సమీపించినట్లుంది. పట్టాభిషేకంపై చాలా కాలంగా నలుగుతున్న చర్చలకు ముగింపుదశ వచ్చినట్లు కనిపిస్తున్నది. ఇటీవల యువరాజు కార్యక్రమాల జోరు చూస్తుంటే అందుకు రంగం సిద్దమవుతున్నట్లుగానే ఉంది. వాస్తవంగా రాష్ట్రంలో గత ముందస్తు ఎన్నికలు జరిగినప్పటినుండి ఈ విషయమై విస్తృత ప్రచారం జరుగుతూనే ఉంది. రాష్ట్ర క్యాబినెట్‌లోని బాధ్యతాయుతమైన మంత్రులు, శాసనసభ్యులు ఒకరితర్వాత ఒకరు ఏదోఒక సందర్భంలో ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని బాహాటంగానే వ్యక్తం చేస్తూన్నారు. ఇటీవల కాలంలో యువరాజుపట్ల తమ అభిమానాన్ని మరింతగా చాటుకునే  ప్రయత్నాలు ముమ్మరమైనాయి. తాజగా రాష్ట్ర పంచాయితీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్‌ ‌జిల్లాలో దీనిపై భవిష్యవాణిని వినిపించడంతో నిప్పులేనిదే పొగరాదన్న ట్లుగా అంతర్ఘతంగా ఏదో జరుగుతున్నదన్న విషయం స్పష్టమవుతున్నది.

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌తర్వాత అంత సమర్థవంతమైన వ్యక్తిగా ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు గుర్తింపు లభించిన విషయం తెలిసిందె. కెసిఆర్‌ అదృష్టమేమోగాని ఆయన సంతానంకూడా ఆయనలాగానే వాక్చాతుర్యాన్ని అలవర్చుకున్నారు. కొడుకు,కూతురు ఇద్దరుకూడా తెలుగులో ఎంతస్పష్టంగా మాట్లాడగలరో, హిందీ, ఇంగ్లీషులో కూడా అంతే అనర్గళంగా మాట్లాడే చాతుర్యాన్ని సంపాదించుకున్నారు. కెటిఆర్‌ ‌విషయానికొస్తే  టిఆర్‌ఎస్‌- ‌బిఆర్‌ఎస్‌గా మారకముందునుండే ఆయన ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుకావడంతో పార్టీ మీదకూడా మంచి పట్టు లభించినట్లైంది. దానికితోడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు కెసిఆర్‌ ‌ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే తన వారసుడికి తర్ఫీదు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు ఇటీవల జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు మొదలు వివిధ జిల్లాల్లో ఏదో ఒక కార్యక్రమం అంటే అది పార్టీ సమావేశం కావచ్చు, శంఖుస్థాపనలు, భవనాల, పథకాల ప్రారంభోత్సవాలంటూ కెటిఆర్‌ ఇటీవల కాలంలో బిజీబిజీగా తిరుగుతున్నారు. టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా పేరుమార్చి జాతీయ పార్టీగా ఆవిష్కరించిన తర్వాత దేశ రాజధాని దిల్లీలో ఆ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కూడా వెళ్ళనంతగా ఆయన రాష్ట్ర కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు.

దిల్లీ కార్యక్రమానికి దాదాపుగా కెసిఆర్‌ ‌కుటుంబం యావత్‌ ఒక రోజు ముందునే అక్కడికి చేరుకున్నా కెటిఆర్‌ ‌మాత్రం వెళ్ళలేదు. అంతెందుకు తాజాగా జరిగిన శాసనసభ వ్యవహారాలను పరిశీలించిన ఎవరికైనా భవిష్యత్‌ ‌ముఖ్యమంత్రిగా కెటిఆర్‌ను ఎలా ఎక్స్‌పోస్‌ ‌చేశారన్నది ఇట్టే అర్థమైపోతుంది. సహజంగా శాసనసభ బడ్జెట్‌ ‌సమావేశాల్లో గవర్నర్‌ ‌ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రిదే ఉంటుంది. ఒక వేళ ముఖ్యమంత్రి సభలో లేనిపరిస్థితి వస్తే శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రసంగిస్తారు. ఒకవిధంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి తన పరిపాలనా విధానాన్ని ప్రజలకు తెలియజేసే అవకాశాన్నిస్తుంది. కాని, ఇక్కడ ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌కు ఆ అవకాశం లభించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి, విద్యుత్‌, ‌సింగేణి, బయ్యారం లాంటి పలు విషయాలపై చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం చెప్పే విషయంలో ఆయన ముందున్నారు. అన్ని విషయాలపైన ఆయనకు సంపూర్ణ అవగాహన ఉందనడంలో సందేహం లేదు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు  వరంగల్‌ ‌జిల్లా రాయపర్తిలో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.

సమర్థవంతమైన యువనాయకుడు తమ పార్టీకి  లభించడం తాము చేసుకున్న సుకృతమంటారాయన. ఐటి శాఖ మంత్రిగా ప్రపంచవ్యాప్తంగా తమ ప్రభుత్వం చేపడుతున్న నూతన పారిశ్రామిక విధానాన్ని తెలియజెప్పి, తెలివిగా కోట్లాది రూపాయల వందల పరిశ్రమలను తెలంగాణకు తీసుకురాగలిగిన నేర్పరిగా ఆయన్ను ఎర్రబెల్లి ప్రస్తుతించారు. కేవలం ఎర్రబెల్లే కాదు గత రెండు మూడు సంవత్సరాలుగా వివిధ మంత్రులు  కాబోయే ముఖ్యమంత్రి కెటిఆర్‌ అం‌టూ బల్లగుద్ది చెబుతున్నారు. గతంలో మంత్రి మల్లారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాసయాదవ్‌లతో పాటు ఇటీవల డోర్నకల్‌ ఎంఎల్‌ఏ, ‌సీనియర్‌ ‌నాయకుడు రెడ్యానాయక్‌, ‌భూపాలపల్లి ఎంఎల్‌ఏ ‌గండ్ర వెంకట రమణారెడ్డిలాంటివారున్నారు. అంతెందుకు తాజా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా స్టేషన్‌ఘనపూర్‌ ‌నియోజక వర్గంలో పర్యటించినప్పుడు ఆ పార్టీ సీనియర్‌ ‌నాయకుడు ఎంఎల్సీ, మాజీమంత్రి  కడియం శ్రీహరి, స్థానిక ఎంఎల్యే రాజయ్యలు కెటిఆర్‌ ‌వేదికపై ఉండగానే పెద్దఎత్తున నినాదాలు చేశారు. గతంలో ఇలా ఎవరైనా నినాదాలు చేస్తే వారించే కెటిఆర్‌ ‌మౌనం దాల్చటం అర్థాంగీకారమన్నది స్పష్టమవుతున్నది. కెసిఆర్‌ ‌రాజకీయాల్లో ఉన్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి అని సమాధానం చెప్పే కెటిఆర్‌ ఇప్పుడు ఆ మాట అనటంలేదు. ఇదిలా ఉంటే రాష్ట్ర రాజధానిలో ఇటీవల మెట్రో సెకండ్‌ ‌ఫేస్‌ ‌పనులకు భూమిపూజ చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌మాటలుకూడా దీనికి వత్తాసు పలికేటివిగా ఉన్నాయి.  భవిష్యత్‌లో కెటిఆర్‌ ‌సారథ్యంలో మరింత ముందుకు వెళ్ళాల్సి ఉందనడాన్నిబట్టి కెటిఆర్‌ను ముందుకు తోస్తున్నట్లు  స్పష్టమవుతున్నది. ప్రస్తుత కెసిఆర్‌ ‌ప్రభుత్వ కాలపరిమితి ఈ సంవత్సరాంతంతో అంతమవుతుంది. అంటే ఇంకా ఆరు నెలల సమయముంది. కెసిఆర్‌ ఇప్పుడ జాతీయ రాజకీయలపైన ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్న దృష్ట్యా, రాష్ట్రరాజకీయాలను పూర్తిగా కెటిఆర్‌కు అప్పగించేస్తాడనుకుంటున్నారు. అయితే డిసెంబర్‌లోగా కెటిఆర్‌ను ముఖ్యమంత్రిగా చేస్తారా లేక వచ్చే ఎన్నిక)వరకు అగుతారా అన్నది ఒక్క కేసిఆర్‌కు మాత్రమే తెలిసిన విషయం.

గెస్ట్ ఎడిట్‌….. ‌మండువ రవీందర్‌రావు

Comments (0)
Add Comment